సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో తాత్కాలిక కండక్టర్ల నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని సంస్థ తెలిపింది. ప్రస్తుతం మెదక్ జిల్లాలోని డిపోల పరిధిలో జరుగుతున్న ప్రక్రియ కూడా నిబంధనలను అనుసరించే నిర్వహిస్తున్నట్టు మెదక్ రీజినల్ మేనేజర్ పేరుతో శనివారం జారీ చేసిన ప్రకటనలో ఆర్టీసీ తెలిపింది.
అధికారిక కాంట్రాక్ట్ ఏజెన్సీలను లాటరీ పద్ధతిలో ఎంపిక చేసి ఈ ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఏజెన్సీలు అందజేసిన జాబితాను ప్రాతిపదికగా తీసుకుని మాత్రమే ఎంపిక జరుగుతోందని, ఇందులో మంత్రి పేషీ జోక్యం లేదని తెలిపింది. పదోతరగతి మార్కుల జాబితా, ఆధార్‌కార్డు, అభ్యర్థుల ఎత్తు పరిశీలించి ఎంపిక చేస్తున్నట్టు వెల్లడించింది.


