నోటిఫికేషన్‌లో తప్పుగా పేర్కొన్న తేదీ
బాలల సంరక్షణపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం
కమిటీ నియామకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం రద్దు చేయడం
తాజాగా నాలుగోసారి నోటిఫికేషన్‌తోనూ అరకొర నియామకాలు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో బాలల సంరక్షణ కమిటీలు (సీడబ్ల్యూసీ), జువైనల్ జస్టిస్ బోర్డు (జేజేబీ) నియామకాల విషయంలో చంద్రబాబు సర్కారు తమాషాలు చేస్తోంది. ఇప్పటికే మూడుసార్లు నోటిఫికేషన్లు ఇచ్చి రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా నాలుగోసారి నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 నవంబర్‌లోనే రాష్ట్రంలో సీడబ్ల్యూసీలు, జేజేబీల కాల పరిమితి ముగిసింది. అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నరకు పైగా నోటిఫికేషన్లు ఇవ్వడం.. ఇంటర్వూ్యలు చేయడం.. చివరకు నియామకాల దశలో రద్దు చేయడం పరిపాటిగా మారింది.
తాజాగా మూడు నోటిఫికేషన్ల రద్దు చేసిన అనంతరం ఈ నెల 11న అరకొర నియామకాలతో మునపెన్నడూ లేని సంప్రదాయానికి చంద్రబాబు ప్రభుత్వం తెరలేపింది. 28 జిల్లాల్లో 140 మందిని నియామకం చేయాల్సి ఉండగా, కేవలం 9 జిల్లాల్లో 33 మందిని మాత్రమే నియమించింది. ఈ నేపథ్యంలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవడం.. కూటమి నేతల్లోనే ఈ నియామకాలపై అసంతృప్తి జ్వాలలు రేగడంతో ఆ మొత్తం ప్రక్రియను రద్దు చేసి ఈ నెల 14న నాలుగోసారి నోటిఫికేషన్ ఇచ్చింది.
సీడబ్ల్యూసీల నియామకానికి సంబంధించిన రిఫరెన్స్‌లో పేర్కొన్న అంశాలు తప్పుగా వచ్చినా సరిదిద్దే ప్రయత్నం కూడా చేయలేదు. ఈ నెల 11న ఇచ్చిన జీవోలో 11.08.2026 అనడానికి బదులు 11.08.2028 అని ఇచ్చింది. తర్వాత ఈ తప్పును సరి చేయక పోవడం గమనార్హం. కాగా, నియామక కమిటీ మంత్రి సంధ్యారాణి, కీలక మంత్రి లోకేశ్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో ఈ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని సమాచారం.


