శనివారం సచివాలయంలో కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి
ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పేరుతో రాష్ట్రమంతటా ప్రత్యేక కార్యక్రమం
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు...
పౌర సేవలను సులభతరం చేసేలా సాంకేతిక సంస్కరణలు
సంస్కరణల కోసం సీనియర్ ఐఏఎస్ జయేశ్ ఆధ్వర్యంలో కమిటీ
ఐఏఎస్ అధికారులే ప్రభుత్వానికి వెన్నెముక
4న కలెక్టర్ల సమావేశంలో అందరి పనితీరుపై మాట్లాడతా
జూన్ 2న తెలంగాణ పండుగ ఘనంగా జరుపుకోవాలి
కార్యదర్శుల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజాప్రభుత్వ పథకాలు.. అభివృద్ధి పనులు, ప్రజోపయోగ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజులపాటు ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’కార్యక్రమం చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 99 రోజుల కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కార్యక్రమాల షెడ్యూల్‌ను రూపొందించి, వాటిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగో తయారు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. ఫైళ్లలో ఉన్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఫలితాలుగా మారాలని, ప్రజలకు పథకాల ప్రయోజనం ప్రత్యక్షంగా చేరేలా యంత్రాంగం మొత్తం ఒకే లక్ష్యంతో పనిచేయాలని చెప్పారు.
ఈ 99 రోజుల్లో పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌తోపాటు రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు అన్ని కార్యాలయాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలన్నారు. ఇందుకు ప్రతి శాఖ, ప్రతి జిల్లా, ప్రతి అధికారి మిషన్ మోడ్‌లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో శనివారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తానని చెప్పారు. అధికారుల పనితీరు లోపాలను సహించబోమని హెచ్చరించారు. ఐఏఎస్ అధికారులే ప్రభుత్వానికి వెన్నెముక అని.. ప్రతి పథకం, ప్రతి పాలసీ విజయం, వైఫల్యం వారిపైనే ఆధారపడి ఉన్నాయన్నారు. మార్చి 4న నిర్వహించే కలెక్టర్ల సమావేశంలో అందరి పని తీరుపై మాట్లాడతానని వెల్లడించారు.
ఇంటి నుంచే అన్ని సేవలు పొందేలా..
పరిపాలనలో అధునాతన సాంకేతికను సమర్థంగా వినియోగించాలని అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రజలు ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారానే అన్ని పథకాలు, సేవలు పొందేలా సాంకేతిక సంస్కరణలు తీసుకురావాలని నిర్దేశించారు. కరెంట్ మీటర్, ఇళ్ల నిర్మాణానికి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులు, సేవలకు ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా పనులు జరగాలని చెప్పారు. వాహనం కొన్న షోరూంలోనే రిజిస్ట్రేషన్ చేసే విధానం అమల్లోకి వచ్చిందని, ఇలా ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలన్నారు. ఏ ఫైలు, ఏ ఆర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునే సునాయస విధానం ఉండాలని సూచించారు. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ అధ్వర్యంలో కమిటీ వేయాలని ఆదేశించారు. మూడు వారాల్లో నివేదికను అందజేయాలని కోరారు. ప్రతీ విభాగంలో డిజిటల్ గవర్నెన్స్ అమలు చేయాలని, డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్లను వచ్చే 20 ఏళ్లకు సరిపడేలా అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు.
కేంద్రం సమ్మిట్‌పై విమర్శలొచ్చాయి..
కేంద్రం నిర్వహించిన ఏఐ సమ్మిట్‌పై కొన్ని విమర్శలు వచ్చాయని, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ అందరి దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు జోన్లుగా విభజించామని గుర్తు చేశారు. కోర్ అర్బన్ రీజియన్‌లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ప్రతి ఐఏఎస్ అధికారి తమ శాఖలో బెస్ట్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసుకోవాలని, తమంతట తాముగా గర్వపడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ఉద్యోగుల డేటా సిద్ధంగా ఉండాలి..
రెగ్యులర్ ఉద్యోగులతోపాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల సమాచారం అన్ని శాఖల కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఉండటానికి వీల్లేదని ఆదేశించారు. ప్రతి శాఖకు సొంత భవనం ఉండాలని, బడ్జెట్ ప్రతిపాదనల్లో వీటిని చేర్చాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను రాబట్టుకునేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని, నిధుల సద్వినియోగం చేపట్టడం వల్ల ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా రాష్ట్రం సాధించుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం ఉండాలని, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ప్రజలు మార్పును స్వాగతిస్తున్నారు..
పారదర్శకత, జవాబుదారీతనం, మార్పును తీసుకొస్తామనే హామీతో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం రెండేళ్ల మూడు నెలలు పూర్తి చేసుకుందని, ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వరుస ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అన్నారు. ఇప్పటివరకు సాధించిన విజయాలను నిజాయితీగా అంచనా వేసుకుని, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించాలని అధికారులను హెచ్చరించారు. వచ్చే ఎన్నికల నాటికి మిగిలిన రెండేళ్లు తొమ్మిది నెలలకు సరైన ప్రణాళికతో కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం సూచించారు.


