తాత పేరు లేదా? ఓటు గోవిందా! | sir voter revision causes trouble for singareni workers with two names | Sakshi
Sakshi News home page

తాత పేరు లేదా? ఓటు గోవిందా!

Jul 12 2026 7:47 AM | Updated on Jul 12 2026 7:47 AM

sir voter revision causes trouble for singareni workers with two names

స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ఉమ్మడి జిల్లావాసులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. ముఖ్యంగా రెండు పేర్లున్న సింగరేణి కార్మికుల కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ఇదే సమయంలో ఇప్పుడు ఓటర్లుగా మారిన వారి పిల్లలకు తాతలు, నానమ్మలు కీలకంగా మారారు. రెండు దశాబ్దాల కింద సొంతూళ్ల వారు వేసిన ఓట్లే ప్రస్తుత సర్‌లో సాయపడుతున్నాయి. 

మారుపేరుతో సింగరేణిలో విధులు నిర్వహించిన పలు సింగరేణి కార్మికులు సర్‌ ప్రక్రియలో తమ సొంత పేర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. 2002లో మారుపేరుతో పనిచేసిన కార్మికుల్లో చాలామంది సొంతూళ్లకు వచ్చాక సొంతపేరుతో ఓటు నమోదు చేయించుకున్నారు. వీరందరి ఓట్లకు మ్యాపింగ్‌ చేసే సమయంలో 2002 జాబితాలో వీరు ఓటేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవు. దీంతో వీరు, కుటుంబ సభ్యులు తమ ఓట్లు పోయినట్లేనని ఆందోళన చెందుతున్నారు.

సింగరేణి పిల్లలకు తాతతో మ్యాపింగ్‌
2002లో సింగరేణిలో మారుపేరుతో పనిచేసిన పలువురు కార్మికుల పిల్లలు మాత్రం సొంత పేర్లతో చదువుకున్నారు. సర్‌ ప్రక్రియ మొదలయ్యాక ఆరంభంలో తల్లిదండ్రుల ఓట్లకు మ్యాపింగ్‌ కుదరక ఆందోళన చెందారు. తల్లిదండ్రులతోపాటు తమ ఓట్లు పోతాయని అనుకున్నారు. పలువురు బీఎల్వోలు, కార్పొరేటర్లు చొరవ తీసుకుని 2002లో వారి తాత లేదా నానమ్మల ఓట్లను ఉమ్మడి జిల్లా వారీగా అన్ని నియోజకవర్గాల్లో మ్యాప్‌ చేసి వారి ఓట్లను మ్యాచ్‌ చేస్తున్నారు. దీంతో సగం సమస్య తీరింది. అప్పటికే వారి తాత నానమ్మలు మరణించి ఉంటే మాత్రం పరిస్థితి తిరిగి మొదటికొస్తుంది.

 ఇప్పటికీ సింగరేణి కార్మికుల రెండు పేర్ల సమస్యపై సర్‌ ప్రక్రియలో తలెత్తిన ప్రతిష్టంభన ఇంకా వీడకపోవడం గమనార్హం. దీంతో కొందరు కార్మికులు పాత పేర్లతో ఓటర్లుగా కొనసాగేందుకు సిద్ధపడుతున్నారు. ఒకప్పుడు 1.2 లక్షలుగా ఉన్న సింగరేణి కార్మికులు దాదాపు 80శాతం వరకు రిటైరయ్యారు. ప్రస్తుతం 40,225 మంది పనిచేస్తున్నారు. మరోవైపు ఉపాధి కోసం 2002కు ముందే గల్ఫ్‌కి వెళ్లిన వారికి సర్‌ ప్రక్రియలో తొలుత ఇబ్బందులు వస్తాయనుకున్నారు. కానీ, వారి భార్య తల్లిదండ్రుల ఓట్ల మ్యాపింగ్‌ చేయడంతో సఫలీకృమవుతున్నారు. దీంతో గల్ఫ్‌ దేశాల కార్మికుల ఓట్లకు ప్రస్తుతం ఎలాంటి డోకా లేనట్లేనని బీఎల్వోలు స్పష్టంచేస్తున్నారు.

మందకొడిగా ప్రక్రియ
ఉమ్మడి జిల్లాలో ‘సర్‌’ ప్రక్రియ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. 12 నియోజకవర్గాల్లో ఫారాల పంపిణీ దాదాపుగా పూర్తయినా.. డిజిటలైజేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. పట్టణ కేంద్రాలుగా పేరొందిన నియోజకవర్గాల కన్నా గ్రామీణ నియోజకవర్గాల్లో సర్‌ డిజిటలైజేషన్‌ వేగంగా సాగుతుండటం గమనార్హం. గ్రామీణుల్లో వలసలు తక్కువగా ఉండటం, ఓటర్లు అందుబాటులో ఉండటం వల్ల బీఎల్వోల పని సులువుగా మారుతుంది. పట్టణ ప్రాంతాల్లో బదిలీలు, వలసలతో ఓటర్లకు బీఎల్వోలు, బీఎల్వోలకు ఓటర్లు దొరకడం లేదు. ఫలితంగా పట్టణ ప్రాంతాల్లో సర్‌ ఫారాల పంపిణీ, డిజిటైలైజేషన్‌ ప్రక్రియ వెనకబడుతోంది. ఉమ్మడి జిల్లాకేంద్రమైన కరీంనగర్‌ అత్యల్పంగా 11శాతం డిజిటలైజేషన్‌ కావడం గమనార్హం.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement