breaking news
mondal
-
లెక్కలు.. చిక్కులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భూభారతి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఐదు మండలాల్లోని ఒక్కో గ్రామంలో చేపట్టిన భూముల రీసర్వే పైలెట్ ప్రాజెక్టు బాలారిష్టాలను దాటడం లేదు. ఈ ఏడాది మే నెలలో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు, సంగారెడ్డి జిల్లా వట్పల్లి, నారాయణపేట జిల్లా మద్దూరు మండలాల్లోని ఒక్కో గ్రామంలో పైలెట్ ప్రాజెక్టుగా సర్వే చేపట్టారు.ఆమనగల్లులో సర్వే మొదలు కాకపోగా.. మిగిలిన గ్రామాల్లో వెలుగు చూసిన సమస్యల పరిష్కారానికి సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. రికార్డుల్లో ఉన్న పేర్లు.. క్షేత్రస్థాయిలో లేకపోవడం, క్షేత్రస్థాయిలో ఉంటే రికార్డుల్లో లేకపోవడం, వారసత్వంగా పంచుకున్న భూములు పహాణీల్లో లేకపోవడంతో గందరగోళం నెలకొంది. సర్వే ద్వారా ప్రతీ రైతు భూమికి మ్యాప్ ముద్రించి, సరిహద్దులు ప్రకటించి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలనేది పైలెట్ ప్రాజెక్టు లక్ష్యం. ఎక్కడ చూసినా సమస్యలే.. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన ప్రతీ గ్రామంలో సమస్యలు వెలుగు చూశాయి. పూర్వ కాలం నుంచి సరైన రికార్డులు లేకపోవడం, ప్రధానంగా వారసత్వ భూముల పంపకం పూర్తయినా, రికార్డుల్లో లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ⇒ భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం దురదపాడులో పండా ముత్యాలు కుటుంబానికి దశాబ్దాల కాలంగా సర్వే నంబరు 76లో 10 ఎకరాలు సాగుభూమి ఉన్నా హక్కు పత్రాలు లేవు. ⇒ సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాద్‌నగర్‌లో కొందరు రైతులకు పట్టాపాసు పుస్తకంలో ఉన్న దానికన్నా తక్కు వగా, ఇంకొందరికి ఎక్కువగా ఉంది. మరికొందరికి పట్టా ఉన్నా.. క్షేత్రస్థాయిలో లేకపోవడం, క్షేత్రస్థాయిలో ఉన్నా పట్టా లేకపోవడం వంటి సమస్యలు వెలుగు చూశాయి. అందరి ఆమోదంతోనే.. ఐదు గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టు సమస్యల తీవ్రతను చాటింది. ప్రస్తుతం గ్రామాల్లో ఎన్ని ఎకరాల భూమి, ఎవరి పేరుతో ఎంత, ప్రభుత్వ భూములు, ఆబాదీ భూములను ప్రాథమికంగా నిర్ధారించారు. రైతుల భూములకు సంబంధించి నోటీసులను ఇవ్వగా అభ్యంతరాలు స్వీకరించనున్నారు. పూర్తి సర్వే తర్వాత సరిహద్దులు, సర్వే నంబర్లు నిర్ధారించి.. గ్రామసభల్లో రైతుల ఆమోదంతో రికార్డుల్లోకి ఎక్కిస్తారు. వారసత్వ పట్టాలు లేక.. దురదపాడు గ్రామానికి చెందిన పాయం వీరస్వామి కొడుకు రామారావుకు వారసత్వంగా 1.5 ఎకరం, ఆయన సోదరుడు ధర్మరాజుకు 1.5 ఎకరం పంచి ఇద్దరికీ హక్కు పత్రాలు మంజూరు చేయాల్సి ఉంది. కానీ పాత రికార్డులే కొనసాగుతున్నా యి. వారసత్వ పట్టాలు కాక పట్టాదార్ పేరిటే కొనసాగుతోంది. సర్వే అనంతరం హక్కు పత్రాలు వస్తాయని ఆశిస్తున్నారు.వెలుగు చూసిన కొన్ని సమస్యలు⇒ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో 3,784.01 ఎకరాల భూమి ఉంది. రైతుల భూములు పోగా.. సాగునీటి కాల్వలు 40.02 ఎకరాలు, ప్రభుత్వ భూము లు, ఆబాదీ (గ్రామ స్థలం, చెరువులు, రహదారులు, డొంక) 419.05 ఎకరాలు, పాస్‌బుక్‌లు లేని సాదాబైనామా 123.11 ఎకరాలు ఉన్నాయి. సర్వే ప్రకారం వేయి మంది రైతులకు నోటీసులు జారీ చేయగా, ఇంకో 400 మందికి ఇవ్వాల్సి ఉంది. ⇒ భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట మండలం దురదపాడులో 15,975.16 ఎకరాల భూమి ఉంది. ఇందులో సాగులో ఉన్న అసైన్డ్ భూమి 4,054 ఎకరాలు, పట్టా భూములు 267.21 ఎకరాలు, అటవీ భూమి 11,653.20 ఎకరాలు ఉన్నాయి. అయితే, సర్వే నంబర్ 76లో 1950–1976 ఏడాది మధ్యలో 15.19 ఎకరాలే రెవెన్యూ రికార్డుల్లో నమోదై మిగతాది అటవీ భూమిగా చూపుతోంది. దీంతో ఇక్కడ సాగు చేసుకుంటున్న రైతులకు హక్కులు లేవు. ⇒ సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం షాద్‌నగర్‌లోని 21 సర్వే నంబర్లలో 593.24 ఎకరాల భూవిస్తీర్ణం ఉండగా సర్వేలో 592 ఎకరాలే గుర్తించారు. రైతులకు నోటీసులు అందిస్తే 63 మంది అభ్యంతరాలు చెప్పారు. ⇒ నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని ఖాజీపూర్‌లో 25 మంది రైతుల నుంచి ఫిర్యాదులు అందాయి. దశాబ్దాలుగా పరిష్కారం కాని 13 భూసమస్యలను పరిష్కరించారు. ఇతర సమస్యలపై 12 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ⇒ రంగారెడ్డి జిల్లాలో మండల కేంద్రమైన ఆమనగల్లును పైలెట్‌గా ఎంపిక చేశారు. వారంక్రితం అవగాహన కోసం సదస్సు పెడితే తక్కువగా హాజరయ్యారు. ఆమనగల్లులోని 1,571 సర్వేనంబర్లలో 15,778 ఎకరాల భూమి ఉండగా.. ఇందులో రైతులకు ఎంత, ప్రభుత్వ భూమి ఎంత అనేది సర్వే చేయనున్నారు. ఎకరం 14 గుంటలే చూపుతున్నారు.. నా పాస్ పుస్తకంలో ఒక ఎకరం 29 గుంటలు ఉంటే.. సర్వే తర్వాత ఎకరం 14 గుంటలే చూపుతున్నారు. ఓ చోట 6 గుంటలు, మరో చోట 8 గుంటలు కొనుగోలు చేసి రికార్డుల్లో ఎక్కించుకున్నా. మొత్తం భూమి రికార్డుల్లో ఉన్నా నోటీసులో మాత్రం తక్కువగా చూపారు – సలిగంటి చిన్న మల్లయ్య, కాకరవాయి పరిష్కారం చూపలేదు.. మా గ్రామంలో 40 ఎస్సీ కుటుంబాలకు సంబంధించి ఒకటే బిట్ ఉంది. 178, 111 సర్వే నంబర్లలో దాదాపు 20 ఎకరాల భూమి ఉంది. దీనికి భాగ పరిష్కారం కావాలి. భూభారతి పైలెట్ ప్రాజెక్ట్‌గా మా గ్రామం ఎంపికవడంతో దరఖాస్తులు పెట్టినా పరిష్కారం కాలేదు. ఆ భూమి ఇంకా మా ముత్తాతల పేరుతోనే ఉంది. – సాయిలు, ఖాజీపూర్, మద్దూరు -
ప్రదాన నిందితుని ఎన్కౌంటర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో నాలుగోతేదీన స్నేహితురాలికి పుట్టినరోజు బహుమతి కొనేందుకు బయటకు వెళ్లి అదృశ్యమై సరస్సులో శవమై తేలిక 11 ఏళ్ల బాలిక అత్యాచారం, హత్యోదంతంలో బుధవారం ప్రధాన నిందితుడు ప్రభాస్ మొండల్‌ను పశ్చిమబెంగాల్ పోలీసులు ఎన్కౌంటర్లో హతమార్చారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్‌ను ఇటీవల ఎన్నికల్లో ఓడించి అధికారంలోకి వచ్చిన సువేంధు అధికారి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇది తొలి పోలీస్ చర్యగా నిలిచిపోయింది. ఎన్కౌంటర్ వివరాలను సీనియర్ పోలీస్ అధికారి మీడియాకు వెల్లడించారు. హత్యాచార ఘటన పూర్వాపరాలను తెల్సుకునేందుకు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సుర్జాపూర్ హాట్‌లోని ఘటనాస్థలికి మంగళవారం అర్ధరాత్రిదాటాక 12.45 నిమిషాలకు నిందితుడిని పోలీసులు తీసుకెళ్లారు. అదే సమయంలో పోలీసుల నుంచి సరీ్వస్ తుపాకీని తీసుకుని మొండల్ పోలీసులపైకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆత్మరక్షణ కోసం పోలీసులు వెంటనే ఎదురుకాల్పులు జరిపారు. దీంతో బుల్లెట్ గాయాలతో రక్తమోడుతున్న నిందితుడిని హుటాహుటిన సమీప బారుయ్‌పూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు ధ్రువీకరించారు. బాలికను చంపేసి గోనెసంచిలో