పేరుకుపోయిన రూ.20,858 కోట్ల బకాయిలు
విద్యుత్ సరఫరా చేసినా.. నగదు వసూలుగాక ఉక్కిరిబిక్కిరి
ఎన్‌సీఎల్‌టీ, కోర్టు కేసులతోఅరకొర వసూళ్లే
అన్‌సెక్యూర్డ్ క్రెడిటర్‌గా చివరి వరుసలో డిస్కంలు
వన్‌టైమ్ సెటిల్‌మెంట్ స్కీమ్‌తోను వచ్చేది అరకొరే
జనరేటర్లకు మరో రూ.14,653 కోట్ల చెల్లింపుల భారం
సాక్షి, అమరావతి: సామాన్య, మధ్య తరగతి ప్రజలు ప్రతినెలా గడువులోగా బిల్లు చెల్లించకపోతే విద్యుత్ సరఫరా నిలిపేసే విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు.. రూ.లక్షల్లో ఉన్న బిల్లులు చెల్లించకపోయినా బడా సంస్థలు, పెద్ద పరిశ్రమల నిర్వాహకులను ఏమీ చేయలేకపోతున్నాయి. ఇలా ఏళ్ల తరబడి పేరుకుపోతున్న బకాయిలు ఇప్పుడు రాష్ట్రంలో డిస్కంల ఆర్థిక నిర్వహణకు పెద్ద సవాలుగా మారాయి.
ఒకవైపు వినియోగదారులు, ప్రభుత్వశాఖలు, స్థానికసంస్థల నుంచి రావాల్సిన వేలకోట్ల రూపాయలు బకాయిలుగా నిలిచిపోతుండగా.. మరోవైపు విద్యుత్ కొనుగోలు చేసిన జనరేటర్లకు డబ్బు చెల్లించాల్సి వస్తోంది. ఫలితంగా డిస్కంల అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) తాజాగా వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) పథకాన్ని పునరుద్ధరించింది.
ప్రభుత్వశాఖలు, సంస్థల నుంచే రూ.8,910.71 కోట్ల బకాయిలు
ఏపీఈఆర్‌సీ 2025–26 టారిఫ్ ఆర్డర్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం సబ్సిడీ బకాయిలను మినహాయించినా డిస్కంలకు రూ.20,858.47 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో ప్రభుత్వశాఖలు, సంస్థల నుంచే రూ.8,910.71 కోట్లు, స్థానికసంస్థల నుంచి రూ.6,259.38 కోట్లు రావాల్సి ఉండగా ప్రైవేటు వినియోగదారుల నుంచి రూ.5,222.59 కోట్లు వసూలు కావాల్సి ఉంది. దీంతో విద్యుత్ కొనుగోలు, ప్రసార–పంపిణీ నిర్వహణ, సిబ్బంది జీతాలు, ఇతర వ్యయాలు, ఇతరత్రా తప్పనిసరి చెల్లింపులకు ఇబ్బందులు కలుగుతున్నాయి.
మరోవైపు 2025 మార్చి 31 నాటికి జనరేటర్లకు చెల్లించాల్సిన బకాయిలు సుమారు రూ.14,653 కోట్లుగా ఏపీఈఆర్‌సీ రికార్డులు చెబుతున్నాయి. అంటే ఒకవైపు డిస్కంలు సరఫరా చేసిన విద్యుత్‌కు రావాల్సిన డబ్బు నిలిచిపోతుండగా.. మరోవైపు డిస్కంలు కొనుగోలు చేసిన విద్యుత్‌కు చెల్లించాల్సిన మొత్తాలు పేరుకుపోతున్నాయి. పాత బకాయిలు ఎక్కువకాలం పెండింగ్‌లో ఉండటం వల్ల వాటి వసూళ్లు మరింత సంక్లిష్టం కావడంతో ఓటీఎస్‌ను పునరుద్ధరించాలని డిస్కంలు ఏపీఈఆర్‌సీని అభ్యర్ధించాయి.
డిస్కంలకు వచ్చేది అరకొరే
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పరిశ్రమల నుంచి బకాయిల వసూలు డిస్కంలకు తలనొప్పిగా మారింది. పాత బకాయిల వసూళ్లకు న్యాయపరమైన చిక్కులు కూడా తోడవుతున్నాయి. ముఖ్యంగా పరిశ్రమలు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)ను ఆశ్రయించినప్పుడు డిస్కంలు అన్‌సెక్యూర్డ్ క్రెడిటర్లుగా మిగులుతున్నాయి. దీంతో సంవత్సరాల తరబడి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించిన బకాయిల్లోను పూర్తి మొత్తం తిరిగి వచ్చే పరిస్థితి ఉండటం లేదు. అసలు విద్యుత్ బకాయితో పోలిస్తే పరిష్కారం ద్వారా అందే మొత్తం చాలా తక్కువగా ఉంటోందని ఏపీఎస్పీడీసీఎల్.. ఏపీఈఆర్‌సీకి సమర్పించిన నివేదికలోæ పేర్కొంది. విద్యుత్ సరఫరా చేసిన సమయంలో మొత్తం బిల్లు డిస్కం ఖాతాలో బకాయిగా కనిపించినా.. తర్వాత న్యాయపరమైన పరిష్కారంలో అందులో కొంతభాగమే చేతికి వచ్చే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపింది.
ఇప్పుడైనా వసూలవుతాయా?
బిల్లులు నిలిచిపోయి, కనెక్షన్లు తొలగించిన సేవలకు సంబంధించిన పాత బకాయిలను సాధారణ వసూళ్ల ప్రక్రియలో రాబట్టడం కష్టంగా మారడంతో ఓటీఎస్‌ను పునరుద్ధరించారు. సెప్టెంబర్ 28 నుంచి వచ్చే ఏడాది జూన్ 30 వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఏడాదికి పైగా బిల్–స్టాప్‌లో ఉన్న ఎల్‌టీ, హెచ్‌టీ ప్రైవేట్ వినియోగదారుల బకాయిలు ఈ పథకం పరిధిలోకి వస్తాయి.
కనెక్షన్ తొలగించిన తేదీ నాటికి ఉన్న బకాయిలో సెక్యూరిటీ డిపాజిట్‌ను సర్దుబాటు చేసి, మిగిలిన మొత్తాన్ని ఒకేసారి వసూలు చేయనున్నారు. అయితే ఎన్‌సీఎల్‌టీ కేసులు, కోర్టు కేసులు, రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద తుదిదశలో ఉన్న కేసులకు ఈ పథకం వర్తింపుపై పరిమితులున్నాయి. ఎన్‌సీఎల్‌టీ కేసుల్లో సంబంధిత వినియోగదారు లేదా ఐఆర్‌పీ, లిక్విడేటర్ అంగీకారం అవసరమని ఏపీఈఆర్‌సీ స్పష్టం చేసింది. పథకం అమలు, వసూళ్ల పురోగతిపై రెండునెలలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.


