ఈ వేసవిలో అత్యధిక వేడిమి రోజులే ఉండే చాన్స్
ఏప్రిల్ మొదటి వారం నుంచే 40 డిగ్రీలు దాటనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు... మే నెలలో గరిష్టంగా
44 నుంచి 46 డిగ్రీ సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాలుల ప్రభావం
సాక్షి, హైదరాబాద్: వేసవి భగభగలు తీవ్రమవుతున్నాయి. ప్రస్తుతం సాధారణ స్థితిలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు ఒకట్రెండు డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదవుతుండగా రానురాను తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మార్చి నుంచి మే మధ్య కాలాన్ని వేసవి సీజన్‌గా పరిగణిస్తాం. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి రెండో వారం నుంచే ప్రారంభమయ్యాయి. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సాధారణం, అంతకంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో మాత్రం సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఈ ఏడాది వేసవి సీజన్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గతేడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యనున్న చలికాలంలో ఉష్ణోగ్రతలు భారీగా పతనం కావడం, ఎక్కువ రోజులు అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, దీనికితోడు చలి తీవ్రత కూడా అధికంగా ఉండగా ఈ ఏడాది వేసవిలో ఇదే తరహాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వేడితో కూడుకున్న రోజులు ఎక్కువగా ఉండే అవకాశాలున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
మార్చిలో తేలికపాటి వానలు...
రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుతం సాధారణ స్థితిలోనే ఉన్నాయి. రానున్న మూడు రోజులు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఆ తర్వాత ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని, ఈనెల రెండు, మూడో వారంలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు నమోదు కానున్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈనెలాఖరు నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల వేగంగా ఉంటుందని ఏప్రిల్ మొదటి వారంలో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలు దాటే అవకాశం ఉందని, ఈ సీజన్‌లో గరిష్టంగా 44 నుంచి 46డిగ్రీ సెల్సియస్ మధ్యలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అదేవిధంగా భూపాలపల్లి, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో వడగాలులు కూడా ఎక్కువ రోజులు వీస్తాయని, వాతావరణంలో నెలకొన్న మార్పులుతో అత్యంత చలి, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు ఐఎండీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా వేసవి సీజన్‌పై ప్రాథమిక అంచనాలను ఐఎండీ నేడో, రేపో విడుదల చేయనుంది.


