పునరుత్పత్తి దశ కావడంతో చేపల వేటపై జిల్లాలోనూ నిషేధం కొనసాగుతోంది. అయితే రెండు నెలల పాటు ఉపాధిని కోల్పోతుండటంతో మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా కుదేలవుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేపల వేటపై నిషేధం అమల్లో ఉన్న రోజుల్లో పరిహారం ఇచ్చి ఆదుకోగా... ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మాత్రం వారిపై కరుణ చూపడం లేదు. ఆ దిశగా ప్రయత్నాలేవీ చేయకపోవడంపై మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాయదుర్గం: చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో జిల్లాలోని పలు జలాశయాల్లో మత్స్య వేటపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ నెల 1 నుంచి ఆగస్టు 31 వరకు ఎట్టి పరిస్థితుల్లో రిజర్వాయర్లలో దిగొద్దని జాలర్లకు మత్స్యశాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టనున్నారు.
బీటీపీ, ఎంపీడ్యాంలోకి 24 లక్షల చేపలు
జిల్లాలో లైసెన్స్ కలిగిన రిజర్వాయర్లు బీటీపీ, ఎంపీడ్యాంలున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో బీటీపీలో 12 లక్షలు, ఎంపీడ్యాంలో 12 లక్షలు కట్ల, రోహు, మృగ్యాల రకం చేప పిల్లలు వంద శాతం రాయితీతో విడుదల చేశారు. ప్రస్తుతం ఒక్కో చేప కిలో నుంచి ఐదు కిలోల వరకు దిగుబడి వచ్చాయి. ఒక్కో రిజర్వాయర్‌లో 3 లక్షల కేజీలకు తక్కువ కాకుండా 6 లక్షల దిగుబడి రానుంది. కిలో రూ.100తో లెక్కిస్తే రూ.6 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ రెండు రిజర్వాయర్ల పరిధిలో 350 మంది లైసెన్స్ మత్స్యకార సంఘాలు ఉన్నాయి. వచ్చే ఆదాయాన్ని సమానంగా పంచుకుంటారు.
56 మత్స్య సహకార సంఘాలు
జిల్లా వ్యాప్తంగా 56 మత్స్య సహకార సంఘాలు, 4,300 సభ్యులు అధికారికంగా, 5,700 మంది అనధికారికంగా ఉంటారు. 99 మైనర్ ఇరిగేషన్ చెరువులు చేపల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయి. వర్షం నీరు చేరే ఆధారంగా పెంపకం చేపడతారు. గతేడాది సుమారు 22 చెరువుల్లో ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 2.69 లక్షల చేప పిల్లలు 40 శాతం రాయితీతో విడుదల చేశారు. అక్కడ కూడా రూ.2.69 కోట్లు ఆదాయం రానుంది. వేట నిషేధిత సమయంలో వలలు విసిరితే సంతానోత్పత్తితో పాటు దిగుబడి పై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అండగా..
చేపల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గంగపుత్రులు రెండు నెలల పాటు ఉపాధి కోల్పోతున్నారు. పైసా ఆదాయం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వేట విరామ సమయంలో జాలర్ల కుటుంబాలకు అండగా నిలిచారు. అర్హత కలిగిన ప్రతి మత్స్యకార కుటుంబానికి కోస్తా ప్రాంతాల్లో రూ.10 వేల భృతి ఇచ్చారు. రిజర్వాయర్లు, చెరువుల్లో చేపలు పట్టే వారికి వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా ఆర్థిక సహాయం చేశారు. తాజాగా చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకారులకు పైసా కూడా ఇవ్వకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంతానోత్పత్తి సమయం కావడంతో ఈ నెల 1 నుంచి ఆగస్టు 31 వరకు చేపలు పట్టడంపై నిషేధం విధించాం. ఈ నిబంధనలను ప్రతి జాలరు పాటించాలి. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే లైసెన్స్ మత్స్యకారులకు నోటీసులు జారీ చేశాం. ఆయా రిజర్వాయర్ల వద్ద ప్రత్యేక నిఘా ఉంచాం. ఉత్పత్తి పెరిగితే మత్స్యకారులకే ఆదాయం. అందరూ సహకరించాలి.
– లక్ష్మీనారాయణ, ఎఫ్‌డీఓ, ఎంపీడ్యాం
చేపల వేటపై కొనసాగుతున్న నిషేధం
రెండు నెలలు ఆదాయం ఉండదంటున్న మత్స్యకారులు
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిహారమిచ్చి అండగా నిలిచిన వైనం
వారి బాధలను పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం


