● ‘సాక్షి’ విలేకరికి గొంచిరెడ్డిపల్లి టీడీపీ నేతల బెదిరింపులు
బ్రహ్మసముద్రం: ‘మా గ్రామం వార్తలు రాస్తే ఇబ్బంది పడతావ్... మేం గ్రామంలో 8 మంది టీడీపీ నాయకులు ఉన్నాం. గొంచిరెడ్డిపల్లిలో ఏం జరిగినా మమ్మల్ని అడిగే వార్తలు రాయాలి. లేదంటే మీ ఇంటికి రావాల్సి ఉంటుంది. మా ఊరి సమస్యలు నీకు అనవసరం. మా గ్రామంలో మేం ఏం చెబితే.. అదే జరుగుతుంది. మా ప్రభుత్వంలో మా ఊరి వార్తలు రాయడం కానీ మా ఊరికి రావడం చేస్తే బాగుండదు’ అంటూ టీడీపీ నేతలు మల్లికార్జున, గంగయ్య ‘సాక్షి’ విలేకరిని సోమవారం ఫోన్‌లో బెదిరించారు. ‘అమ్ముకుంటాం.. అడిగేవారెవరు’ అన్న శీర్షికన సోమవారం ‘సాక్షి’ లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. స్వచ్ఛ భారత్ ట్రాక్టర్లు కనిపించడం లేదన్న కథనం రావడం వారికి మింగుడు పడలేదు. దీంతో బెదిరింపుల పర్వానికి దిగారు.
పేలిన ట్రాక్టర్ టైరు
● పెన్నానది బ్రిడ్జిపై తప్పిన పెను ప్రమాదం
తాడిపత్రి టౌన్: పట్టణంలోని పెన్నానది బిడ్జిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం త్రుటిలో తప్పింది. కర్నూల్ జిల్లా కొలిమిగుండ్ల మండలం కొండమీదపల్లికి చెందిన ట్రాక్టర్ నాపరాళ్ల బండలతో చుక్కలూరు గ్రామం వైపు నుంచి తాడిపత్రి పట్టణంలోకి వస్తోంది. అయితే పెన్నానది బిడ్జిపై ట్రాక్టర్ టైర్ ఒక్కసారిగా పేలడంతో ట్రాక్టర్ అదుపు తప్పింది. దీంతో డ్రైవర్ సూరి ట్రాక్టర్‌పై నుంచి కిందకు దూకి ప్రాణాలను రక్షించుకున్నాడు. అయితే ట్రాక్టర్ బ్రిడ్జి సేఫ్టీవాల్‌ను ధ్వంసం చేసుకుంటూ నది వైపు దూసుకెళ్లింది. ట్రాక్టర్ ట్రాలీలో అధిక లోడు ఉండటంతో ట్రాలీ రోడ్డు పైనే నిలిచిపోగా ట్రాక్టర్ ఇంజన్ బ్రిడ్జి పై నుంచి నదిలో వేలాడింది. ఈ సంఘటనతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రద్దీ రోడ్డు కావడంతో ఆ సమయంలో ఏదైనా వాహనం వచ్చి ఉంటే పెద్ద ప్రమాదం చోటు చేసుకునేదని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలో
వ్యక్తి మృతి
బొమ్మనహాళ్: మండలంలోని ఉప్పరహాళ్‌లో బోయ హనుమంతరెడ్డి (52) అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఎస్‌ఐ నబీరసూల్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన బోయ హనుమంతరెడ్డి, నాగమ్మ దంపతులు. వీరికి నరేష్, రామాంజి అనే ఇద్దరు కుమారులు. కూలీ పనులు చేసుకుంటూ వారు జీవనం సాగించేవారు. మృతుడు బోయ హనుమంతరెడ్డి చికెన్ షాక్‌లో పనిచేసేవాడు. అయితే మృతుడు గత కొంత కాలంగా మద్యానికి బానిసై తరచూ మద్యం కోసం డబ్బులు అడుగుతూ కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. ఆదివారం సాయంత్రం మద్యం కోసం డబ్బులు అడిగిన సందర్భంలో భార్య నాగమ్మ, కుమారుడు రామాంజితో వాగ్వాదం జరిగింది. రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన హనుమంతరెడ్డి ఇంటి పక్కనున్న గుడిసెలో తన పంచతో ఉరివేసుకున్నాడు. మృతుడి భార్య నాగమ్మ ఫిర్యాదు మేరకు అనుమానాస్పదస్థితి మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
‘ఫాదర్’
పెద్ద కుటుంబాన్నిచ్చి వెళ్లారు
● ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్
శెట్టూరు: తన తండ్రి ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జిల్లాలో అతి పెద్ద కుటుంబాన్ని ఇచ్చి వెళ్లారని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్ మాంఛో ఫెర్రర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని ముచ్చర్లపల్లిలో దళితులు ఏర్పాటు చేసిన అంబేడ్కర్, ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ దేశంలోని పేద ప్రజల బాగోగుల కోసం పోరాడారని, అనంతపురం జిల్లాలో పేదలకు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ అండగా నిలబడ్డారన్నారు. ఇద్దరి విగ్రహాలను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నిర్వాహకులు అంబేడ్కర్ యూత్ సంఘం సభ్యులు, అధ్యక్షుడు దేవరాజు, ఉపాధ్యక్షుడు ధర్మశీల, కోశాధికారి బొజ్జప్ప, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ ఎమ్మెస్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.


