భయం అంచులో... | Sunday Special Story Written By Malladi Venkata Krishnamurthy | Sakshi
Sakshi News home page

భయం అంచులో...

Jul 12 2026 10:32 AM | Updated on Jul 12 2026 10:32 AM

Sunday Special Story Written By Malladi Venkata Krishnamurthy

కథాకళి

ర్పూరవల్లి ఏర్‌ ఇండియా విమానం దిగి న్యూయార్క్‌ ఏర్‌పోర్ట్‌కి చేరుకున్నాక, ఇమిగ్రేషన్‌ ముగించుకుని లగేజ్‌ కేరసోల్‌ దగ్గరకి వెళ్ళింది.
ఓ కుక్క కిందకి దింపిన సూట్‌కేస్‌లను వాసన చూడటం గమనించింది. ఆ కుక్క ఆవిడ సూట్‌కేస్‌ దగ్గరకి వచ్చి వాసన చూసి, ఓదాని మీద ముందు కాళ్లు ఉంచి నిల్చుంది. వెంటనే యూనిఫాంలోని సెక్యూరిటీ గార్డ్‌ తన జేబులోంచి ఏదో తీసి ఆ కుక్క నోటికి అందించి దాన్ని నిమిరాడు. ఆవిడ అతన్ని నవ్వుతూ చూస్తూ అడిగింది.

‘‘నైస్‌ డాగ్‌. వాట్స్‌ హిజ్‌ నేమ్‌?’’
‘‘ఈ రెండు సూట్‌కేసులు మీవేనా?’’ అతను కర్పూరవల్లిని అడిగాడు.
‘‘అవును.’’
‘‘మీ సూట్‌కేసులని మీరే పేక్‌ చేసారా?’’
‘‘అవును. నేనే.’’
‘‘ఈ సూట్‌కేసుల్లో ఏమేం ఉన్నాయో మీకు గుర్తుందా?’’ అతని తర్వాతి ప్రశ్న.
‘‘ఉంది. నా బట్టలు, మందులు, బహుమతి వస్తువులు.’’
‘‘మీరు నా వెంట రావాలి.’’ అతను ఆజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పి ఎడమ భుజం దగ్గరున్న వైర్‌లెస్‌ సెట్‌లో ఎవరికో ఏదో చెప్పాడు.
కొద్ది క్షణాల్లో యూనిఫాంలోని ఇద్దరు సెక్యూరిటీ పోలీసులు ట్రాలీతో అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఆవిడ సూట్‌కేసులను జాగ్రత్తగా ట్రాలీ మీదకి ఎక్కించి నడిచారు.

‘‘నాతో రండి.’’ ఆ గార్డ్‌ ఆవిడతో చెప్పాడు.
‘‘ఎందుకు?’’ ఆవిడ అతని వెంట నడుస్తూ అడిగింది.
అతను ఆవిడ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ‘ఇ¯Œ స్పెక్షన్‌’ అని రాసున్న తలుపులోంచి లోపలికి తీసుకెళ్ళాడు.
‘‘మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నారా?’’ లోపల కూర్చున్న ఓ అధికారి ప్రశ్నించాడు.
‘‘అవును.’’
‘‘అమెరికాకి ఎందుకు వచ్చారు?’’
‘‘నా కూతురితో గడపడానికి. మీరీ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు?’’ కర్పూరవల్లి ప్రశ్నించింది.
అక్కడికి మరొక కుక్కని తెచ్చారు. అది కూడా సూట్‌కేసుల చుట్టూ తిరిగి ఇందాకటి సూట్‌కేస్‌ మీద ముందు కాళ్ళు పెట్టింది. దాని శిక్షకుడు కూడా దానికి బహుమతిగా తినడానికి డాగ్‌ బిస్కెట్‌ ఇచ్చి, దాన్ని దువ్వి తీసుకెళ్ళిపోయాడు. ఆవిడకి ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంలో పడింది.
‘‘మీకు ఏదైనా టెర్రరిస్ట్‌ సంస్థ మీద సానుభూతి ఉందా?’’ ఆ అధికారి ప్రశ్నించాడు.
‘‘లేదు.’’ ఆవిడ తుళ్ళిపడి జవాబు చెప్పింది.
గార్డ్‌ ఆవిడ హేండ్‌బేగ్‌ని తీసుకుని అందులోని వస్తువులన్నీ బల్ల మీద పోశాడు.
‘‘ఈ సూట్‌కేస్‌లో మీరు ఏం తీసుకొస్తున్నారు? అంగీకరిస్తే తక్కువ శిక్ష పడుతుంది. మా అంతట మేమే కనుక్కుంటే శిక్ష పెరుగుతుంది.’’ అధికారి చెప్పాడు.

‘‘శిక్షా? బయటే ఉంటాడు. మా అల్లుడికి ఫోన్‌ చేస్తాను.’’ కర్పూరవల్లి భయంగా చెప్పింది.
‘‘తర్వాత. నా ప్రశ్నకి జవాబు చెప్పండి.’’
‘‘నేనే నిషిద్ధ వస్తువులు తీసుకురాలేదు.’’ ఆవిడ భయంగా చూస్తూ చెప్పింది.
ఇద్దరు గార్డ్‌లు ఆ సూట్‌కేసులు తెరిచి ఒక్కొక్క సామాను బయటకి తీయసాగారు. ప్రతి డ్రెస్‌ లైనింగ్‌ తడిమి, లోపల ఏదైనా ఉంచి కుట్టారా అని తనిఖీ చేయసాగారు. కర్పూరవల్లి భయంగా, ఆశ్చర్యంగా జరిగేది చూస్తోంది.
ఆవిడ మొబైల్‌ తీసుకుని పాస్‌వర్డ్‌ అడిగి తెరిచి, అందులోని కాంటాక్ట్‌ నంబర్లలోని వారి పేర్లు ఒకొక్కటీ అడిగి వారు ఏమవుతారు అని ప్రశ్నించాడు. అవన్నీ ఇండియాలోని పేర్లు. కొన్ని పేర్లు అతనికి నోరు తిరగలేదు కూడా. ఆవిడలో భయం అధికం అవసాగింది. వాళ్ళు వెతుకుతూంటే అధికారి ఆవిడని ప్రశ్నించసాగాడు.

‘‘అమెరికాకి ఎందుకు వచ్చారు? మీ అల్లుడు ఏం చేస్తూంటాడు? మీ అమ్మాయి ఏం చేస్తుంది? ఇదివరకు ఎప్పుడైనా అమెరికాకి వచ్చారా? మీరు వచ్చిన పని ఏమిటి? ఇండియాలో ఏం చేస్తూంటారు?’’
చివరికి ఆ పెట్టెలో వారు వెతికేది కనిపించింది. వెంటనే ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు.
‘‘వీటిని ఎందుకు కొన్నారు?’’ ఓ గార్డ్‌ ఒకటి తీసి చూపిస్తూ ప్రశ్నించాడు.
‘‘బహుమతిగా కొన్నాను.’’
‘‘ఎవరికి?’’
‘‘మా అల్లుడికి. కిందటిసారి ఇండియా వచ్చినప్పుడు అతను తెచ్చినవి వాళ్ళ స్పాటీకి బాగా నచ్చాయట. వీటిని కొని తెమ్మని మెసేజ్‌ ఇచ్చాడు.’’

వాళ్ళు ఆ పేకెట్స్‌ని విప్పి క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలో డ్రగ్స్‌ గాని, పేలుడు పదార్థాలు కాని లేవని రూఢీ చేసుకున్నాక వివిధ జాతుల కుక్కల బొమ్మలున్న డాగ్‌ ఫుడ్‌ పాకెట్స్‌ చూపించి నవ్వుతూ చెప్పారు.
‘‘వియార్‌ సారీ. చిన్న పొరపాటు. మా రెండు కుక్కలు తమ ఆహారాన్ని పసికట్టాయి. మేం ఇంకేదో అని ఊహించాం.’’
వాళ్ళు బయటికి తీసిన వస్తువులని లోపల ఉంచి మూత మూస్తే అది మూసుకోలేదు. అది గమనించి ఆవిడ మళ్ళీ సర్ది ఒక గార్డ్‌ని కోరింది.
‘‘మా వారు నాతో రాలేదు. దయచేసి మీరు దీని మీద నిల్చుంటే జిప్‌ వేస్తాను.’’
- మల్లాది వెంకట కృష్ణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement