ఏపీ జేఏసీ అమరావతి సెక్రటేరియేట్ సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఉద్యోగులకు ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపు
న్యాయమైన హక్కుల సాధన కోసం ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు
ప్రభుత్వ వైఖరిపై సమీక్ష.. అదే రోజు ఉద్యమ కార్యాచరణ ప్రకటన
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వెంటనే నోటీసు
అన్ని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాల భాగస్వామ్యంతో కదం తొక్కుదాం
ఉద్యోగులంతా ఒక్కటై ఉద్యమానికి సిద్ధం కాకపోతే భవిష్యత్ తరాలకు తీరని నష్టం
ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటే ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమా?
రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లించమంటే ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా నిలబెడతారా?
ఉద్యమం కారణంగా ప్రజలకు అసౌకర్యం కలిగితే అందుకు ప్రభుత్వానిదే బాధ్యత
సాక్షి, అమరావతి: సమస్యల పరిష్కారం, చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఉద్యోగులంతా ఉద్యమానికి సిద్ధం కావాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడం లేదని, ఈ జాప్యాన్ని ఇక సహించేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగుల హక్కులు, ఆత్మాభిమానం, భవిష్యత్ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఐక్యంగా ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదని తెగేసి చెప్పారు. ఆదివారం విజయవాడ రెవెన్యూ భవన్‌లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి, స్టేట్ సెక్రటేరియట్ ఉద్యమ కార్యాచరణ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 28న విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించి ఉద్యమ షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ వైఖరిని సమీక్షించడంతోపాటు ఉద్యమ శంఖారావం పూరిస్తామన్నారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వెంటనే నోటీసు ఇస్తామని.. కలిసి వచ్చే అన్ని ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలను సంప్రదించి.. ఉద్యమంలో భాగస్వాములను చేయడం ద్వారా కదం తొక్కుదామన్నారు. ఉద్యోగులంతా ఒక్కటై ఉద్యమానికి సిద్ధం కాకపోతే భవిష్యత్ తరాలకు తీరని నష్టం జరుగుతుందని తెలిపారు.
బకాయిలు అడిగితే.. దోషులుగా నిలబెడతారా?
ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలు, మధ్యంతర భృతి, డీఏలు, పీఆర్సీ తదితర న్యాయమైన హక్కులను పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సుమారు రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల పూర్తి వివరాలను ప్రభుత్వం ఎందుకు వెల్లడించడం లేదని నిలదీశారు. ఉద్యోగులు ప్రభుత్వం నుంచి కొత్తగా ఏమీ అడగడం లేదని, తమకు రావాల్సిన న్యాయమైన హక్కులనే అడుగుతున్నారని అన్నారు. అలాంటి ఉద్యోగులను ప్రజల ముందు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని కాపాడటం అంటే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించక పోవడమేనా అని ప్రశ్నించారు.
ఏపీ జేఏసీ ప్రధాన కార్యదర్శి, ఉద్యమ కమిటీ కన్వీనర్ పలిశెట్టి దామోదరరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పదేపదే కాలయాపన చేయడం ద్వారా ప్రభుత్వమే ఉద్యోగులను ఉద్యమం వైపు నడిపిస్తోందని అన్నారు. ఇప్పుడు ఉద్యోగులు హక్కుల కోసం నిలబడకపోతే రేపటి తరానికి మనమే సమాధానం చెప్పాల్సి వస్తుందన్నారు. ఉద్యమం కారణంగా భవిష్యత్‌లో ప్రజలకు అసౌకర్యం కలిగితే.. అందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఉద్యమ కమిటీ చైర్మన్ ఫణి పేర్రాజు, రాష్ట్ర కోశాధికారి టి.నాగేశ్వరరావు, మహిళా విభాగం చైర్‌పర్సన్ పి.లక్ష్మి, సెక్రటరీ జనరల్ పొన్నూరు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


