breaking news
Fits Epilepsy
-
ఫిట్స్ వస్తే.. ఏం చేయాలి?
ఫిట్స్, సీజర్స్, ఎపిలెప్సీ అంటూ పిలిచే ఈ వ్యాధిని చాలా సాధారణ సమస్యగా పరిగణించాలి. చికిత్సతో పూర్తిగా తగ్గే సమస్య ఇది. అయితే దీని గురించి ఇంకా ఇప్పటికీ చాలా అపోహలు ఉన్నాయి. నేడు (ఫిబ్రవరి 9) ఎపిలెప్సీ డే (International Epilepsy Day) సందర్భంగా ఫిట్స్‌పై అవగాహన కోసమే ఈ కథనం. 90 శాతంలో పూర్తి తగ్గుదల 10 శాతంలోనే మాటిమాటికీ... తీవ్రత ఆధారంగా మందును, మోతాదును నిర్ణయిస్తారు. దాదాపు 70 శాతం మందిలో కేవలం ఒకే ఒక మందుతో నియంత్రణలోకి వస్తాయి. కొద్దిమందిలో... అంటే మరో 10 శాతం బాధితులకు రెండు మందులు, ఇంకో 10 శాతం మందిలో మూడు మందులను వాడాల్సి రావచ్చు. దాదాపు 70 శాతం మంది బాధితులు రెండేళ్ల తర్వాత మందును ఆపేయవచ్చు. దీనికోసం డాక్టర్లు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని మందులు ఇక ఆపేయవచ్చనే నిర్ణయానికి వస్తారు. కానీ మరో 10 శాతం మందికి నాలుగు రకాల మందులు వాడినా కూడా ఫిట్స్ పదే పదే వస్తుండవచ్చు.6.5 కోట్ల మందిప్రపంచవ్యాప్తంగా 6.5 కోట్ల మంది ఫిట్స్‌తో బాధపడుతుండగా మనదేశంలో దాదాపు కోటి నుంచి 1.2 కోట్ల మంది బాధితులున్నారు. డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాదీ 50 లక్షల మంది కొత్త పేషెంట్స్ ఈ జాబితాలో చేరుతున్నారు. 26 మందిలో ఒకరికి... చూడ్డానికి ఎంతో భయంకరంగా, ఆందోళన గొలిపేలా ఉండే లక్షణాలూ, అపోహల కారణంగానే ఈ పరిణామం చోటుచేసుకుంటోంది. దేశంలోని ప్రతి 26 మందిలో ఒకరికి ఫిట్స్ కనిపిస్తున్నాయి. ఇందులో 80% అల్పాదాయ, మధ్యతరగతివారే. ఇదేమీ భయంకరమైన వ్యాధి కాదు. మానసిక వ్యాధి అంతకంటే కాదు. అంటువ్యాధి కానే కాదు. చికిత్స తీసుకుంటే పూర్తిగా తగ్గిపోయే నిరపాయకరమైన వ్యాధి. అనేక అపోహల కారణంగా దేశంలోని 50% పైగా బాధితులు ఇంకా చికిత్సకు దూరంగా ఉన్నారు.70% మందిలో.. ఫిట్స్ / ఎపిలెప్సీ వచ్చినవాళ్లలో దాదాపు 70 శాతం మందిలో కారణాలు తెలియవు. మిగతా 30 శాతం మందిలో ఏవైనా నిర్దిష్టమైన కారణాలతో ఫిట్స్ వస్తుంటాయి. ఉదాహరణకు... కొందరిలో వంశపారంపర్యంగా, తలకు దెబ్బతగలడం, పక్షవాతం, మెదడులో గడ్డలుగానీ లేదా ఇన్ఫెక్షన్గానీ రావడం వల్ల అలాగే మరికొందరిలో పక్షవాతం (స్ట్రోక్) కారణంగా రావచ్చు.ప్రస్తుతం ఫిట్స్ కోసం దాదాపు 15 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్లు బాధితుల బరువు ఆధారంగా వీటి మోతాదును నిర్ణయిస్తారు. ఫిట్స్ మళ్లీ మాటిమాటికీ రాకుండా ఉండాలంటే పూర్తి కోర్సు వాడాల్సిందే.మరికొన్ని మార్గాలు ఫిట్స్ తగ్గించేందుకు కొన్ని మార్గాలూ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో... శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా ఫిట్స్ ఆవిర్భావ కేంద్రాన్ని గుర్తించినట్లయితే... దాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించుకుని, శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఇక డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ప్రక్రియ మరొకటి. ఇక కొందరు చిన్నపిల్లలకు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం (కీటోజెనిక్ డైట్) ఇవ్వడం ద్వారా ఫిట్స్‌ను అదుపు చేయవచ్చ. మరికొందరిలో ‘వేగస్ నర్వ్’ అనే నరాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా కూడా ఫిట్స్‌ను అదుపుచేయవచ్చు.ఫిట్స్ వచ్చినప్పుడు... ఫిట్స్ వచ్చినవారికి తాళం చేతులు అందించడం, ఏదైనా లోహపు వస్తువును చేతిలో పెట్టడం చేస్తుంటారు. వాస్తవానికి ఇవేవీ చేయకూడదు. ఫిట్స్రాగానే ఆ వ్యక్తిని.. ∙సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఎక్కువగా కదిలించకూడదు. ∙నోటిలోగాని చేతిలోగాని బలమైన లోహపు వస్తువులను ఉంచకూడదు. ∙ఒక పక్కకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టాలి. ∙కాళ్లూ, చేతులు కొట్టుకుంటుంటే దాన్ని ఆపడానికి ప్రయత్నించకూడదు. సాధారణంగా ఫిట్స్ వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో అతడు తనంతట తానే మామూలు స్థితికి వస్తాడు. ఒకవేళ అలా జరగకపోయినా లేదా మళ్లీ వెంటనే ఫిట్స్ రావడం ప్రారంభమైనా వీలైనంత త్వరగా అతడిని ఆసుపత్రికి తరలించాలి.చదవండి: అవాంఛిత రోమాలకు పరిష్కారంచివరగా... ఎపిలెప్సీ అనేది ఉన్నతికి ఏమాత్రం ప్రతిబంధకం కాదు.మహిళల్లో ఎపిలెప్సీ వచ్చినా అది సాధారణ జీవితానికి ఏమాత్రం అడ్డంకి కాదు. అందరిలానే వీళ్లూ పెళ్లిళ్లు చేసుకుని, పిల్లలను కనవచ్చు. -
న్యూరాలజీ కౌన్సెలింగ్
మళ్లీ ఫిట్స్ రావడం మొదలైంది ఏం చేయాలి? మా చెల్లి వయసు 17 ఏళ్లు. ఇంటర్మీడియట్ చదువుతోంది. చిన్నప్పట్నుంచీ ఫిట్స్‌తో బాధపడుతోంది. చాలాసార్లు కాలేజీలోనే ఆమెకు ఫిట్స్ వచ్చాయి. దాంతో కాలేజీ వారూ, కుటుంబసభ్యులూ ఆందోళనకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. హైదరాబాద్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించాం. కొంతకాలం బాగానే ఉంది. కానీ ఈమధ్య మళ్లీ ఫిట్స్ రావడం మొదలైంది. ఆమె అనారోగ్యం కుటుంబంలో అందరికీ ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యాధి పూర్తిగా నయం చేయడానికి ఏదైనా చికిత్స ఉందా? దయచేసి మాకు తగిన సలహా అందించండి. - బి. కరుణాకర్‌రెడ్డి, నల్గొండ ఫిట్స్ (మూర్ఛ) అనేది మెదడులో సంభవించే ప్రకోపనాలకు సంకేతం మాత్రమే. ఫిట్స్ వల్ల నిజానికి ఎలాంటి ప్రాణహానీ ఉండదు. కానీ చాలామంది ఫిట్స్‌ను ఏదో తీవ్రమైన, అరుదైన, ప్రమాదకరమైన సమస్యగా చూస్తుంటారు. కానీ అది నిజం కాదు. ఇది చాలా సాధారణమైన సమస్య. మెదడులోని నాడీ కణాల్లో నిరంతరం విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఉన్నట్లుండి మెదడులోని కొన్ని ప్రాంతాల్లోని నాడీ కణాల్లో విద్యుత్ చర్యలు అస్తవ్యస్తమైనప్పుడు ఫిట్స్ వస్తాయి. వీటినే సీజర్స్ అని కూడా అంటారు. ఇలా తరచూ ఫిట్స్ వస్తుంటే దాన్ని తెలుగులో మూర్ఛ అని ఇంగ్లిష్‌లో ఎపిలెప్సీ అని అంటారు. ఫిట్స్ అన్నీ ఒకే రకానికి చెందినవి కావు. ఈ సమస్య ఎక్కడ మొదలవుతుందో దాన్ని బట్టీ, ఆ సమయంలో కనిపించే లక్షణాలను బట్టీ ఇది ఏరకమైన ఫిట్స్ అన్నది నిర్ధారణ చేస్తారు. సాధారణంగా ఫిట్స్ వచ్చిన సందర్భాల్లో కొద్దిసేపట్లోనే ఎలాంటి వైద్యసహాయం లేకుండానే పేషెంట్ తనంతట తానుగా కోలుకుంటాడు. అయితే ఫిట్స్ వచ్చిన సమయంలో ఆ వ్యక్తిని ఒకవైపునకు ఒరిగి ఉండేలా పడుకోబెట్టడం చాలా ముఖ్యం. దీనివల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేకుండా చేయవచ్చు. ఫిట్స్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంటాడు. మళ్లీ కొద్దినిమిషాల్లోనే స్పృహలోకి వస్తాడు. అలా కొద్దినిమిషాల్లోనే స్పృహలోకి రాకపోతే మాత్రం వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించాలి. అంతేగానీ ఫిట్స్ వచ్చిన సమయంలో పేషెంట్ నోట్లో ఏదైనా పెట్టడం, చేతిలో తాళాల వంటి ఇనుప వస్తువులు ఉంచడం, ముక్కు దగ్గర ఏదైనా తోలు వస్తువు వాసన చూపడం వంటి చర్యలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పూనుకోకూడదు. ఇలాంటి చర్యల వల్ల పేషెంట్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. పైగా కొన్ని సందర్భాల్లో అవి హాని చేసే ప్రమాదం కూడా ఉంది. ఇక మీ సోదరి విషయానికి వస్తే స్త్రీ జీవితంలోని ప్రతి దశలోనూ అంటే... రజస్వల కావడం, నెలసరి రావడం, గర్భధారణ, బిడ్డకు పాలివ్వడం, నెలసరి నిలిచిపోవడం... ఇలా ప్రతి దశలోనూ హార్మోన్ల ప్రభావం బలంగా ఉంటుంది. దీంతో ఫిట్స్ సమస్యకూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి వారిలో 90 శాతం కేసుల్లో సుదీర్ఘ చికిత్స, మందుల ద్వారా వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెందకుండా వెంటనే అనుభవజ్ఞులైన న్యూరోఫిజీషియన్కు చూపించి చికిత్సను కొనసాగించండి. డాక్టర్ ఆనంద్ బాలసుబ్రమణ్యం సీనియర్ న్యూరో సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్


