అనంతపురం జిల్లా కొనకండ్లలో తాగునీటి కోసం రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులు
రాష్ట్ర వ్యాప్తంగా సమస్యకు నీళ్లొదిలిన చంద్రబాబు సర్కారు
వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జనవరిలోనే అధికారుల ప్రణాళికలు
మే నెల ముగిసిపోతున్నా నిధులు విడుదల చేయని ప్రభుత్వం
నీటి సమస్య పరిష్కారానికి అనంతపురం మొదలు శ్రీకాకుళం వరకు ఆందోళనలు
గ్రామాల్లో వారం నుంచి 20 రోజులకు ఒకసారి నీటి విడుదల
ప్రకాశం జిల్లాలో అర్ధరాత్రి మహిళల పడిగాపులు
పంచాయతీ నీరు రాకపోవడంతో తాగునీటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు
మండు వేసవిలో తీవ్రస్థాయికి చేరిన నీటి కష్టాలు
నీటి ఎద్దడి నివారణలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి ప్రతినిధి, కర్నూలు/ సాక్షి, నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పల్లె తాగునీటి ఎద్దడితో ఘోషిస్తోంది. మండుటెండల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నా చంద్రబాబు సర్కారు మొద్దునిద్ర వీడటం లేదు. వేసవిలో ఏ ప్రాంతాల్లో మంచినీటి ఎద్దడి తలెత్తుతుంది? పరిష్కార మార్గం ఏమిటి? ఎంత నిధులు అవసరం? అనే వివరాలతో ప్రణాళికలు రూపొందించి నిధుల కోసం ఏటా డిసెంబర్, జనవరిలోనే ప్రభుత్వానికి ఆర్‌డబ్ల్యూఎస్ (గ్రామీణ నీటిపారుదలశాఖ) అధికారులు ప్రతిపాదనలు పంపుతారు. వీటిని బుట్టదాఖలు చేసిన చంద్రబాబు సర్కారు మే చివరిలో కేవలం చిల్లర విదిల్చింది. ఈ ఏడాది నదుల్లో ప్రవాహం తగ్గడం, భూగర్భ జలాలు అడుగంటడంతో ఏప్రిల్, మే నెలల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి తలెత్తింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో కూడా సమస్య నెలకొంది. కొన్ని చోట్ల వారం పది రోజులకు కూడా నీరు అందడం లేదు. కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, శ్రీకాకుళంతో పాటు చాలా జిల్లాలో ప్రజలు రోడ్డెక్కి నీటి కోసం రాస్తారోకోలు నిర్వహించారంటే ఎంత దారుణ పరిస్థితులు నెలకొన్నాయో స్పష్టమవుతోంది.
పాతాళంలో జలాలు..
అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటడం కొత్త కాకపోయినా ఈ ఏడాది తూర్పు గోదావరి లాంటి జిల్లాల్లో కూడా అడుగంటాయి. దీన్నిబట్టే రాష్ట్రంలో బోర్లు పరిస్థితి, తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలుస్తోంది. అనంతపురం జిల్లాలో పుట్లూరు, కుందుర్పి, కళ్యాణదుర్గం, యాడికి మండలాల్లో భూగర్భ జలాలు 20 మీటర్లకు పడిపోయాయి. ఇక్కడ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు గుర్తించారు. మరో 20 మండలాల్లో కూడా భూగర్భజలాలు ప్రమాదకరస్థాయిలో తగ్గాయి. కర్నూలు జిల్లాలో కోసిగి, ప్యాపిలి, దేవనకొండ, బేతంచర్ల, క్రిష్ణగిరి, పెద్దకడుబూరు, మంత్రాలయం, హాలహర్వి, నందికొట్కూరు, సంజామలలో ప్రమాదకర స్థాయిలో సగటున 100–150 మీటర్ల వరకూ తగ్గిపోయాయి. తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గంపేటలో 40 అడుగులు మేర భూగర్భ జలాలు అడుగంటాయి. దీంతో గతంలో పోలిస్తే రక్షిత మంచినీటి పథకాలకు నీటి లభ్యత 50 శాతం తగ్గింది. ఫలితంగా వీటిపై ఆధారపడిన గ్రామాల్లో తాగునీటి ఎద్దడి ఏర్పడింది.
అసలే ఎద్దడి.. ఆపై కలుషిత నీరు
గుంటూరు, కృష్ణా, నెల్లూరు, కర్నూలుతో పాటు చాలా పట్టణాల్లో మునిసిపాలిటీ పైపులైన్ల లీకేజీతో కలుషిత నీరు సరఫరా అవుతోంది. దీనికి తోడు మంచినీటి ఎద్దడి నెలకొంది. కలుషిత నీరు, నీటి ఎద్దడి వెరసి మునిసిపాలిటీ నీటిపై నమ్మకం లేక చాలామంది మినరల్ వాటర్ క్యాన్లు, ఇళ్లలో ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాల్లో కూడా మినరల్ వాటర్ క్యాన్లు కొనుగోలు చేస్తున్నారు. మినరల్ వాటర్ ఆటో గ్రామానికి వస్తే బిందె రూ.10 చొప్పున కొంటున్నారు. తాగునీటి కోసం రోజూ రెండు బిందెలు చొప్పున నెలకు రూ.600 వరకు తాగునీటి కోసం ఒక్కో కుటుంబం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉపాధి హామీ కూలీలు తమ మూడు రోజుల కూలీని తాగునీటి కోసం ధార పోయాల్సిన పరిస్థితి. తాగునీరు సంగతి పక్కనపెడితే వంటకు, స్నానానికి ఇతర అవసరాలకు కూడా నీరు దొరకని దారుణ పరిస్థితి తలెత్తింది.
అచ్చెన్న ఇలాకాలో గిరిజనుల అవస్థ..
శ్రీకాకుళం జిలాల్లో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న టెక్కలితో పాటు కంచిలి, ఆముదాలవలస, హిర, పాతపట్నంలోని చాలా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి ఉంది. కంచిలి మండలం నువాగడలో గిరిజనులు నెల రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఇక్కడికి తాగునీటిని సరఫరా చేసే పథకాలు పాడయ్యాయి. ఉద్దానం నీటి పథకం ద్వారా జేజేఎం ట్యాప్ పాయింట్లకు నీటి సరఫరా కావడం లేదు. స్థానిక పంచాయతీ బోరు కూడా పని చేయకపోవడంతో గిరిజనులు దాహార్తితో అల్లాడుతున్నారు.
– టెక్కలి మండల కేంద్రంలో తాగునీరు లేదు. దీంతో వైఎస్సార్‌సీపీ, ఇతర దాతలు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.
– హిర మండలంలో పక్కనే వంశధార ఉన్నా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. చిన్నకోరాడ పంచాయతీలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. అలికాం–బత్తిలి రోడ్డుపై రాస్తారోకో చేశారు.
– ఆముదాల వలస శివారు గ్రామాలు పార్వతీశ్వరునిపేట, జగ్గుశాస్త్రులపేట, తిమ్మాపురంలో వారానికి ఒక్కరోజే తాగునీరు అందుతోంది.
– పాతపట్నం మడలం రంకిణీ గిరిజన గూడెంలో బోర్లు లేవు. ఇంటింటికీ తాగునీరు ఇస్తామని పైపులైన్‌లు వేసి వదిలేశారు.
బోర్లు.. భోరు భోరు!
– ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం మేజర్ పంచాయతీ జోహరాపురానికి బాపురం రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో వక్కిరేణిలోని బురద నీటినే గ్రామ ప్రజలు వినియోగిస్తున్నారు.
– అమలాపురంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. గత ప్రభుత్వంలో రూ.20 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు మంజూరై పనులు మొదలైనా కూటమి ప్రభుత్వం వచ్చాక అటకెక్కించింది. అల్లవరం. ఉప్పగుప్తం, అమలాపురం రూరల్ మండలాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది.
– కాట్రేనికోన శివారు ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. బాహ్యప్రపంచానికి దూరంగా సముద్రతీరంలో ఉన్న మగసానితిప్పకు గత ప్రభుత్వంలో పైపులైన్ వేసి నీరు సరఫరా చేశారు. ఇప్పుడు నిర్వహణ సరిగా లేకపోవడంతో నీరు అందడం లేదు. పల్లం, బలుసుతిప్ప, కొత్తపాలెం, మొల్లేటి మొగ, చిర్రయానం, నీళ్లరేవు, చాకలిపేట, గొల్లపేటలో నీటి కోసం జనాలు పడిగాపులు కాస్తున్నారు. కాట్రేనికోనలో 250 కుళాయి కనెక్షన్‌లు ఇవ్వాలి. కాంట్రాక్టర్‌కు బకాయిలు పెండింగ్ ఉండటంతో చేతులెత్తేశారు. జలజీవన్ మిషన్ నిధులతో పైపులైన్‌లు వేసి, ట్యాంకులు నిర్మించినా నిర్వహణ లేక నీళ్లు అందడం లేదు.
– జగ్గంపేట నియోజకవర్గం గోకవరం, గండేపల్లి, కిర్లంపూడిలో తీవ్ర తాగునీటి సమస్య ఉంది.
– కాకినాడ రూరల్ నియోజకవర్గం తూరంగితో పాటు శివారు ప్రాంతాలకు ట్యాంకర్లు ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నారు.
– పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలం బురుజుల గ్రామస్తులు మినరల్ వాటర్ కొనుగోలు చేస్తున్నారు. ఇతర అవసరాలకు సుద్దవాగు నుంచి ఫ్లోరైడ్ నీటిని తెచ్చుకుంటున్నారు.
– ఆలూరు నియోజకవర్గం హాలహర్వి మండలం బాపురంలో ఎస్‌ఎస్ ట్యాంకును శుభ్రం చేస్తూ సురేష్ అనే కాంట్రాక్టు కార్మికుడు ఈనెల 20న నీటి సంపులో పడి మృతిచెందాడు. సురేశ్ కుటుంబానికి న్యాయం చేయాలని, పెండింగ్‌లో ఉన్న వేతనాలను ఇవ్వాలని కార్మికులు విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో 26 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది.
– శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ, రొళ్ల, మడకశిర, అమరాపురం, హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరు, రొద్దం, పరిగి, ముదిగుబ్బ, పుట్టపర్తి, ఎన్‌పీ కుంట మండలాల్లో తాగునీటి కోసం ఖాళీ బిందెలతో మహిళలు పలుమార్లు రోడ్డెక్కారు. జిల్లా నుంచి మంత్రులు సత్యకుమార్, సవిత ఉన్నా తాగునీటి పరిష్కారానికి చొరవ చూపలేదు.
– వినుకొండ నియోజకవర్గం ఉప్పలపాడు, ములకలూరు, తలర్లపల్లి, మూర్తింజాపురం, జంగాలపల్లి, రావులాపురం, ఉప్పరపాలెంతో పాటు పలు గ్రామాల్లో తాగునీటి సమస్య ఉంది. వినుకొండలో నాలుగురోజులకు ఒకసారి తాగునీరు అందుతోంది.
–వెంకటగిరి నియోజకవర్గం కలువాయి మండలం పెన్నబద్వేల్ గ్రామంలో తాగునీటి సమస్యతో స్థానికులు అల్లాడుతున్నారు. ఇటీవల అధికారులు నిర్వహించిన వన్‌మంత్..వన్‌విలేజ్.. ఫోర్ విజిట్స్ కార్యక్రమాన్ని మహిళలు ఖాళీ బిందెలతో అడ్డుకున్నారు. తాగునీటి సమస్యను పరిష్కరించాకే సభలు, సమావేశాలు చేపట్టాలని అధికారులను నిలదీశారు.
– నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం సోమశిల, పడమటి కంభంపాడులో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. పైపులైన్ మరమ్మతులతో నీటిని విడుదల చేయకపోవడంతో స్థానికులు ఇక్కట్లు పడుతున్నారు.
– రాయచోటి నియోజకవర్గం చక్రాయపేట, రెడ్డివారిపల్లె, ఎర్రగుడిగ్రామం బీఎన్ తాండా లో తీవ్ర నీటి సమస్య ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సురభి హరినజవాడ, కల్లూరిపల్లె గ్రామం సిద్దావాండ్లపల్లె, కాట్లగుంటివారిపల్లెలో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఎంపీ నిధులతో బోర్లు వేయించి సమస్య పరిష్కరించారు.
–ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం నియోజకవర్గంలో 22 గ్రామాలు, కనిగిరి నియోజవర్గంలో 18 గ్రామాల్లో, గిద్దలూరు పట్టణంతో పాటు 10 గ్రామాల్లో, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో 20 గ్రామాల్లో నీటి సమస్య ఉంది.
– కనిగిరి మండంలో సాగర్ నీళ్లు 20 రోజులకు ఒకసారి వస్తుండడంతో రాత్రిపూట పడిగాపులు కాసి మహిళలు నీళ్లు పట్టుకుంటున్నారు.
నాలుగు కి.మీ. వెళ్లాల్సిందే ...
తాగునీటి కోసం నాలుగు కిలోమీటర్ల దూరంలోని గూళ్యం, లేదా మూడు కిలోమీటర్ల దూరంలోని బళ్లూరుకు వెళ్లి తెచ్చుకుంటున్నాం. గ్రామంలోని బోరు నీరు తాగేందుకు పనికిరాదు. సమీపంలోనే బాపురం రిజర్వాయర్ ఉన్నా మా గ్రామానికి నీటి సరఫరా కావడం లేదు. నిత్యం సైకిళ్లు, మోటారు సైకిళ్లపై వెళ్లి తాగునీటిని తెచ్చుకుంటున్నాం. పలుమార్లు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదు.
– బి.గాదిలింగప్ప, ఎంపీటీసీ, సిద్దాపురం, హాలహర్వి మండలం, కర్నూలు జిల్లా
పొలాల్లో నీళ్లే దిక్కు..
ప్రజలు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలువాల ఎస్‌ఎస్ ట్యాంకు ద్వారా గతంలో రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేశారు. వేసవిలో వారం పది రోజులకు ఒక సారి నీటిని విడుదల చేస్తే ఎలా? గ్రామంలోని బోరు నీటిని ఇతర అవసరాలకు వాడుకుంటు తాగునీటి కోసం సమీప పొలాల్లోని వ్యవసాయ బోర్లు, బావులపై ఆధారపడుతున్నాం.
– తిమ్మగురుడు, గార్లదిన్నె, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా
⇒ కుళాయిలో బురదనీరు వస్తున్న ఈ దృశ్యం నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గుడిపాడు గ్రామంలో ఆదివారం కనిపించింది. తాగునీటి సంగతి
దేవుడెరుగు.. ఇంటి అవసరాలకు కూడా ఈ నీరు పనికిరాదు. పంచాయతీ పైపులైన్లు దెబ్బ తినడంతో ఈ దుస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీల్లో నీటి సరఫరా ఎంత అధ్వానంగా ఎలా ఉందో చెప్పేందుకు ఇదో మచ్చు తునక!
⇒ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం వజ్రకరూర్ మండలం కొనకండ్లలో 12 వేల మంది నివాసం ఉంటున్నారు. రోజూ 6 లక్షల లీటర్ల తాగునీరు అవసరం. కేవలం శ్రీసత్యసాయి వాటర్ స్కీం ద్వారా మాత్రమే నీరు అందుతోంది. ఈ ఉద్యోగులకు ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో 20 రోజులు సమ్మె చేశారు. దీంతో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడి గ్రామస్తులు ఉరవకొండ–గుంతకల్లు ప్రధాన రహదారిపై రెండుసార్లు రాస్తారోకో చేశారు. చివరకు కలెక్టర్ జోక్యం చేసుకుని రెండు నెలల బకాయిలు ఇస్తామని చెప్పారు. అయినా నీటి సమస్య పరిష్కారం కాలేదు. ట్యాంకర్ల ద్వారా అరకొరగా సరఫరా జరుగుతోంది. స్వయంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంలో దారుణ పరిస్థితి ఇది! ఇక్కడే కాదు.. ఈ నియోజకవర్గంలోని విడపనకల్లు, కూడేరు మండలాల్లో కూడా తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది.
⇒ కర్నూలు జిల్లాలో తాగునీటి ఎద్దడిని ముందుగానే అంచనా వేసిన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు
141 గ్రామాల్లో బోర్ల మరమ్మతులు, బోర్ల హైరింగ్, ట్యాంకర్ల కోసం రూ.8.48 కోట్లు అవసరమని జనవరిలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వేసవి ముగుస్తున్నా ప్రభుత్వం చలించలేదు. చివరకు అధికారులు తీవ్ర ఒత్తిడి చేయడంతో ఈ నెల మూడో వారంలో కేవలం రూ.50 లక్షలు విదిలించింది. దీంతో జిల్లాలో వందల గ్రామాల్లో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు.
⇒ నందిగామ నియోజకవర్గం కంచికచర్లలో చాలా వీధులకు 20 రోజులకు ఒకసారి మాత్రమే నీరు అందిస్తున్నారు. వీరులపాడు మండలంలో 15 గ్రామాలకు వారానికి ఒకసారి కూడా తాగునీరు రావడం లేదు. నందిగామ నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇదే పరిస్థితి! జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం భీమవరం, మక్కపేట, మంగోల్లు, మాచినేనిపాలెం, వత్సవాయి మోడల్ కాలనీ, కాకరవాయి గ్రామాలలో కూడా తీవ్ర మంచినీటి సమస్య ఉంది. చంద్రబాబు సర్కారుపై నమ్మకం లేక ప్రజలు డబ్బులు వెచ్చించి మంచినీటిని కొనుగోలు చేస్తున్నారు.
⇒ ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో తీవ్ర తాగునీటి ఎద్దడి ఉంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఓ రాజ్యసభ సభ్యుడి నిధులు, జడ్పీ నుంచి రూ.40 లక్షలు మంజూరు చేయించారు. సాంకేతిక, పాలన అనుమతులు కూడా వచ్చాయి. కానీ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేకు ‘క్రెడిట్’ దక్కుతుందనే దుగ్ధతో టీడీపీ ఇన్‌చార్జ్ ఎరిక్షన్‌బాబు అడ్డుపడ్డారు. దీంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అగ్రిమెంట్ చేయలేకపోతున్నారు. కొలుకుల, తిరుమలగిరి, వెంకటాద్రిపాలెం, వాదంపల్లి, పెద్దారవీడు మండలంలోని చెట్లమిట్ట, మద్దెలకట్ట, త్రిపురాంతకం పాత అన్న సముద్రం గ్రామాల్లో డీప్ బోర్లు మంజూరయ్యాయి. గురిజేపల్లి, బోయపల్లి ఎస్సీ కాలనీ, ఆర్ ఉమ్మడివరానికి ఎమ్మెల్యే చంద్రశేఖర్ చొరవ చూపి బోర్లు మంజూరు చేయించారు. అయినాకూడా టీడీపీ నేతలు ఈ బోర్లు వేయనివ్వడం లేదు. ఇక పుల్లలచెరువు మండలంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న గ్రామాలకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నారు.


