ఆధునిక జీవనశైలి, విపరీతమైన పని ఒత్తిడి కారణంగా పలువురిని చిన్న వయసులోనే ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులు చుట్టుముడుతున్నాయి. అయితే, వీటన్నింటికీ ప్రతిరోజూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ, గుప్పెళ్ల కొద్దీ మందులు వాడాల్సిన అవసరం లేదంటున్నారు ప్రముఖ వైద్యు నిపుణులు. నిరంతరం వేధించే ఆస్తమా, కీళ్లనొప్పులు, తీవ్రమైన వెన్నునొప్పి నుంచి నేటి యువతను వేధిస్తున్న పీసీఓఎస్ వరకు ఎన్నో సమస్యలను కేవలం క్రమం తప్పకుండా యోగా సాధన చేయడం ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయని చెబుతున్నారు.
శ్వాసకోశ, గుండె జబ్బులకు యోగా సంజీవని
ఆస్తమా బారిన పడిన వారికి అత్యవసర సమయాల్లో ఇన్హేలర్లు ప్రాణదాతగా నిలిచినప్పటికీ, ఈ సమస్యను శాశ్వతంగా దూరం చేసుకోవడానికి ప్రాణాయామం, అనులోమ-విలోమ ప్రక్రియలు అద్భుతంగా పనిచేస్తాయని యోగా నిపుణులు చెబుతున్నారు. అలాగే, నేటి కాలంలో గుండె జబ్బుల ముప్పు విపరీతంగా పెరుగుతోంది. భుజంగాసనం (కోబ్రా పోజ్) వేయడం ద్వారా ఛాతీ భాగం సాగి, గుండెతో పాటు లోపలి అవయవాలకు రక్తప్రసరణ మెరుగవుతుంది. దీనివల్ల గుండె కండరాలు బలోపేతం అవుతాయి. కపాలభాతి ప్రాణాయామం ద్వారా రక్తంలో ఆక్సిజన్ శోషణ శాతం పెరిగి, గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని పలు పరిశోధనలు సైతం నిరూపించాయి.
హార్మోన్ల సమతుల్యత.. వెన్నునొప్పులకు చెక్
థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయడానికి సర్వాంగాసనం, హలాసనం, మత్స్యాసనం వంటివి ఎంతగానో తోడ్పడతాయి. భుజంగాసనం, ఉజ్జాయి ప్రాణాయామం ద్వారా జీవక్రియలు సమతుల్యమై, గొంతు భాగంలోని నాడులు ఉత్తేజితమవుతాయి. అలాగే, డయాబెటిస్ లేదా ఇన్సులిన్ నిరోధకతను పూర్తిగా నయం చేయడం సాధ్యం కాకపోయినా, త్రికోణాసనం వంటి ఆసనాలతో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అద్భుతంగా నియంత్రించవచ్చు. ఐటీ ఉద్యోగులను వేధించే తీవ్రమైన నడుము నొప్పికి ఎలాంటి సర్జరీలు లేకుండా కేవలం తాడాసనం (ట్రీ పోజ్) ద్వారా ఉపశమనం పొందవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు.
మానసిక ఒత్తిడి, కీళ్లనొప్పుల నుంచి విముక్తి
కీళ్లనొప్పులు (ఆర్థరైటిస్) కలిగించే తీవ్రమైన బాధను సూర్యనమస్కారాల ద్వారా సులభంగా అదుపు చేయవచ్చు. కాలేయ సంబంధిత సమస్యలు, ఫ్యాటీ లివర్ బారిన పడకుండా ఉండటానికి పొత్తికడుపులో రక్తప్రసరణను పెంచే స్ట్రెచింగ్ ఆసనాలు ఎంతో మేలు చేస్తాయి. మెదడుకు రక్తప్రసరణ తగ్గడం వల్లే మైగ్రేన్, తీవ్రమైన తలనొప్పి వస్తుంటాయి. వీటికి టాబ్లెట్లు వాడే బదులు శీర్షాసనం వేయడం ఉత్తమం. ఇక డిప్రెషన్, మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఉత్తానాసనం రామబాణంలా పనిచేస్తుంది. అంతేకాక, నేటి యువతుల్లో వంధ్యత్వానికి దారితీసే పీసీఓఎస్ సమస్యను కూడా నిర్దేశిత యోగాసనాల ద్వారా మందులు, ఆపరేషన్లు లేకుండా నయం చేసుకోవచ్చని యోగా నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: భూకంపాలకే సవాల్.. 4500 ఏళ్ల గీజా పిరమిడ్ల రహస్యం ఇదే!


