ఏమిటీ ‘హీట్‌ ఇండెక్స్‌’?.. ఎందుకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు?

IMD Creating Real Index For Summer Weather Heat Levels - Sakshi

మహారాష్ట్రలోని నవీ ముంబై శివార్లలో భారీ సభ.. లక్షల్లో జనాలు వచ్చారు.. ఎండాకాలమే అయినా ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఏమీ లేదు.. అయినా వడదెబ్బ తగిలి ఏకంగా 14 మంది చనిపోయారు. అధిక ఉష్ణోగ్రతకు మరికొన్ని వాతావరణ అంశాలు తోడుకావడమే  దీనికి కారణం. అందుకే కేవలం ఉష్ణోగ్రతను కాకుండా.. ‘హీట్‌ ఇండెక్స్‌’ను పరిగణనలోకి తీసుకోవాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్ణయించింది.

ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉండవచ్చన్న అంచనాలతో కలర్‌ కోడింగ్‌ మ్యాప్‌లనూ విడుదల చేస్తోంది. మరీ ఏమిటీ ‘హీట్‌ ఇండెక్స్‌’? ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు? దీనితో ఏమిటి లాభం? వంటి వివరాలు తెలుసుకుందామా.. 

ఉష్ణోగ్రత, హ్యూమిడిటీ కలిస్తే..
ఎప్పుడైనా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే.. కాస్త వేడిగా అనిపిస్తుంది. కానీ దీంతోపాటు వాతావరణంలో నీటిఆవిరి శాతం (రిలేటివ్‌ హ్యూమిడిటీ) కూ­డా పెరిగితే.. వేడికి తోడు ఉక్కపోత మొదలవుతుంది. ఆచోట నీడ లేకపోయినా, గాలివీయకపోయినా పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. విపరీతంగా చెమట­పడుతుంది. అప్పటికీ ఎండ/వేడిలో నే ఉంటే శరీరంలో డీహైడ్రేషన్‌ మొదలవుతుంది. ఒకదశలో ఊపిరి తీసుకోలేక, స్పృహ తప్పే పరిస్థితి ఏర్పడుతుంది. 

వీటికి ఏమిటి సంబంధం?
మామూలుగా ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటే.. అందుకు తగినట్టుగా గాలి, నీరు వేడెక్కుతూ ఉంటాయి. వేడెక్కిన నీరు వేగంగా ఆవిరి అవుతూ గాలిలో హ్యూమిడిటీ పెరిగిపోతూ ఉంటుంది. మరోవైపు ఎండ, వేడి గాలి కారణంగా మన శరీరం వేడెక్కి చెమటపడుతుంది. మా­మూలుగా అయితే చెమట ఆరినకొద్దీ శరీరం చల్లబడుతుంది. కానీ వాతావరణంలో అప్పటికే హ్యూమిడిటీ ఎక్కువగా ఉండటంతో చెమట ఆరక.. శరీరం వేడెక్కిపోతూనే ఉంటుంది. ఇది శరీరంలోని అవయవాల పనితీరుపై ప్రభావం చూపి.. అస్వస్థతకు గురవుతారు.

 

ఎంత ఉష్ణోగ్రతకు, ఎంత హ్యూమిడిటీ ఉంటే.. ఏంటి పరిస్థితి? 
- ఒక్కో స్థాయిలో ఉష్ణోగ్రతకు, ఒక్కోస్థాయి వరకు హ్యూమిడి టీ ఉంటే ఇబ్బందిగా ఉండదు. అవి పరిమితి దాటితే సమస్యగా మారుతుంది. 
-  26 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రత, 40% వరకు హ్యూమిడిటీ ఉంటే వాతావరణం హాయి గా ఉన్నట్టు. ఈ పరిస్థితిని మన శరీరం సులువుగా తట్టుకోగలుగుతుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. 
- ఈ ఉష్ణోగ్రతలు, హ్యూమిడిటీకి తోడు నేరుగా ఎండలో ఉండటం, వడగాడ్పులు వంటివి కూడా ఉంటే హీట్‌ ఇండెక్స్‌ మరింత ఎక్కువగా ఉంటుంది. 

ఏమిటి దీనితో ప్రయోజనం? 
ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు బయటికి వెళ్లినా తొలుత బాగానే అనిపిస్తుంది. కానీ కాసేపటికే ఇతర అంశాల ప్రభావంతో ఇబ్బందిగా మారుతుంది. అదే ‘హీట్‌ ఇండెక్స్‌’తో పరిస్థితి ఎలా ఉందన్నది తెలిస్తే.. ముందు జాగ్రత్త పడొచ్చు. ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు కూడా ఆయా ప్రాంతాల్లో తగిన ఏర్పాట్లు చేసేందుకు వీలుంటుంది.

ఉదాహరణకు ఢిల్లీ, విశాఖపట్నం రెండు చోట్లా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై.. ఢిల్లీలో 40%, విశాఖలో 50% హ్యూమిడిటీ ఉంటే.. ఢిల్లీలో పరిస్థితి బాగానే ఉంటుంది. కానీ విశా­ఖలో మాత్రం ఉక్కపోత, వేడి తీవ్రత ఎక్కువ.  

ఇప్పటికే ‘ఫీల్స్‌ లైక్‌’పేరిట.. 
ఉష్ణోగ్రత, ఇతర అంశాలను కలిపాక.. వాతావరణం ఎంత వేడిగా ఉన్నట్టు అనుభూతి కలుగుతుందనే దాన్ని ‘ఫీల్స్‌ లైక్‌’, ‘రియల్‌ ఫీల్‌’వంటి పేర్లతో సూచిస్తుంటారు. ఇప్పటికే పలు ప్రైవేటు వాతావరణ సంస్థలు దీనిని అమలు చేస్తున్నాయి. స్మార్ట్‌ ఫోన్లలోని వెదర్‌ యాప్స్‌లో కూడా ఈ హీట్‌ ఇండెక్స్‌ అంచనాలను చూడవచ్చు.  

- ఉష్ణోగ్రత, హ్యూమిడిటీతోపాటు మేఘాలు ఆవరించి ఉండటం, గాలి వీచే వేగం, సదరు ప్రాంతం ఎత్తు, సమీపంలో భారీ జ­ల వనరులు ఉండటం, తీర ప్రాంతాలు కావడం, వర్షాలు కురవడం వంటివాటిని బట్టి హీట్‌ ఇండెక్స్‌ మారే అవకాశం ఉంటుంది. ఆయా పరిస్థితులకు అనుగుణంగా ‘హీట్‌ ఇండెక్స్‌’ను నిర్ధారించాల్సి ఉంటుంది.  ‘హీట్‌ ఇండెక్స్‌’ఏ రోజుకారోజు, ఉదయం నుంచి రాత్రి వరకు సమయాన్ని బట్టి మారుతుంది. 
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌.
ఇది కూడా చదవండి: అవసరం అయితేనే బయటకు రండి.. రాత్రిపూట కూడా పెరగనున్న ఉష్ణోగ్రతలు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top