అత్యంత విలువైన వీఎంఆర్‌డీఏ స్థలాన్ని బినామీకి కట్టబెట్టి భారీగా లబ్ధి పొందేందుకు ఎత్తుగడ
వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చి ఈపీసీ టెండర్ నోటిఫికేషన్ రద్దు
ముఖ్యనేత సూచనతో పీపీపీ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్ జారీకి రంగం సిద్ధం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో అత్యంత విలువైన సిరిపురంలోని రూ.300 కోట్ల ఖరీదైన వీఎంఆర్‌డీఏ (విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ) భూమిపై ‘ముఖ్య’నేత కన్ను పడింది! అత్యంత విలువైన ఆ భూమిని బినామీకి కట్టబెట్టి.. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించి భారీ ఎత్తున లబ్ధి పొందేందుకు స్కెచ్ వేశారు! ఆ భూమిలో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి వీఎంఆర్‌డీఏ జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను రద్దు చేయించి పీపీపీ (ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో బినామీకి కట్టబెట్టందుకు రంగం సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంపద సృష్టించకుండా బినామీలకు దోచిపెడుతున్నారనేందుకు ఇది మరో తార్కాణమిదని పారిశ్రామికవేత్తలు, ప్రజాసంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. విశాఖలో అత్యంత ప్రధానమైన సిరిపురంలో డెక్ ఐకానిక్ టవర్ సమీపంలో సర్వే నెంబరు 83/1, 85/పీలో 0.98 ఎకరాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని వీఎంఆర్‌డీఏ నిర్ణయించింది. జీ+13 అంతస్తులతో 3,07,503 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో కాంప్లెక్స్ నిర్మాణ పనులకు రూ.71.17 కోట్ల అంచనా వ్యయంతో ఈపీసీ (ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్) విధానంలో గత మార్చి 16న టెండర్లు పిలిచింది.
అత్యంత విలువైన ఈ భూమిపై ముఖ్యనేత కన్నుపడింది. దాన్ని బినామీకి కట్టబెట్టి కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తే భారీ ఎత్తున లబ్ధి పొందవచ్చునని కన్నేశారు. అంతే.. వీఎంఆర్‌డీఏ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ టెండర్ రద్దు చేయించారు. గత మే 30న కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను ఈపీసీలో కాకుండా పీపీపీ(ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం) విధానంలో నిర్మించేలా తీర్మానం చేయించారు. పీపీపీ పద్ధతిలో టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడానికి వీఎంఆర్‌డీఏ సిద్ధమైంది. ఆ పనులను బినామీకి కట్టబెట్టేలా ముఖ్యనేత చక్రం తిప్పుతున్నారు.
నాలుగేళ్లలో పెట్టుబడి వెనక్కి.. ఆ తర్వాత లాభాలు
అదే ఈపీసీ పద్ధతిలో నిర్మించి ఉంటే.. వీఎంఆర్‌డీఏకు సంపదగా మారేది. ఏటా కనీసం సగటున రూ.17.4 కోట్లు అద్దెల రూపంలో అదాయం వస్తుంది. నాలుగేళ్లలోనే ఆ కాంప్లెక్స్‌కు వెచ్చించిన వ్యయం వీఎంఆర్‌డీఏకు చేరేది. ఆ తర్వాత ఏటా రూ.17.4 కోట్ల మేర ఆదాయం వచ్చేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఐదో ఏట నుంచి ఏటా భారీ ఎత్తున వీఎంర్‌డీఏకు ఆదాయాల రూపంలో భారీ ఎత్తున లాభాలు వచ్చేవని పేర్కొంటున్నారు.
విశాఖను విశ్వనగరంగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉండేదంటున్నారు. కానీ పీపీపీ పద్ధతిలో టెండర్లు పిలిచి.. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని కాంట్రాక్టర్‌కు కట్టబెడితే వీఎంఆర్‌డీఏకు దక్కేది అత్తెసరేనని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టి బినామీకి సంపద సృష్టిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
సంపద సృష్టి అంటే ఇదీ..
వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.91.65 కోట్ల వ్యయంతో 3.76 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతంతో డెక్ ఐకానిక్ టవర్‌ను నిర్మించింది. డెక్ ఐకానిక్ టవర్ విశాఖ సిగలో కలికితురాయిగా మారింది. రైల్వే జోన్ కార్యాలయంసహా పలు ఐటీ కంపెనీలు అక్కడ కార్యాలయాలను ఏర్పాటుచేసుకున్నాయి. ఈ భవనానికి చేసిన వ్యయం అద్దెల రూపంలో నాలుగైదేళ్లలోనే వీఎంఆర్‌డీఏకు వస్తుంది. ఆ తర్వాత వీఎంఆర్‌డీకు ఏటా భారీ ఎత్తున ఆదాయం సమకూరుతుంది. సంపద సృష్టించడమంటే ఇదీ అని వీఎంఆర్‌డీఏ వర్గాలు పేర్కొంటున్నాయి.


