సీసీఐ కేంద్రాల్లో పత్తి విక్రయానికి రైతుల అవస్థలు
తేమ 12% లోపు ఉంటేనే కొనుగోళ్లకు గ్రీన్‌సిగ్నల్
అధిక వర్షాలతో పత్తిలో పెరుగుతున్న తేమశాతం
20% తేమ ఉన్నా కొనుగోలు చేయాలని రైతుల డిమాండ్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరుచుకున్నా...పత్తి రైతులకు తేమ కష్టాలు తప్పడం లేదు. తేమ శాతం పేరుతో కొర్రీలు ఎదురవుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ప్రస్తుత తుపాను ప్రభావంతో తేమ తగ్గే పరిస్థితులు లేకపోగా.. 12 శాతం లోపు తేమ నిబంధనను మార్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నిండా ముంచిన వరుణుడు
ఈ ఏడాది వానాకాలంలో అధిక వర్షాలు పత్తి రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. రాష్ట్రంలో సుమారు 43.29 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా, ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోనూ పత్తి గణనీయంగా సాగైంది. అయితే జూలై, ఆగస్టు, సెపె్టంబర్‌లో సాధారణానికి మించి వర్షాలు కురవడంతో చేలల్లో నీరు నిలిచి పత్తి మొక్కలు ఎదగలేదు. ఫలితంగా దిగుబడి ఎకరాకు 4–6 క్వింటాళ్లే వస్తోంది. ఇప్పుడు మోంథా తుపాను కారణంగా పత్తి దెబ్బతింటుండగా.. రైతులు చేలలోనే ఉంచుతున్నారు.
సీసీఐ కేంద్రాలు తెరిచినా..
రాష్ట్రవ్యాప్తంగా తొలివిడత పత్తితీత చివరి దశకు చేరింది. సీసీఐ కేంద్రాల్లో 12శాతం లోపు తేమ ఉంటే క్వింటా పత్తికి రూ.8,110 మద్దతు ధర ప్రకటించారు. కేంద్రాలు ప్రారంభించకముందే వ్యాపారులు రూ.6,500 లోపే చెల్లించారు. ఈ నేపథ్యాన రాష్ట్రవ్యాప్తంగా 318 కొనుగోలు కేంద్రాలు తెరవాలని నిర్ణయించగా.. ఇప్పటి వరకు 72 కేంద్రాలే ప్రారంభమయ్యాయి.
ఈ కేంద్రాల్లో 1,700 టన్నుల వరకు విక్రయించారు. నల్లగొండ జిల్లాలో 23, సిద్దిపేటలో 10, ఖమ్మం జిల్లాలో 8, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నాలుగు కేంద్రాలు తెరిచారు. తేమ కారణంగా కొర్రీలతో కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఖమ్మం జిల్లాలో 128.01 టన్నుల పత్తి కొనుగోలు చేయగా, భద్రాద్రి జిల్లాలో కొనుగోళ్లు మొదలే కాలేదు.
12 శాతంలోపు తేమ ఉంటేనే..
సీసీఐ విధించిన తేమ శాతం నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది వరుసగా కురిసిన వర్షాలు, ప్రస్తుత మోంథా తుపానుతో తేమ తగ్గకపోగా, పత్తిని ఆరబెడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 8 నుంచి 12 శాతం లోపు తేమ ఉంటేనే కొనుగోలు చేస్తామని చెబుతూ సోమవారం వ్యాపారులు ముందుకు రాలేదు. దీంతో తక్కువ «ధరకే వేలం కొనసాగింది. ఇదే పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్నారు.
అయితే 20 శాతం వరకు తేమ ఉన్నా కొనుగోలు చేయాలని రైతుల నుంచి డిమాండ్ వస్తోంది. కాగా, సోమవారం రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులతో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడి సమస్యలను వివరించి నిబంధనలు సడలించాలని కోరారు.
పెట్టుబడులు కూడా రాలేదు
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం బిల్లుపాడుకు చెందిన హేమా అర్జున్‌రావుకు పదెకరాల్లో పత్తి సాగు చేశాడు. ఎకరాకు రూ.50 వేల పెట్టుబడి పెడితే వర్షాలతో పత్తి తడిసి రంగు మారింది. తల్లాడలోని సీసీఐ కేంద్రానికి తీసుకెళ్తే తిరస్కరించడంతో చేసేదేమీ లేక ప్రైవేట్ వ్యాపారులకు అమ్మాడు. ఫలితంగా పెట్టుబడి కూడా రాకపోగా.. చేనులో మిగిలిన పత్తి వర్షాలకు తడిసిపోయింది.
తేమశాతంతో మద్దతు ధర రాదని..
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఎదుళ్లచెరువుకు చెందిన శొంఠి వెంకటేశ్వర్లు తనకున్న ఆరెకరాల్లో పత్తి సాగు చేశాడు. కొద్ది రోజులుగా పత్తి తీస్తున్నా, వర్షాలతో తేమ ఎక్కువగా ఉండడంతో ఆరబెట్టాడు. ఇప్పుడు తుపాన్ ప్రభావంతో తేమ తగ్గే పరిస్థితి లేక.. మద్దతు ధర కష్టమేనని వాపోతున్నాడు.


