అసాధారణ ఉష్ణోగ్రతలను సూచిస్తున్న (ఎరుపురంగు) ఉపగ్రహ చిత్రం
ఎల్‌నినో పరిస్థితులు తీవ్రం
వచ్చే ఏడాదీ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు?
శాస్త్రవేత్తల ఆందోళన
సిడ్నీ: ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉష్ణోగ్రతలు జూన్ నెలలో రికార్డు సృష్టించాయి. 2023–24 ఎల్‌నినో పరిస్థితుల కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో ప్రభావం నుంచి బయట పడినా వచ్చే ఏడాది కూడా రికార్డు స్థాయి దు్రష్పభావాలు ఉండవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఉష్ణ మండల, సమశీతోష్ణ మండల సముద్ర ఉష్ణోగ్రతలు 21 డిగ్రీ ల సెల్సియస్ వరకూ ఉండగా 1870లో ఇది 19.6 డిగ్రీల సెల్సియస్ మాత్రమే. తేడా 1.4 డిగ్రీ సెల్సియస్ మాత్రమే అయినప్పటికీ విస్తృతమైన సముద్ర ప్రాంతాన్ని పరిగణలోకి తీసుకుంటే మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. ఎంతో శక్తిని ఉపయోగిస్తే కానీ.... ఇంత విశాలమైన స్థాయిలో సముద్రం వేడెక్కదు. పెట్రోల్, డీజిళ్ల వంటి శిలాజ ఇంధనాలు మండించడం వల్ల పుట్టిన వేడిలో 90 శాతం కంటే ఎక్కువ సముద్రాలే గ్రహించాయన్నమాట. దీంతో సముద్రాలు వేగంగా వేడెక్కుతున్నాయి. ఒక్క 2025లో మాత్రమే సముద్రం శోషించుకున్న వేడి... సెకనుకు ఒకటి చొప్పున 12 అణుబాంబులు పేలిస్తే పుట్టేంత శక్తికి సమానమని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితులను గతంలో పోల్చాలంటే కనీసం 1,20,000 ఏళ్ల క్రితం నాటి కాలానికి వెళ్లాలి. భూమి కక్ష్యలో జరిగిన చిన్న మార్పుల కారణంగా కొన్ని వేల సంవత్సరాల్లో సముద్రాలు వేడెక్కాయి. శిలాజ ఇంధనాల వాడకం, ఇతర మానవ చర్యల పుణ్యమా అని ఇప్పుడు మాత్రం అంతేస్థాయి వేడి వందేళ్లలోనే చేరుకున్నాం. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే... సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం ఏదో ఒక ఏడాదికి మాత్రమే పరిమితం కాకపోవడం. సముద్రనీటి ఉష్ణోగ్రతలు పెరిగితే తుపానులు మరింత బలంగా వస్తాయి. వాతావరణంలో తేమ ఎక్కువ అవుతుంది. ఫలితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు సాధారణమవుతాయి. ఈ పరిణామాలు కాస్తా సముద్రాలపై ఉండే గాలి మరింత వేడెక్కేందుకు కారణమవుతుంది.
ఫలితంగా భూమ్మీద వడగాడ్పులు ఎక్కువవుతాయి. సముద్ర జలాల ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఏర్పడుతున్న ఎల్‌నినో మరింత తీవ్రతరమయ్యే అవకాశం ఉంది. ఇందుకు తగ్గట్టుగానే హిందూ మహా సముద్ర పశ్చిమ ప్రాంతం, ఉష్ణమండల అట్లాంటిక్ మహా సముద్ర ప్రాంతం పసిఫిక్ మహాసముద్రం తూర్పు ప్రాంతాల్లో వడగాడ్పులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.
యూరోపియన్ దేశాల్లో ప్రస్తుతం అనూహ్య స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలోని సముద్ర జలాలు కూడా బాగా వేడెక్కాయి. మధ్యధరా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఇది దీర్ఘకాల సగటు కంటే 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా ఉండటం గమనార్హం. నార్త్ సీలోని కొన్నిచోట్ల ఇది 3 డిగ్రీల కంటే ఎక్కువగా ఉంది. సముద్ర జలాలు నిరంతరం వేడెక్కడం వల్ల పగడపు దీవుల వంటి సముద్ర జీవవ్యవస్థలకు ప్రమాదకరమన్నది తెలిసిందే. 2023–24 ఎల్‌నినో ఏడాదితోపాటు, 2024 నాటి రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
ప్రపంచవ్యాప్తంగా వడగాడ్పులు, కరువులు, వర్షాల ముప్పు
న్యూఢిల్లీ: రాబోయే నెలల్లో ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో ‘ఎల్‌నినో’పరిస్థితులు వేగంగా బలపడే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) శుక్రవారం వెల్లడించింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వడగాడ్పులు, కరువులు, భారీ వర్షాలు, ఇతర తీవ్ర వాతావరణ పరిస్థితులు ఏర్పడే ముప్పు పెరుగుతుందని హెచ్చరించింది. డబ్ల్యూఎంఓ గ్లోబల్ సీజనల్ క్లైమేట్ అప్‌డేట్ ప్రకారం.. ఈ సంవత్సరం జూలై–సెపె్టంబర్ మధ్యకాలంలో ఎల్‌నినో వేగంగా అభివృద్ధి చెంది బలమైన ఎల్‌నినోగా మారనుంది.
ఎల్‌నినో అనేది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రం వెంబడి సముద్ర ఉష్ణోగ్రతల్లో మార్పులు, దానిపై ఉన్న వాతావరణంలో హెచ్చుతగ్గుల ద్వారా వర్గీకరించే ఒక వాతావరణ దృగి్వషయం. ‘‘ఎల్‌నినో పరిస్థితులు ఇప్పటికే మొదలయ్యాయి. ఇవి వేగంగా బలపడి ఒక శక్తివంతమైన ఎల్‌నినోగా మారుతాయని అంచనా వేస్తున్నాం. ఇది అనేక ప్రాంతాల్లో కరువు, భారీ వర్షపాతం సంభవించే అవకాశాలను, అలాగే భూమిపై వడగాడ్పులు, సముద్రపు వేడిగాలుల ముప్పును తీవ్రతరం చేస్తుంది’’అని డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో చెప్పారు. ఎల్‌నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని జూన్ 12న భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించిన సంగతి తెలిసిందే. నైరుతి రుతుపవనాల కాలంలో అవి మరింత బలపడతాయని ఐఎండీ పేర్కొంది.


