మండే ఎండ.. జాగ్రత్తలే అండ | Summer High temperatures recorded earlier this year | Sakshi
Sakshi News home page

మండే ఎండ.. జాగ్రత్తలే అండ

Mar 31 2025 5:09 AM | Updated on Mar 31 2025 5:09 AM

Summer High temperatures recorded earlier this year

ఈ ఏడాది ముందుగానే అధిక ఉష్ణోగ్రతలు నమోదు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచే గరిష్ట ఉష్ణోగ్రతలు నమో దవుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. దీనికితోడు వడగాడ్పులు వణికిస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు, వడగాడ్పుల తీవ్రత  ఇంకా ఎక్కువ ఉండే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో.. వడదెబ్బ బారినపడకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తు­న్నారు. 

పొలాల్లో పనిచేసే రైతులు, భవన నిర్మాణ, ఇతర కార్మికులు, ఉపాధి కూలీలు, సాధారణ ప్రజలు ముందస్తు జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ఎండల్లో పనిచేసే కార్మికులు గంటకు 10 నిమిషాల చొప్పున నీడపట్టున చేరి విశ్రాంతి తీసుకోవడం మంచిదంటున్నారు. ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు, వృద్ధులు, ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉ.11 గంటల నుంచి సాయంత్రం వరకూ ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. గతేడాది రాష్ట్రంలో 4,422.. అంతకుముందు ఏడాది 833 చొప్పున వడదెబ్బ కేసులు నమోదయ్యాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
– ఎక్కువ సమయం ఏసీలో ఉండి ఒక్కసారిగా ఎండలోకి రాకూడదు. అదే విధంగా 40 డిగ్రీల ఎండలో తిరిగి ఒకేసారి 18 డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ఏసీ గదుల్లోకి వెళ్లకూడదు. 
– వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. 
– ఎండలో తిరగాల్సిన పరిస్థితి వస్తే గొడుగు, టోపీ, హెల్మెట్‌ వాడాలి. 
– పిల్లలను ఎండలో ఆడుకోనివ్వకుండా, ఇండోర్‌ ఆటలకు ప్రాధాన్యత ఇవ్వాలి. 
– ఇంట్లోకి వడగాలులు రాకుండా కిటికీలకు కర్టెన్‌లు వాడాలి.
– దాహం తీర్చుకోవడానికి శీతల పానీయాలు తాగుతుంటారు. ఇలాచేస్తే మరింత దాహం పెరుగుతుంది. వీటికి బదులు మజ్జిగా, కొబ్బరినీళ్లు, నిమ్మరసం తాగడం ఉత్తమం. 
– శరీరాన్ని డీహైడ్రేట్‌ చేసే ఆల్కహాల్, టీ, కాఫీ, కార్బొనేట్‌ శీతల పానీయాలు తాగకూడదు. అలాగే, అధిక ప్రొటీన్, ఉప్పు, కారం, నూనె ఉండే ఆహార పదార్థాలు తినకూడదు.

వడదెబ్బకు గురైతే చేయాల్సినవి..
– వడదెబ్బకు గురైన బాధితుడిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చి ప్రథమ చికిత్స అందించాలి.
– బాధితుడిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చాలి.
– బట్టలు వదులు చేసి, చల్లటి నీటితో శరీరాన్ని తడపాలి. ఈ విధంగా చేస్తే రక్తనాళాలు కుచించుకుపోకుండా ఆపే అవకాశం ఉంటుంది.
– గజ్జల్లో, చంకల్లో, మెడ వద్ద ఐస్‌ ప్యాక్‌లు ఉంచాలి. ఈ చర్యలు తీసుకుంటూనే వీలైనంత త్వరగా బాధితుడిని ఆస్పత్రికి తరలించాలి.

రోజూ కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి..
శరీరం డీహైడ్రేడ్‌ కాకుండా జాగ్రత్తపడాలి. రోజుకు కనీసం నాలుగు లీటర్ల నీరు తాగాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల పైబడినా, ఐదారు గంటలపాటు మూత్ర విసర్జన నిలిచిపోవడం.. చర్మం పొడిబారి వదులుగా మారడం, నీరసం, నిస్సత్తువ వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. చిన్నపిల్లలు వేడి, చలిని తట్టుకోలేరు కాబట్టి తల్లిదండ్రులు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. గర్భిణులు, వృద్ధులు ఎండలేని సమయంలోనే బయటకెళ్లాలి. 
– డాక్టర్‌ పి. ప్రసాద్, మెడికల్‌ ఆఫీసర్, కాకుమాను, గుంటూరు జిల్లా

Advertisement
 
Advertisement
Advertisement