ఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్.. జెపీ నడ్డా నుంచి బాధ్యతలు స్పీకరించారు. ఇవాళ(జనవరి 20, మంగళవారం) ఆయన ప్రమాణస్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజానాథ్ సింగ్, పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలడని.. ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయన్నారు. ‘‘నేను బీజేపీ కార్యకర్త.. నితిన్ నాకు బాస్. బీజేపీలో నిర్ణయాలు, ఎంపికలు అన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటాయి. దేశసేవ, ప్రజాసేవే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోంది’’ అని మోదీ పేర్కొన్నారు.
‘‘ప్రభుత్వానికి అధిపతి అయినా... బీజేపీ కార్యకర్త కావడమే నాకు గర్వ కారణం. పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను నితిన్ నబీన్ విజయవంతంగా నిర్వహించారు. తనను తాను రుజువు చేసుకున్నారు. పార్టీ కంటే, దేశం ముఖ్యమనే నినాదంతో పనిచేస్తున్నాం. కుటుంబ రాజకీయ పార్టీలు యువకులకు తలుపులు మూసేస్తున్నాయి. ఇలాంటి రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువకులను రాజకీయ నాయకులను తయారు చేయాలనుకుంటున్నాను
..బీజేపీ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం పనిచేస్తుంది. మోదీకి అనుకూలంగా వార్తలు రాసినా, చెప్పినా వారిని అర్బన్ నక్సల్స్ టార్గెట్ చేస్తున్నారు. అర్బన్ నక్సలైట్ల ఆగడాలను అరికట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధోగతికి ఆ పార్టీ విధానాలు కారణం. కుటుంబ రాజకీయాలే కాంగ్రెస్ పార్టీ కొంప ముంచాయి. కాంగ్రెస్ లక్షణాలు మన పార్టీకి అంటకుండా జాగ్రత్తపడాలి’’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు.
కాగా, 26 ఏళ్లకే ఎమ్మెల్యే. 45వ ఏటే బీజేపీ వంటి అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కునిగా రికార్డు. నితిన్ నబీన్ రాజకీయ ప్రస్థానం తొలినుంచీ ఆసక్తికరమే. ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది.నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. అలాంటి నేతలకు ఏకంగా అధ్యక్ష పగ్గాలు అందడం అనూహ్యమనే చెప్పాలి. నబీన్ జన్మించింది బీజేపీ పురుడు పోసుకున్న 1980లోనే కావడం విశేషం. ఆయన జార్ఖండ్‌లోని రాంచీలో జన్మించారు. ఆయన కాయస్థ కులస్తుడు.
యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు తదితరాల్లో అపార అనుభవం ఆయన సొంతం. నబీన్ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాతో మొదలైంది. నబీన్ కుటుంబానికి ఆరెస్సెస్‌తో సన్నిహిత బంధముంది. ఆయన తండ్రి నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా కూడా బీజేపీ నాయకుడే. పట్నా వెస్ట్ ఎమ్మెల్యేగా ఉంటూ 2006లో మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో నబీన్ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు! 2023లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ ఇన్‌చార్జిగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపి జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు.
తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఛత్తీస్‌గఢ్‌లో 11 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లు నెగ్గేలా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవికి నడ్డా వారసునిగా పలువురు ప్రముఖుల పేర్లు విన్పించినా, పార్టీ నాయకత్వం మాత్రం అనూహ్యంగా నబీన్ వైపు మొగ్గింది. గత డిసెంబర్ 16న ఆయనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించింది. మంగళవారం ఆయన నుంచి నబీన్ లాంఛనంగా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నారు. ఆయనకు భార్య దీప్‌మాలా శ్రీవాత్సవ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కీలకమైన పశ్చిమబెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపాల్సిన గురుతర బాధ్యత నబీన్ భుజస్కంధాలపై ఉంది.


