వాయుగుండంగా మారే అవకాశం
వచ్చే రెండు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం బలపడిందని వాతావరణ శాఖ ఆదివారం వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఇది వాయవ్య దిశగా పయనిస్తూ వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, మార్కాపురం, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.


