సాక్షి, హైదరాబాద్: గానకోకిల ఎస్.జానకి మధుర స్మృతులను భాగ్య నగరం గుర్తు చేసుకుంది. శనివారం దివికేగిన ఆమెకు హైదరాబాద్‌తో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. కేవలం సినీ రికార్డింగుల కోసమే కాకుండా, ఆమె వ్యక్తిగత జీవితం, ఆత్మీయ సంబంధాలు కూడా ఇక్కడి ప్రజలతో ముడిపడి ఉన్నాయి. తెలుగు సినీ పరిశ్రమ మద్రాసు (చెన్నై) నుంచి హైదరాబాద్‌కు తరలివచి్చన తర్వాత ఆమె నగరంతో మరింత మమేకమయ్యారు.
సీతాఫల్‌మండి నుంచి..
జన్మతః జానకి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు వాసి అయినప్పటికీ, ఆమె కెరీర్ ప్రారంభ దశ తెలంగాణ ప్రాంతంతో ముడిపడి ఉంది. తండ్రి ఉద్యోగ రీత్యా ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నివసించారు. జానకి సినీ గాన ప్రస్థానాన్ని ప్రారంభించడానికి ముందు సీతాఫల్‌మండిలో ఉన్న మామగారి ఇంట్లో కొంతకాలం గడిపారు. భర్త మరణం తర్వాత, జానకి... కుమారుడు మురళీకృష్ణ కుటుంబంతో కలిసి ఉండడానికి నగరానికి వచ్చారు. బంజారాహిల్స్‌లోనూ, చివరగా మహేశ్వరంలోని బీటీఆర్ విల్లాస్‌లో నివసించారు. మురళీకృష్ణ కూడా నటుడే. ‘వినాయకుడు’ చిత్రంలో నటించారు.
వీనుల విందు..
రవీంద్ర భారతి, లలిత కళాతోరణం, శిల్పకళా వేదిక వంటి ప్రతిష్టాత్మక వేదికలపై ఆమె ఎన్నోసార్లు నగరవాసులకు ప్రత్యక్షంగా వీనుల విందు చేశారు. ప్రముఖ ఛానళ్లు నిర్వహించిన భారీ సంగీత అవార్డుల వేడుకలకు, ప్రత్యేక లైవ్ షోలకు హాజరయ్యేవారు. నగరంలో జరిగే ఏ సంగీత కార్యక్రమానికైనా జానకి వస్తున్నారంటే చాలు, ఆడిటోరియాలు కిక్కిరిసిపోయేవి. సంగీతప్రియులు చూపించే ఆదరణను ఆమె ఎన్నో ఇంటర్వ్యూలలో ప్రత్యేకంగా ప్రస్తావించేవారు.
సినీ సంగీత దిగ్గజాల సాన్నిహిత్యం కారణంగా ఆమె తరచూ నగరానికి రాకపోకలు సాగించేవారు. సద్గురు, సారథి, రామానాయుడు, పద్మాలయ స్టూడియోస్‌లలో పాటల రికార్డింగ్లో పాల్గొన్నారు. దిగ్గజ గాయని ఎస్.జానకి తన ఆరు దశాబ్దాల కెరీర్‌లో నగరం వేదికగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ ద్వారా జీవిత సాఫల్య పురస్కారం, ఏఎన్‌ఆర్ జాతీయ అవార్డులను నగరంలోనే ఆమె స్వీకరించారు.


