ప్రభుత్వ తీరుకు నిరసనగా శిరోముండనం చేయించుకుంటున్న వెంకట్రామిరెడ్డి , మాట్లాడుతున్న వెంకట్రామిరెడ్డి
రెండేళ్లలో ఉద్యోగులు కోల్పోయింది రూ. 37వేల కోట్లు
హామీలు హుళక్కి.. రెగ్యులర్‌గా రావాల్సిన వాటికీ మంగళం
ఉద్యోగులను మోసం చేసి అమరావతికి సోకులు అవసరమా?
ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి నిలదీత
బాబు మోసాలకి నిరసనగా గుండు గీయించుకున్న ఉద్యోగ సంఘాల నేతలు..
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ ఉద్యోగుల కోసం చంద్రన్న బోడిగుండు పథకాన్ని అమలు చేస్తున్నారు’ అని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కే వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారికి రెగ్యులర్‌గా రావాల్సిన డీఏలు, ఐఆర్, పీఆర్సీ వంటివి కూడా ఇవ్వకుండా ఉద్యోగులు అందరికీ నున్నగా క్షవరం చేసే కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు బోడిగుండు పథకం అమలు చేస్తున్నారంటూ వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరు నేతలు అందరిముందర గుండ్లు చేయించుకున్నారు.
ఉద్యోగులు కోల్పోయింది రూ. 37 వేల కోట్లకు పైమాటే..
ప్రతినెలా ఉద్యోగులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్న క్షవరం విలువ అక్షరాలా రూ.1500 కోట్లని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో ఉద్యోగులకు చేసిన మొత్తం క్షవరం విలువ సుమారు రూ.37 వేల కోట్లని చెప్పారు. ఇవి తాను ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం చెప్పడంలేదని, పూర్తి లెక్కలు ఇస్తున్నానని చెప్పి ఆ వివరాలు విడుదల చేశారు. ఈ రూ.37 వేల కోట్లు కేవలం కూటమి రెండు సంవత్సరాల పాలనకు సంబంధించిన బకాయిలు, ఎగవేతలు మాత్రమేనన్నారు. ఉద్యోగులను ఈ స్థాయిలో ముంచిన ఘనత గతంలో ఎవరికీ లేదన్నారు.
అమరావతికి సోకులు.. తుగ్లక్ పాలనకు నిదర్శనం..
ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా అమరావతిలోని భవనాల సోకులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుడుతున్నారని తెలిపారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల ముందు పక్క బిగించే అద్దాల కోసం రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోందని, చదరపు అడుగుకు అద్దాల కోసం రూ.5 వేలు ఖర్చు పెడుతోందన్నారు. ఈ భవనాల నిర్మాణం సోకులు, అన్నీ కలిపి చదరపు అడుగుకి రూ.20 వేల ఖర్చు పెడుతున్నారని తెలిపారు. ఒక పక్క ఉద్యోగులకు వేల కోట్ల రూపాయిలు బకాయిలు పెట్టి, అమరావతిలో సోకులకు రూ.వేల కోట్లు ఖర్చు బెట్టడం తుగ్లక్ పాలన కాదా అని ప్రశ్నించారు. ఆర్థికేతర అంశాల్లో ప్రభుత్వం ఉద్యోగులపై సానుకూలంగా లేదన్నారు.
ఆత్మహత్యలే మేలనుకుంటున్నారు..
ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక గత జూన్ నెలలో 10 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు, గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. మరో ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయలేమంటూ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వారు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు.
ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి రాజరికపు కాలం నాటి బానిసల కంటే హీనంగా ఉందని, వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేవని అయినా అడిగే దిక్కు లేదన్నారు. గత ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు పెట్టి ఉద్యోగుల సమస్యలు వినేదని, ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు వినే వారు కూడా లేరన్నారు. ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు సరిగా స్పందించడం లేదన్నారు.