కుక్కి కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నప్పుడే కొలనులో పడేశారన్న వార్త తెలిసి నాలుగురోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు, ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్కౌంటర్ జరగడం గమనార్హం. మేజి్రస్టియల్ విచారణ తర్వాత ప్రధాన నిందితుడు మొండల్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ నిర్వహించనున్నారు. మరోవైపు ఇదే ఉదంతంలో కబీర్ మొల్లా అనే మరో నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్ట్‌చేశారు. ఆనంద్ సర్దార్, దివాకర్ సర్దార్లను గతంలోనే అరెస్ట్‌చేశారు. గతంలోనే ప్రభాస్ మొండల్‌నూ అరెస్ట్‌చేయగా ఈ కేసులో మొత్తంగా అరెస్టుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ముగ్గురు నిందితులు ఉన్నారు. హత్యోదంతం వెలుగుచూసిన కొన్ని గంటలకే ఈ ఘటనలో సంబంధం ఉందనే అనుమానంతో ఒకతడిని స్థానికులు కొట్టి చంపిన విషయం తెల్సిందే. వాడి శవం నాకు అక్కర్లేదు: తల్లి పోలీసు ఎన్కౌంటర్లో నీ కుమారుడు చనిపోయాడని తల్లి సంధ్యా మొండల్‌కు అధికారులు సమాచారం ఇవ్వగానే ఆమె ఆగ్రహంగా స్పందించారు. ‘‘చెడు అలవాట్లకు బానిసైన వాడు నా కొడుకే కాదు. వాడి మృతదేహాన్ని నేను తీసుకోను. తాగుడు మానేయమని ఎన్నిసార్లు మొత్తుకున్నా వినిపించుకోలేదు. వాడు చనిపోయినా నాకు ఏమాత్రం బాధ లేదు. బాలికను దారుణంగా హింసించినందుకు వాడికి తగిన శాస్తి జరిగింది. మార్చురీలో వాడి ముఖం చూసేందుకు కూడా నేను వెళ్లను. నేనే కాదు మా కుటుంబంలో ఎవరూ వాడి మృతదేహాన్ని తెచ్చుకోము’’అని తల్లి తెగేసి చెప్పారు. నేనూ బాధితురాలినే: మొండల్ భార్య భర్త మృతిచెందాక ప్రధాన నిందితుని భార్య చంపా స్పందించారు. ‘‘నా భర్త అమాయకుడు, ఈ నేరం చేయలేదు అని నేను చెప్పను. తనతో జీవిస్తూ ఎన్నో బాధలు పడ్డా. హత్యోదంతంలో ఇతని పేరు విన్పించగానే ఇలాంటిదేమో చేసే ఉంటాడని ముందుగానే ఊహించా. పెళ్లయిన నాటి నుంచి వేధింపులకు గురిచేశాడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవాడు. ఏ పనీ చేసేవాడు కాదు’’అని ఆమె తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై భిన్నాభిప్రాయాలు ప్రధాన నిందితుడు ఎన్కౌంటర్లో హతమవడంతో ఈ ఘటనకు సరైన న్యాయం జరిగిందని బీజేపీ వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో 2013లో కామ్‌ధునీలో 20 ఏళ్ల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసునూ తిరిగితోడి నిందితులకు ‘సరైన’శిక్ష పడేలా చేయాలని బీజేపీ అధికార ప్రతినిధి దేవ్జీత్ సర్కార్ అన్నారు. అయితే ఎన్కౌంటర్లో నిందితుడిని హతమార్చడాన్ని టీఎంసీ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘సువేందు సర్కార్‌కు రాష్ట్ర పోలీసులపై నియంత్రణ ఉందా? రాష్ట్రంలో బెంగాల్–ఉత్తరప్రదేశ్ 2.0ను విధానం అమలుచేద్దామని చూస్తున్నారా? బెంగాల్లో బీజేపీ పాలన ఉందా? ఎన్కౌంటర్లో చంపేయడం అంటే ఆటవికంగా పాలించడమే’’అని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ర్యాలీలో బాహాబాహీ.. బాలిక హత్యోదంతాన్ని నిరసిస్తూ బుధవారం కోల్‌కతాలోని హజ్రా రోడ్లో టీఎంసీ నేతలు, కార్యకర్తలు చేపట్టిన నిరసన ర్యాలీని బీజేపీ కార్యకర్తలు అడుగడుగునా అడ్డుకున్నారు. దొంగలు అని నినదిస్తూ అవాంతరాలు సృష్టించారు. మానవహారంగా నిలబడి ర్యాలీని అడ్డుకోవడంతో ఆగ్రహంతో టీఎంసీ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇదికాస్త తోపులాటగా మారింది. కార్యకర్తలు పిడిగుద్దులు కురిపించుకున్నారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపుతప్పకుండా నిలువరించారు. -
