కారులోని మద్యం, గంజాయి, పోలీస్ యూనిఫాం
కారులో సంతమాగులూరు, బల్లికురవ ఎస్సైలు..
డిక్కీలో గంజాయి, మద్యం, పోలీసు యూనిఫాంలు!
మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలు
ఘటనా స్థలానికి చేరుకున్న అద్దంకి సీఐ.. గ్రామస్తులతో వాగ్వాదం
వీడియో తీస్తే కేసులు పెట్టి లోపలేస్తానంటూ బెదిరింపులు
ఈర్లకొండలో ఎస్సై ప్రైవేట్ పార్టీ.. అందులో మిగిలిన గంజాయి, మద్యం
వాటిని తీసుకొని వస్తుండగానే ప్రమాదం..
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో గంజాయి, మద్యం పరిస్థితి ఇదీ..
సాక్షి టాస్క్‌ఫోర్స్: చంద్రబాబు ఏలుబడిలో రాష్ట్రంలో గంజాయి, మద్యం రవాణా, వినియోగం ఏ స్థాయికి చేరుకున్నాయో.. పరిస్థితి ఎంతగా దిగజారిందో చెప్పేందుకు ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలోని శంఖవరప్పాడు వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. పోలీసులు ప్రయాణిస్తున్న కారులో మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు, పోలీసు యూనిఫాంలు ఉండడం కలకలం రేపుతోంది. అంతేకాక, మద్యం మత్తులో ఉన్న పోలీసు కారు డ్రైవర్ ఓ ఆటోను ఢీకొట్టడంతో ఆటోలోని ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్సై నాగరాజు ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. కాగా ఈ ఘటన గురించిన సమాచారం అందుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు అక్కడకు చేరుకుని వీడియో తీస్తున్న గ్రామస్తులను బెదిరించడం గమనార్హం..
ఎస్సై ప్రైవేటు పార్టీ..
బల్లికురవ ఈర్లకొండ వద్ద ఎస్సై నాగరాజు ప్రైవేటు పార్టీ నిర్వహించినట్లు చెబుతున్నారు. అక్కడ ఆయన పలువురు ప్రముఖులకు మద్యం పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో మిగిలిన మద్యాన్ని, గంజాయిని తరలిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు అర్ధమవుతోందని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. కాగా సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు, బల్లికురవ ఎస్సై నాగరాజు ప్రమాద ఘటన తరువాత ధర్మవరంకు చెందిన ఓ టీడీపీ నాయకుడి కారులో పరారైనట్లు స్థానికులు చెబుతున్నారు.
మద్యం మత్తులో యాక్సిడెంట్..
ఈర్లకొండలో పార్టీ అయిపోయిన తర్వాత ఏపీ 27 సీబీ 4789 నంబరు గల కారులో పోలీసులు బల్లికురవ వైపు నుంచి అద్దంకి వైపు వెళ్తున్నారు. అదే సమయంలో ధర్మవరం నుంచి వస్తున్న ఆటోను కారు డ్రైవర్ మద్యం మత్తులో ఢీకొట్టాడు. ఆటో డ్రైవర్ శ్రీనివాసరెడ్డితో పాటు ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు కారును చుట్టుముట్టారు. 108కు ఫోన్ చేసి స్థానికులు క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
గ్రామస్తులకు సీఐ బెదిరింపులు..
ఘటనా స్థలి వద్దకు గ్రామంలోని వారు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రమాదానికి కారణమై దెబ్బతిన్న కారు డిక్కీని స్థానికులు తెరిచి చూడగా అందులో మద్యం బాటిళ్లు, గంజాయి ప్యాకెట్లు, బల్లికురవ, సంతమాగులూరు ఎస్సైల పోలీసు యూనిఫాంలు ఉన్నాయి. అదేవిధంగా కారు లోపల సంతమాగులూరు, బల్లికురవ ఎస్సైలు నాగమల్లేశ్వరరావు, నాగరాజులున్నట్లు గుర్తించారు. కారును నడుపుతున్న డ్రైవరు సైతం మద్యం సేవించి ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పోలీసులే గంజాయి, మద్యం రవాణా చేస్తుండడం చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. సమాచారం అందుకున్న అద్దంకి సీఐ సుబ్బరాజు ఘటనా స్థలికి హుటాహుటిన చేరుకున్నారు. కారు వద్ద ఉన్న గ్రామస్తులను అక్కడి నుంచి పంపించివేశారు. వీడియో తీస్తే మీ మీద కేసులు పెట్టి లోపలేస్తానని గ్రామస్తులను బెదిరించడం గమనార్హం.
పోలీసుల కారులో గంజాయి, మద్యం రవాణానా?
గంజాయి లేని ఆంధ్రప్రదేశ్ సృష్టిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోం మంత్రి వంగలపూడి అనిత ఈ ఘటనకు ఏం సమాధానం చెబుతారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ప్రశ్నించారు. పోలీసులే మద్యం మత్తులో ఆటోను ఢీకొట్టడం, పోలీసుల వాహనంలోనే మద్యం, గంజాయి రవాణా చేయడం చూస్తే రాష్ట్రంలో పరిస్థితి ఏ స్థాయికి దిగజారిందో అర్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు. మద్యం, గంజాయి రవాణా చేస్తూ ఎస్సైలు దొరికిపోయినా సీఐ వచ్చి వీడియోలు తీస్తే లోపలేస్తానంటూ గ్రామస్తులను బెదిరించడమేమిటని అశోక్‌కుమార్ ప్రశ్నించారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మద్యం, గంజాయితో దొరికిపోయిన ఎస్సైల మీద, గ్రామస్తులను బెదిరించిన సీఐ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


