తాడికొండలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు
టీసీలు తీసుకుని వేరే హాస్టళ్లకు వెళ్లాలంటూ తల్లిదండ్రులకు ఫోన్లు
ఆపై రాస్తారోకో
తాడికొండ : ఎంట్రన్స్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఏపీ గురుకుల పాఠశాలల్లో సీట్లు సాధించిన 480 మంది పేద విద్యార్థుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. తాడికొండ ఏపీ గురుకుల సెంటర్‌తో పా టు, విశాఖ జిల్లా మేదాద్రి గడ్డ, తిరుపతి జిల్లా కోట ప్రాంతాల్లోని గురుకులాలను ఎక్సెలెన్స్ సెంటర్లుగా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ సెంటర్లలో ప్రస్తుతం ఉన్న విద్యార్థులను వేరే గురుకులాలకు తరలించి ఇక్కడ సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పేరుతో ఇంటర్‌తో పాటు, జేఈఈ, నీట్‌కు శిక్షణ ఇచ్చేలా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
ఇందులో భాగంగా విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ‘మీ పిల్లలను ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి బదిలీ చేస్తున్నాం.. వచ్చి తీసుకెళ్లండి’.. అంటూ మేసేజ్‌లు పంపడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తాడికొండ గురుకుల పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌ను నిలదీయడంతో పాటు.. రాస్తారోకో నిర్వహించారు. తమ పిల్లలను ఇక్కడ చదివించాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులకు నచ్చజెప్పి.. రాస్తారోకో విరమింపజేశారు.