క్రెడిట్ కార్డుల వ్యాపారంలోకి సీఎస్బీ బ్యాంక్
న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డుల వ్యాపార విభాగంలోకి ప్రవేశించనున్నట్లు సీఎస్బీ బ్యాంక్ ఎండీ (తాత్కాలిక) ప్రళయ్ మండల్ వెల్లడించారు. ఇందుకోసం అవసరమైన టెక్నాలజీని పటిష్టపర్చుకుంటున్నట్లు చెప్పారు. క్రెడిట్ కార్డులతో పాటు ఇతరత్రా ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టడంపై కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. 2028–29 నాటికి రిటైల్ విభాగం మొత్తం వ్యాపారంలో అతి పెద్దదిగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు మండల్ తెలిపారు. బంగారం రుణాల వృద్ధి నిలకడగా కొనసాగుతోందని, చిన్న..మధ్య స్థాయి సంస్థలకు లోన్లు పుంజుకుంటున్నాయని ఆయన పేర్కొన్నారు. మొండిబాకీలు తగ్గడంతో తొలి త్రైమాసికంలో సీఎస్బీ బ్యాంక్ నికర లాభం 88 శాతం పెరిగి రూ. 115 కోట్లకు చేరింది. -
సాగర్‌ను మండల కేంద్రం చేయాలి
అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతులు అందజేస్తున్న జూలకంటి, నోముల, అఖిలపక్ష నాయకులు నాగార్జునసాగర్ : సాగర్‌ను మండల కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు శుక్రవారం సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డికి, మండలాల పునర్విభజన ప్రత్యేకాధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. పెద్దవూర మండలంలోని చింతలపాలెం, నెల్లికల్లు, తునికినూతల గ్రామ పంచాయతీలను తిరుమలగిరిలో కలుపొద్దని విన్నవించారు. ఈ మూడు పంచాయతీలను కలిపి సాగర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. సాగర్ 10 కిలో మీటర్ల దూరం ఉంటే తిరుమలగిరి 25కిలో మీటర్లు దూరం అవుతుందన్నారు. దామరచర్ల మండలంలోని నడిగడ్డ మండలాన్ని సాగర్‌లో కలిపితే 36వేల జనాభా అవుతుందని మ్యాప్‌తో కూడిన వివరాలతో విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సాగర్‌ను మండల కేంద్రం చేస్తే ప్రభుత్వానికి పైసా ఖర్చు ఉండదని, ఇప్పటికే సాగర్‌లో క్యాంపు కార్యాలయాల పేరుతో అన్ని శాఖలకు ప్రభుత్వ క్వార్టర్లు అలాట్ చేయబడి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పెద్దవూర మండలంలోని మూడు గ్రామపంచాయతీల సర్పంచులు, సాగర్‌కు చెందిన 50 మంది, పెద్దవూర ఎంపీపీ వస్త్రపురి మల్లిక, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్ణబ్రహ్మానందరెడ్డి, అఖిలపక్ష నాయకులు కున్‌రెడ్డినాగిరెడ్డి, రమేశ్‌జీ, రంగానాయక్, సునందారెడ్డి, వాసు, చిన్నిరామస్వామి, రామ్మోహన్రావు, బషీర్, రవినాయక్, జానయ్య, కాటు కృష్ణ సర్పంచులు, చంద్రయ్య,ఏడుకొండలు, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. మండలం నుంచి వీడదీయం పెద్దవూర మండలం నుంచి నెల్లికల్లు, చింతలపాలెం, తునికినూతల మండలాలను విడదీయమని అఖిలపక్ష నాయకులకు మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. అలాగే నాగార్జునసాగర్‌ను గ్రామ పంచాయతీ చేస్తామని అందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని ప్రజాభిప్రాయం మేరకు ఏదైనా జరుగుతుందన్నారు. సీఎం అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో మంత్రిక సమస్యను వివరించారు.


