కమల దళపతి నితిన్‌ నబీన్‌  | Nitin Nabin unanimously elected as the BJP National President | Sakshi
Sakshi News home page

కమల దళపతి నితిన్‌ నబీన్‌ 

Jan 19 2026 4:38 PM | Updated on Jan 20 2026 6:12 AM

Nitin Nabin unanimously elected as the BJP National President

ఏకగ్రీవంగా ఎన్నిక 

నేడు ప్రమాణస్వీకారం 

అతి పిన్న వయసు్కనిగా రికార్డు 

తొలి బిహారీ సారథి కూడా ఆయనే 

అగ్నిపరీక్షగా బెంగాల్‌ ఎన్నికలు

సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నూతన అధ్యక్షునిగా బిహార్‌కు చెందిన పార్టీ యువ నేత నితిన్‌ నబీన్‌ సిన్హా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పదవి చేపట్టిన వారిలో అతి పిన్న వయస్కునిగా 45 ఏళ్ల నబీన్‌ రికార్డు సృష్టించారు. అంతేగాక బిహార్‌ నుంచి వచి్చన తొలి బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయనే కావడం విశేషం! మంగళవారం ఉదయం 11 గంటలకు బీజేపీ 12వ అధ్యక్షునిగా నబీన్‌ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

ప్రస్తుత అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్‌ నడ్డా పదవీకాలం ముగియడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన అధ్యక్షుని ఎన్నిక ప్రక్రియలో భాగంగా కీలకమైన నామినేషన్ల ప్రక్రియ ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ముగిసింది. నబీన్‌ ఒక్కరి తరఫునే నామినేషన్లు దాఖలవడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. మంగళవారం ఈ మేరకు లాంఛనంగా ప్రకటన వెలువడనుంది. నబీన్‌ ప్రస్తుతం బీజేపీ తాత్కాలిక అధ్యక్షునిగా ఉండటం తెలిసిందే. 

ప్రధాని నరేంద్ర మోదీ సంతకంతో కూడిన నబీన్‌ నామినేషన్‌ సెట్టును నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌ తదితరులు రిటరి్నంగ్‌ అధికారి కె.లక్ష్మణ్‌కు సమర్పించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నయాబ్‌సింగ్‌ సైనీ, ప్రమోద్‌ సావంత్, పెమా ఖండు, పుష్కర్‌సింగ్‌ ధామి, బీజేపీ అగ్ర నేతలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

నబీన్‌ తరఫున బీజేపీ రాష్ట్ర శాఖలు కూడా ఒక్కో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశాయి. అలా మొత్తం 37 సెట్ల నామినేషన్లు దాఖలైనట్టు లక్ష్మణ్‌ వివరించారు. నబీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బిహార్‌ నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నబీన్‌కు రానున్న పశి్చమబెంగాల్‌ సహా పలు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపడం అగి్నపరీక్షగా నిలవనుంది. 
 
తొలిసారి అడ్వాణీ, జోషీ లేకుండా! 
బీజేపీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియకు పార్టీ కురువృద్ధులు లాల్‌కృష్ణ అడ్వాణీ, మురళీ మనోహర్‌ జోషీ గైర్హాజరయ్యారు. అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబతాలో కూడా వారి పేర్లు లేవు. ఇలా జరగడం బీజేపీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 1980 నుంచీ ఇప్పటిదాకా జరిగిన 11 మంది అధ్యక్షుల ఎన్నికల్లో వారు భాగస్వాములుగా ఉంటూ వచ్చారు. అయితే అడ్వాణీ, జోషీ ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ శాఖ నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ శాఖకు సంస్థాగత ఎన్నికలు జరగాల్సి ఉంది. దాంతో అధ్యక్ష ఎన్నికల ఓటర్ల జాబితాలో వారి పేర్లు చేర్చేందుకు వీల్లేకుండా పోయిందని బీజేపీ వర్గాలు తెలిపాయి.  

యంగెస్ట్‌ ప్రెసిడెంట్‌గా!
న్యూఢిల్లీ: 26 ఏళ్లకే ఎమ్మెల్యే. 45వ ఏటే బీజేపీ వంటి అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడు. ఆ ఘనత సాధించిన అతి పిన్న వయస్కునిగా రికార్డు. నితిన్‌ నబీన్‌ రాజకీయ ప్రస్థానం తొలినుంచీ ఆసక్తికరమే. ఆయన ఎన్నికతో బీజేపీ పగ్గాలు రెండో తరం చేతికి అందినట్టయింది.నిజానికి బీజేపీలో జాతీయ స్థాయి ప్రముఖ నేతల జాబితాలో నబీన్‌ పేరు ఎప్పుడూ పెద్దగా లేదు. 

అలాంటి నేతలకు ఏకంగా అధ్యక్ష పగ్గాలు అందడం అనూహ్యమనే చెప్పాలి. నబీన్‌ జన్మించింది బీజేపీ పురుడు పోసుకున్న 1980లోనే కావడం విశేషం. ఆయన జార్ఖండ్‌లోని రాంచీలో జన్మించారు. ఆయన కాయస్థ కులస్తుడు. యువకుడే అయినా పాలన, పార్టీ సంస్థాగత నిర్మాణ వ్యవహారాలు తదితరాల్లో అపార అనుభవం ఆయన సొంతం. నబీన్‌ రాజకీయ ప్రస్థానం బీజేపీ యువజన విభాగమైన యువమోర్చాతో మొదలైంది. 

నబీన్‌ కుటుంబానికి ఆరెస్సెస్‌తో సన్నిహిత బంధముంది. ఆయన తండ్రి నబీన్‌ కిశోర్‌ ప్రసాద్‌ సిన్హా కూడా బీజేపీ నాయకుడే. పట్నా వెస్ట్‌ ఎమ్మెల్యేగా ఉంటూ 2006లో మరణించారు. దాంతో జరిగిన ఉప ఎన్నికలో నబీన్‌ ఏకంగా 60 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అప్పటినుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు! 2023లో ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సహ ఇన్‌చార్జిగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ పార్టీని విజయపథంలో నడిపి జాతీయ నాయకత్వాన్ని మెప్పించారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఛత్తీస్‌గఢ్‌లో 11 స్థానాలకు గాను బీజేపీ ఏకంగా 10 సీట్లు నెగ్గేలా చేశారు. 

బీజేపీ అధ్యక్ష పదవికి నడ్డా వారసునిగా పలువురు ప్రముఖుల పేర్లు విన్పించినా, పార్టీ నాయకత్వం మాత్రం అనూహ్యంగా నబీన్‌ వైపు మొగ్గింది. గత డిసెంబర్‌ 16న ఆయనను తాత్కాలిక అధ్యక్షునిగా ప్రకటించింది. మంగళవారం ఆయన నుంచి నబీన్‌ లాంఛనంగా బీజేపీ అధ్యక్ష పగ్గాలు అందుకోనున్నారు. ఆయనకు భార్య దీప్‌మాలా శ్రీవాత్సవ, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కీలకమైన పశ్చిమబెంగాల్‌తో పాటు తమిళనాడు, కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని విజయపథంలో నడపాల్సిన గురుతర బాధ్యత నబీన్‌ భుజస్కంధాలపై ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement