సాక్షి, హైదరాబాద్: తాడిచెర్ల–2 కోల్ బ్లాక్ కేటాయింపుతో సింగరేణి కార్మికులకు కలగనున్న భరోసాపై బీజేపీ ఆధ్వర్యంలో 13, 14 తేదీల్లో ‘సింగరేణి భరోసా యాత్ర’ను చేపట్టనున్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈయాత్రలో బీజేఎల్పినేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిల్‌లో పక్షనేత ఏవీఎన్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు.
శనివారం బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథరావు మీడియాతో మాట్లాడుతూ.. సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మొదట కొత్తగూడెంలోని సింగరేణి కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్‌లో కార్మికులను కలిసి, ఆ తర్వాత మణుగూరు మీదుగా ప్రయాణించి, రాత్రికి భూపాలపల్లి చేరుకుని అక్కడే బస చేస్తారని చెప్పారు.
మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల.. ఇలా నాలుగు జిల్లాల్లో పర్యటిస్తూ, మూడుచోట్ల బహిరంగ సభలు, ఐదు బొగ్గు గనుల వద్ద కారి్మకులతో గేట్ మీటింగ్స్ ఉంటాయని తెలిపారు. 14న ఉదయం భూపాలపల్లిలోని కేటీకే–8 మైన్ వద్ద కార్మికులను బీజేపీ నేతలు కలిసి మాట్లాడతారన్నారు. అక్కడి నుంచి తాడిచెర్ల–2 బ్లాక్‌ను సందర్శించి, అనంతరం గోదావరిఖనిలోని ఓపెన్ కాస్ట్ గనులను పరిశీలిస్తారని తెలిపారు. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఎస్‌ఆర్‌పీ–3 గనిని సందర్శించి, చివరగా మందమర్రి–చెన్నూరు నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభతో ఈ యాత్ర ముగుస్తుందని తెలిపారు.


