పార్టీ వ్యవహారాల్లో... నబీన్‌ నా బాస్‌ | Nitin Nabin takes charge as BJP president | Sakshi
Sakshi News home page

పార్టీ వ్యవహారాల్లో... నబీన్‌ నా బాస్‌

Jan 21 2026 2:32 AM | Updated on Jan 21 2026 2:32 AM

Nitin Nabin takes charge as BJP president

నబీన్‌ను ఆశీర్వదిస్తున్న మోదీ. చిరునవ్వులు చిందిస్తున్న అమిత్‌ షా, రాజ్‌నాథ్, నడ్డా, బి.ఎల్‌.సంతోష్‌

నా పనితీరుపై నిర్ణేత: మోదీ

బీజేపీ పగ్గాలు చేపట్టిన నబీన్‌

వేడుకగా జరిగిన కార్యక్రమం

హాజరైన బీజేపీ ముఖ్య నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ ప్రస్థానంలో నూతన శకానికి తెర లేచింది. బిహార్‌కు చెందిన యువ నాయకుడు నితిన్‌ నబీన్‌ సిన్హా పార్టీ జాతీయ అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. మంగళవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమం ఇందుకు వేదికైంది. బీజేపీ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో 45 ఏళ్ల నబీన్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించిన రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ ప్రకటించారు.

ఈ మేరకు సర్టిఫికెట్‌ను ఆయనకు అందజేశారు. అనంతరం పార్టీ కార్యాలయంలో ఐదో అంతస్తులోని చాంబర్‌లో ప్రస్తుత అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా నుంచి నబీన్‌ లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అతిరథ మహారథులంతా కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్, కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగి ఆదిత్యనాథ్, పుష్కర్‌ సింగ్‌ ధామి, నయాబ్‌ సింగ్‌ సైనీ, ప్రమోద్‌ సావంత్, ముఖ్యమంత్రి పేమా ఖండు తదితరులు వీరిలో ఉన్నారు. మోదీతో పాటు వారంతా నబీన్‌ను స్వయంగా అధ్యక్ష చాంబర్లోకి తోడ్కొని వెళ్లారు.

బీజేపీ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షునిగా, బిహార్‌ నుంచి వచ్చిన తొలి సారథిగా నబీన్‌ నిలిచారు. బీజేపీకి ఆయన 12వ అధ్యక్షుడు. నబీన్‌ ఎన్నికను చరిత్రాత్మక ఘట్టంగా నడ్డా అభివర్ణించారు. ఇంతకాలం తనకు అన్నివిధాలా సహకరించిన పార్టీ నేతలు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

నితిన్‌ వెన్నంటి సాగుతాం: మోదీ
బీజేపీ నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన నబీన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనను నవతరానికి ప్రతినిధి (మిలీనియల్‌)గా అభివర్ణించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ నేతగా, ప్రధానిగా ఎంత అనుభవమున్నా అన్నింటికంటే ముందు నేను బీజేపీ కార్యకర్తను. ఇకపై పార్టీపరమైన వ్యవహారాల్లో నితిన్‌ నాకు బాస్‌’’ అని చెప్పారు. ఆయన్ను పదేపదే ‘గౌరవనీ యులైన’ అంటూ సంబోధించారు.

‘‘యువకుడైన నబీన్‌ శక్తియుక్తులు, వ్యవస్థాగత వ్యవహారాల్లో ఆయనకున్న అపార అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇకపై ఆయన నోట వచ్చే ప్రతి మాటా మాకందరికీ నూతన దిశానిర్దేశం చేస్తుంది. పార్టీ భావి కార్యాచరణకు నబీన్‌ మార్గదర్శకత్వం వెలకట్టలేని ఆస్తి కానుంది’’ అన్నారు. ‘‘పార్టీ కార్యకర్తగా నేను కూడా నా పనితీరును ఎప్పటికప్పుడు నూతన అధ్యక్షునికే నివేదిస్తాను. నా పనితీరుకు సంబంధించిన రహస్య నివేదికను రాసేది ఆయనే. కనుక నబీన్‌ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నా’’ అని మోదీ చెప్పుకొచ్చారు. బీజేపీ వ్యవహారాలను చక్కబెట్టడంతో పాటు ఎన్డీఏ భాగస్వాముల నడుమ సమన్వయం సజావుగా కొనసాగేలా చూ డాల్సిన బాధ్యత కూడా నబీన్‌దేనని గుర్తు చేశారు.

కాంగ్రెస్‌ తప్పిదాలు మనం చేయొద్దు
కాంగ్రెస్‌ తప్పిదాల నుంచి నేర్చుకోవాలని బీజేపీ నేతలు, కార్యకర్తలకు మోదీ సూచించారు. ‘‘1984 లో 50 శాతం పై చిలుకు ఓట్లతో 400కు పైగా లోక్‌సభ స్థానాలు సాధించిన కాంగ్రెస్‌ నేడు 100 సీట్లు కూడా నెగ్గలేక ఆపసోపాలు పడుతోంది. కనుక ఆ పార్టీ దుర్లక్షణాలన్నింటినీ నిశితంగా గమనించి మనం వాటికి దూరంగా ఉందాం. అప్పుడిక మనల్ని ఎవరూ ఓడించలేరు’’ అన్నారు. నిష్పాక్షిక ఆత్మవిమర్శే బీజేపీ బలమని గుర్తు చేశారు.

‘‘బీజేపీ ఒక సంప్రదాయం. అది ఒక కుటుంబం. సభ్యత్వం కంటే సంబంధాలకు విలువనిచ్చే పార్టీ. పదవుల ద్వారా కాకుండా ప్రక్రియ ద్వారా పనిచేసే పార్టీ బీజేపీ. ఇక్కడ అధ్యక్షులు మారినా ఆదర్శాలు, దిశానిర్దేశాలు మారవు. వాజపేయీ, అడ్వానీ, మురళీ మనోహర్‌ జోషీ వంటి దిగ్గజాల సారథ్యంలో బీజేపీ సున్నా నుంచి శిఖరస్థాయికి ఎదిగింది. వెంకయ్య నాయుడు, నితిన్‌ గడ్కరీ, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్‌ షా, జేపీ నడ్డా సారథ్యంలో మరింత ఎదిగింది’’ అని గుర్తు చేసుకున్నారు.

చొరబాట్లు, అర్బన్‌ నక్సల్స్‌తో... దేశ భద్రతకే ప్రమాదం!
చొరబాటుదారులు, అర్బన్‌ నక్సల్స్‌ దేశ భద్రతకు పెను ప్రమాదంగా మారారని మోదీ ఆందోళన వెలిబుచ్చారు. చొరబాటుదారులను గుర్తించి తిప్పి పంపడం చాలా ముఖ్యమన్నారు. అక్రమ వలసలతో సంపన్న దేశాలు కూడా సతమతమవు తున్నాయి. వారిని వెళ్లగొడుతున్నాయి. వారు ప్రజలను కొల్లగొట్టడాన్ని భారత్‌ ఎప్పటికీ అనుమతించబోదు. కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం చొరబాటుదారులకు దన్నుగా నిలుస్తున్నాయి. వాటి ముసుగు తొలగించి ప్రజల ముందు నిలబెడదాం’’ అని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

‘‘దేశం ఎదుర్కొంటున్న మరో పెద్ద సమస్య అర్బన్‌ నక్సలిజం. ‘‘నా గురించి, ఎన్డీఏ ప్రభుత్వం గురించి సానుకూలంగా ఎవరు మాట్లాడినా లక్ష్యం చేసుకుని నోరు మూయించే కార్యక్రమం జరుగుతోంది. కొందరు జర్నలిస్టులు కూడా వారిని దారుణంగా హేళన చేసి అవమా నిస్తున్నారు. అంటరానివాళ్లుగా ముద్ర వేస్తున్నారు. ఇదంతా అర్బన్‌ నక్సల్స్‌ నూతన శైలి. వీరంతా కలిసి దేశానికి చేటు చేసేందుకు నిత్యం ప్రయత్ని స్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. వీరికి శాశ్వతంగా అడ్డుకట్ట వేయడం చాలా అవసరమన్నారు.

అట్టహాసంగా కార్యక్రమం
నబీన్‌ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆయనను మోదీ పూలమాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యాలయం కోలాహలంగా మారింది. జై శ్రీరాం, జై నితిన్‌ నబీన్‌ నినాదాలతో మార్మోగింది. ఆయన భార్య, పిల్లలు, కుటుంబీకులు, సన్నిహితులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలుగు నేతల సందడి
నబీన్‌ ప్రమాణస్వీకార కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు ఎన్‌.రాంచందర్‌రావు, పీవీఎన్‌ మాధవ్, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శ్రీనివాసవర్మ, ఏపీ మంత్రి సత్యకుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, అంజిరెడ్డి తదితరులు వీరిలో ఉన్నారు. వారంతా నబీన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

రాజకీయాల్లోకి యువత
బీజేపీ నూతన సారథి నబీన్‌ పిలుపు
న్యూఢిల్లీ: రాజకీయాల్లోకి ప్రజలు మరింత చురుగ్గా రావాల్సిన అవస రముందని బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ సిన్హా అభిప్రా యపడ్డారు. ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. తద్వారా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పాన్ని కలసికట్టుగా సాకారం చేసుకుందామని పేర్కొ న్నారు. ‘‘అయితే రాజకీయాలు 100 మీటర్ల రేసు కాదు. సుదీర్ఘంగా సాగే మారథాన్‌. అక్కడ పరీక్ష వేగానికి కాదని, శారీరక సామర్థ్యానికి. యువత దీన్ని గుర్తించాల్సిన అవసరముంది’’ అన్నారు.

బీజేపీ సారథిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంగళవారం పార్టీ ప్రధాన కార్యాల యంలో ఆయన నేతలు, కార్యక ర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. బీజేపీలో ప్రతి కార్యకర్తకూ పనికి తగిన గుర్తింపు ఎప్పుడూ లభిస్తుందని భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరి కృషినీ గుర్తించేంత శక్తియుక్తులు బీజేపీ ‘వాచ్‌టవర్‌’కు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. కీలకమైన పశ్చిమ బెంగాల్‌తో పాటు రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేలా కృషి చేయాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

బూత్‌ నుంచి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి దాకా పూర్తి చిత్తశుద్ధి, అంకితభావంతో పని చేయాలని సూచించారు. విపక్ష ఇండియా కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, డీఎంకేలపై నబీన్‌ ఈ సందర్భంగా ఘాటు విమర్శలు చేశారు. కార్తీక దీప సంప్రదాయాన్ని కూడా అడ్డుకునే కుయుక్తులకు డీఎంకే సర్కారు దిగిందన్నారు. ఇలాంటి శక్తులను ఓడించి సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరముందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement