
ఏటా 9 రోజులు వాతావరణ పరిస్థితుల్లో మార్పులు
42 సంవత్సరాల్లో పరిస్థితులపై అధ్యయనం
1979–2022 మధ్య రెండుసార్లు ఇంధన కరువు
భవిష్యత్‌లో తరచూ వచ్చే అవకాశం
సాక్షి, అమరావతి: ‘పునరుత్పాదక ఇంధన కరువు’ వినడానికి కొత్తగా ఉన్న ఈ పదం ఇప్పుడు వాతావరణ, ఇంధన రంగ నిపుణులను కలవరపరుస్తోంది. నీటి కరువు, ఆహారం కరువు, ఎరువుల కరువు.. అంటూ అనేక కరువుల గురించి వింటుంటాంగానీ.. ఈ ఇంధన కరువు ఏమిటనే సందేహం సహజంగానే కలుగుతుంది. ఇంధన కరువు కూడా వస్తుంది. ఇది వస్తే విద్యుత్ కొరత ఏర్పడుతుంది.
బహిరంగ మార్కెట్‌లో అధిక ధరలకు విద్యుత్‌ను కొనాల్సి వస్తుంది. వేగంగా జరుగుతున్న వాతావరణ మార్పులే ఇంధన కరువుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. పైగా పునరుత్పాదక ఇంధన పెట్టుబడులను వాతావరణ మార్పు ఫలితాలు భవిష్యత్తులో ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు, ఇంధన, పర్యావరణరంగ నిపుణుల సలహాలు, సూచనల మేరకు గతంలో చోటుచేసుకున్న వాతావరణ మార్పులు, చరిత్రలో ఎదురైన ఇంధన కరువు వంటి సంఘటనలపై పరిశోధకులు ఒక అధ్యయనం చేశారు.
సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది
పునరుత్పాదక ఇంధన కరువు వంటి ఘటనలను అంచనా వేయడానికి పరిశోధకులు మన దేశ చారిత్రక వాతావరణ నమూనాలను విశ్లేషించారు. 1979 నుంచి 2022 వరకు 42 సంవత్సరాలను అధ్యయనం చేశారు. సౌర, పవన విద్యుత్ ఏ సమయంలో తక్కువగా ఉందనే సమాచారాన్ని సేకరించారు. ఇంగ్లండ్‌కు చెందిన కొందరు పరిశోధకులు జరిపిన అధ్యయనం మన దేశంలో 30 వేర్వేరు వాతావరణ నమూనాలను విశ్లేషించింది. పునరుత్పాదక ఇంధన కరువు సంభవించిన రోజుల్లో, వాటికి సంబంధించిన మూడు విభిన్నమైన అసాధారణ వాతావరణ పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది.
ఈ వాతావరణ పరిస్థితులు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని వివిధ మార్గాల్లో ప్రభావితం చేశాయి. ఈశాన్య రుతుపవనాలు పవన శక్తి ఉత్పత్తిని ప్రభావితం చేశాయి. శీతాకాలంలో సౌర ఉత్పత్తిని మరింత దిగజార్చాయి. నైరుతి రుతుపవనాల ఉపసంహరణ వాయవ్య భారతదేశంలో తక్కువ గాలి ఉత్పత్తికి దారితీసింది. పశి్చమ భారతదేశంలో మేఘాలు సౌర విద్యుత్ ఉత్పత్తిని తగ్గిస్తున్నాయని అధ్యయనంలో తేలింది. ఇలా కొన్ని వాతావరణ పరిస్థితుల్లో సౌర, పవన శక్తి లభ్యత క్షీణిస్తుంది. సహజంగా శీతాకాలంలో తొమ్మిది రోజులు సౌర, పవన శక్తి లభ్యత తగ్గుతుంది. దీన్నే పునరుత్పాదక ఇంధన కరువు అంటారు.
విద్యుత్ ప్లాంట్లలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలు
చారిత్రక వాతావరణ డేటాను ఉపయోగించి తక్కువ సౌర, పవన శక్తి ఉత్పత్తికి కారణమయ్యే వాతావరణ పరిస్థితులను పరిశోధకులు అంచనా వేశారు. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పునరుత్పాదక ఇంధన కరువులు ఎక్కువగా సంభవిస్తాయని తేల్చారు. 1979–2022 మధ్య రెండుసార్లు ఇంధన కరువు ఏర్పడింది. కానీ భవిష్యత్తులో తరచు ఇంధన కరువు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. దీనిని అడ్డుకోవడానికి, ముందుగానే ఇంధన కరువును అంచనా వేయడానికి చారిత్రక వాతావరణ డేటా ఉపయోగపడనుంది.
మన దేశంలో ప్రస్తుతం ఉన్న 220 గిగావాట్ల పునరుత్పాదక శక్తిలో మొత్తం 106 గిగావాట్ల సౌరశక్తి, 50 గిగావాట్ల పవనశక్తి ఉత్పత్తి సామర్థ్యం ఉంది. 2030 నాటికి 500 గిగావాట్ల వ్యవస్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనేది మన దేశం లక్ష్యం. ఈ క్రమంలోనే పునరుత్పాదక ఇంధన గ్రిడ్‌ల కోసం వాతావరణ అంచనాను మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా దేశవ్యాప్తంగా పవన, సౌర విద్యుత్ ప్లాంట్లలో ఆటోమేటిక్ వాతావరణ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కేంద్ర విద్యుత్ అథారిటీ మార్గదర్శకాలను జారీచేసింది.