ప్రైవేటు స్కూలు గేటు వద్ద విద్యార్థి తల్లి మౌలాభి నిరసన
సింగరాయకొండ: ‘నా కుమారుడు తౌషిక్ (11) ఇక్కడే మరణించాడు. నేనూ ఇక్కడే మరణిస్తా. నా కుమారుడు చనిపోయి ఆరు నెలలవుతున్నా ఇంత వరకు దోషులపై ఎటువంటి చర్యలు లేవు. కోర్టును ఆశ్రయించినా లాయర్ నాకు అన్యాయం చేశాడు. చివరకు నాకు మరణమే శరణ్యం. నేను ఇంటి దగ్గర ఉంటే నా బిడ్డ పదేపదే గుర్తుకు వస్తున్నాడు. ఇక నేను ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. నా శవమే ఇక్కడ నుంచి కదులుతుంది’ అని తల్లి మౌలాభి గుండెలవిసేలా విలపించారు. ప్రకాశం జిల్లా మూలగుంటపాడు పంచాయతీలోని శ్రీ చైతన్య నవోదయ స్కూలు వద్ద ఆదివారం ఆమె నిరసనకు దిగారు.
‘ఈ స్కూలు వాళ్లు నా కుమారుడి గొంతులో పెన్నుతో పొడిచి చంపేశారు. ఆత్మహత్య అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘మేమంతా ఓట్లు వేసి గెలిపించుకున్న కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరశింహారెడ్డి.. ఈ సమస్యను ఎవరూ తన వద్దకు తీసుకుని రావద్దని మా కులస్తుల సమావేశంలో తెగేసి చెప్పారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటాన్ని ఆపనని, తాను ఇక్కడే చనిపోతానని ఆమె తేల్చి చెప్పారు. కాగా రాత్రి 9 గంటల సమయంలో పోలీసులు ఆమెకు నచ్చజెప్పి ఇంటికి పంపించారు.


