మేనిఫెస్టో హామీకి చంద్రబాబు మంగళం
2004 సెప్టెంబర్ 1కు ముందు నోటిఫికేషన్ వారికే పాత పెన్షన్
జీవో జారీ..10వేల మందికే చాన్స్
మిగిలిన 3 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు టోకరా..
సాక్షి, అమరావతి: అందరినీ మోసం చేసినట్లే చంద్రబాబు ఉద్యోగులనూ మోసగించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు కూడా తుంగలో తొక్కుతూ పాలన సాగిస్తున్నారు. సీపీఎస్ ఉద్యోగులకు మేనిఫేస్టోలో ఇచ్చిన హామీకి మంగళం పాడేశారు. అధికారంలోకి రాగానే సీపీఎస్, ఓపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తామని ఎన్నికల మేనిఫేస్టోలో చంద్రబాబు హామీ ఇచ్చారు. రెండేళ్ల పాలన పూర్తయినప్పటికీ ఆ హామీని నెరవేర్చడానికి ఎటువంటి చర్యలనూ తీసుకోకుండా లక్షలాదిమంది సీపీఎస్ ఉద్యోగులను మోసం చేశారు.
సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించి సోమవారం ప్రభుత్వమిచ్చి న ఉత్తర్వులే దీనికి నిదర్శనం. 2004 సెపె్టంబర్ 1కి ముందు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్‌లు జారీ చేసి, దాని ఆధారంగా ఆ తరువాత ఉద్యోగాల్లో చేరిన ఉద్యోగులకు మాత్రమే అది కూడా ఒకేసారి సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు అవకాశమిస్తూ ప్రభుత్వం సోమవారం జీవో జారీ చేసింది. దీనివల్ల కేవలం 10 వేల మంది ఉద్యోగులకు మాత్రమే సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు అవకాశం కలిగింది. మిగతా మూడు లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఈ పదివేల మందికి అవకాశం కల్పిస్తూ ఇచ్చిన జీవో కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఇచ్చిందే తప్ప చంద్రబాబుకు ఉద్యోగుల విషయంలో ఎలాంటి చిత్తశుద్ధీలేదని స్పష్టమయ్యింది.


