చెప్పుతో కొట్టి.. కాళ్లతో తన్ని.. వృద్ధుడిపై టీడీపీ నేత దంపతుల దాష్టీకం | Incident in 43 Udegolam village Anantapur district: TDP Leader attack on old man | Sakshi
Sakshi News home page

చెప్పుతో కొట్టి.. కాళ్లతో తన్ని.. వృద్ధుడిపై టీడీపీ నేత దంపతుల దాష్టీకం

Jul 14 2026 3:55 AM | Updated on Jul 14 2026 3:55 AM

Incident in 43 Udegolam village Anantapur district: TDP Leader attack on old man

అవమానభారంతో పురుగుమందు  తాగి బాధితుడి ఆత్మహత్యాయత్నం       

అనంతపురం జిల్లా 43 ఉడేగోళం గ్రామంలో ఘటన  

కణేకల్లు: అనంతపురం జిల్లా కణేకల్లు మండలం 43 ఉడేగోళం గ్రామంలో టీడీపీ నేత దంపతులు సోమవారం 70 ఏళ్ల వృద్ధుడు మోకా ఆంజినేయులుపై దాడిచేసి కొట్టారు. చెప్పుతోకొట్టి, కాళ్లతో తన్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆంజినేయులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. బాధితుడి కుటుంబసభ్యులు తెలిపిన మేరకు.. గ్రామంలో కొద్దిరోజుల నుంచి తాగునీటి సరఫరా సక్రమంగా లేదు. మోకా ఆంజినేయులు ఇంటికి సొంత కుళాయి ఉంది. నీటిపన్ను బకాయి పడడంతో గతనెలలో టీడీపీ నాయకుల ప్రమేయంతో అతడి పింఛన్‌ డబ్బు నుంచి రూ.2 వేలు మినహాయించుకుని.. మిగిలిన రూ.2 వేలు ఇచ్చారు.

తాగునీటి సరఫరా సరిగా లేదని చెప్పేందుకు ఆంజినేయులు ఆదివారం రాత్రి టీడీపీ నేత మారుతీప్రసాద్‌ ఇంటికి బయలుదేరాడు. మార్గంమధ్యలో ఒక షాపు వద్ద స్థానికులు అడగగా నీళ్లు సరిగా రావడంలేదని మారుతీప్రసాద్‌కు చెప్పేందుకు వెళుతున్నట్లు తెలిపాడు. మారుతీప్రసాద్‌ ఇంట్లో లేడని వారు చెప్పడంతో వెనుదిరిగి ఇంటికి వచ్చేశాడు. నీళ్లు రావడంలేదని ఆంజినేయులు తిట్టుకుంటూ వెళ్లాడని కొందరు మారుతీప్రసాద్‌కు చెప్పారు. ఈ నేపథ్యంలో సోమవారం మారుతీప్రసాద్, లావణ్య దంపతులు.. కౌలుకు తీసుకున్న పొలంలో పనిచేసుకుంటున్న ఆంజినేయులు మీద దాడిచేశారు.

లావణ్య చెప్పుతో కొట్టగా.. మారుతీప్రసాద్‌ కాళ్లతో తీవ్రంగా తన్నాడు. సమీపంలోని పొలంలో పనిచేస్తున్న ఆంజినేయులు కుమార్తె అంజినమ్మ, మనుమడు గోవిందు వచ్చి అడ్డుకున్నారు. మారుతీప్రసాద్, లావణ్య వారినికూడా దుర్భాషలాడారు. పొలం నుంచి ఇంటికొచి్చన ఆంజినేయులు ఆ అవమానభారాన్ని తట్టుకోలేక పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు కణేకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు.  

పోలీసులతోనే కొట్టిస్తా..  
తమ తండ్రిని ఎందుకు కొట్టారని మారుతీప్రసాద్‌ను అడగగా మరింత రెచ్చిపోయి దూషించాడని ఆంజినేయులు కుమారులు భీమన్న, వన్నూరుస్వామి, కుమార్తెలు లలితమ్మ, అంజినమ్మ, భూలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా జోలికొస్తే ఏం చేస్తానో తెల్వదు.. నీళ్ల గురించి నన్నే ప్రశ్నించాలనుకుంటారా? కేసు పెడతారేమో.. పోలీసులతోనే కొట్టిస్తా. అధికారం మాదే. బళ్లారిలో మా వాళ్లున్నారు. వాళ్లకు చెబితే కత్తులు, కొడవళ్లతో వచ్చి చంపేస్తారు’ అంటూ బెదిరించాడని చెప్పారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement