అందుకే విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతలు
ఉత్తర భారతం వైపు నుంచి వీస్తున్న వాయవ్య గాలులు
ఈ ప్రాంతంలోని తేమను లాగేసుకుంటున్న వైనం
నైరుతి రుతుపవనాలపైనా ప్రభావం
అండమాన్‌లోనే ఆగిన రుతుపవనాలు
మరికొద్దిరోజులు వేడిసెగలే
సాక్షి, అమరావతి: ఎల్‌నినో పరిస్థితులకు తోడు ఉత్తర భారతదేశం వైపు నుంచి వీస్తున్న వాయవ్య గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలోకి వాయవ్య దిశ నుంచి తీవ్రమైన పొడి వేడి గాలులు వస్తున్నాయి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా ప్రయాణించే ఈ గాలులు రాష్ట్రంలోకి ప్రవేశించే సమయానికి తీవ్రమైన వడగాలులుగా మారుతున్నాయి. రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దులు విపరీతంగా వేడెక్కడం వల్ల పుట్టే ఈ గాలుల్ని ‘లూ’ గాలులు అని పిలుస్తారు. ఇవి సముద్రం నుంచి కాకుండా పూర్తిగా భూమి మీదుగా ప్రయాణిస్తూ దారిలో ఉన్న తేమను పూర్తిగా లాగేసుకుంటున్నాయి. మన వద్దకు వచ్చేటప్పుడు తూర్పు కనుమలను దాటే సమయంలో ఈ గాలులు కిందకు దిగడంతో వాతావరణం మరింత వేడెక్కుతోంది. సైన్స్ పరిభాషలో దీన్ని కంప్రెషనల్ హీటింగ్‌గా పిలుస్తారు.
చల్లని గాలుల్ని అడ్డుకుంటున్న వాయువ్య గాలులు
పగటిపూట పశ్చిమ దిశ నుంచి వచ్చే ఈ తీవ్రమైన వేడి గాలుల వల్ల సముద్రం నుంచి వచ్చే సాధారణ చల్లటి గాలులు భూమి మీదకు రావడంలేదు. దీంతో తీరప్రాంతాల్లో గాలిలో తేమ 80 శాతానికిపైగా తగ్గిపోతోంది. ఫలితంగా విపరీతమైన ఉక్కపోత పరిస్థితులు నెలకొంటున్నాయి. సాధారణంగా వేసవి సీజన్‌లో బంగాళాఖాతంలో అల్పపీడనం, ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు ఏర్పడతాయి. వాటివల్ల వేసవి ప్రభావం కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈసారి అలాంటివేమీ లేకపోవడం, ఒక అల్పపీడనం ఏర్పడినా అది బంగ్లాదేశ్ వైపు వెళుతూ సముద్రంలోని చల్లని గాలుల్ని తీసుకుపోయింది. దీంతో మన ప్రాంతం మరింత వేడెక్కే పరిస్థితులు ఏర్పడ్డాయి. మరికొన్న రోజులు వేడిసెగలే ఉండనున్నాయి.
ఎల్‌నినోతో తలకిందులైన వాతావరణ చక్రం
ప్రస్తుత ఎండల తీవ్రతకు ప్రధాన కారణం ఎల్‌నినో అని ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల నీరు అసాధారణంగా వేడెక్కడాన్ని ఎల్‌నినోగా పిలుస్తారు. ఈ ఉష్ణోగ్రత సాధారణం కంటే 2 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు దాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు సూపర్ ఎల్‌నినోగా పరిగణిస్తారు. ఇంకా సూపర్ ఎల్‌నినో దశకు సముద్ర ఉష్ణోగ్రతలు చేరుకోకపోయినా అందుకు దారితీసే పరిస్థితులు ఏర్పడినట్లు చెబుతున్నారు. ఎల్‌నినో కారణంగా మన వాతావరణ చక్రం తలకిందులైంది.
నైరుతి ఆలస్యమే
ఈ ప్రభావం నైరుతి రుతుపవనాలపైనా ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అవి బలహీనంగా మారతాయని అంచనా వేస్తున్నారు. నాలుగు రోజుల కిందటే అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు అక్కడి నుంచి ముందుకు కదలడంలేదు. అవి అక్కడే నిలిచిపోవడంతో ఈ నెలాఖరుకు అవి కేరళను తాకడం అనుమానమే. దీంతో ఈ ఏడాది రుతుపవనాలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ కొంచెం అటు ఇటుగా అవి విస్తరించినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉండదని చెబుతున్నారు. ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉండదని ఇప్పటికే భారత వాతావరణ శాఖ తెలిపింది.
లూ గాలులు అంటే..
రాజస్థాన్ ఎడారి ప్రాంతాలు, పాకిస్తాన్ సరిహద్దులు విపరీతంగా వేడెక్కడం వల్ల పుట్టే గాలుల్ని ‘లూ’ గాలులు అని పిలుస్తారు.


