గృహమస్తు | Gearing up for the construction of one lakh houses under the Cure initiative | Sakshi
Sakshi News home page

గృహమస్తు

Jun 19 2026 3:37 AM | Updated on Jun 19 2026 3:37 AM

Gearing up for the construction of one lakh houses under the Cure initiative

క్యూర్‌ పరిధిలో లక్ష  ఇళ్ల నిర్మాణానికి సన్నద్ధం

సాకారం కానున్న పేదల సొంతింటి కల  

70 వేల ఎల్‌ఐజీ, 30 వేల ఎంఐజీ ఫ్లాట్ల వర్గీకరణ 

ఇప్పటికే ఖాళీ స్థలాల గుర్తింపు ప్రారంభం 

సాక్షి, హైదరాబాద్‌: కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) పరిధిలోని అల్పాదాయ, మధ్య తరగతి వర్గాల సొంతింటి కలను సాకారం చేసేందుకు గృహ నిర్మాణ శాఖ అడుగులు వేస్తోంది. ఇప్పటికే అఫర్డబుల్‌ అర్బన్‌ హౌసింగ్‌ ప్రోగ్రాం కింద లక్ష గృహాల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. జీహెచ్‌ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్‌గిరి మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధితో పాటు నగర ఆర్థిక ప్రాంతాన్ని (క్యూర్‌) యూనిట్‌గా తీసుకుని దిగువ ఆదాయ వర్గాలకు (ఎల్‌ఐజీ) 70 వేల ఫ్లాట్లు, మధ్య ఆదాయ వర్గాలకు (ఎంఐజీ) 30 వేల ఫ్లాట్లను నిర్మించనున్నారు. 

పైలట్‌ ప్రాజెక్టుగా 12 వేల ఇళ్లు: భారీ గృహ నిర్మాణ ప్రాజెక్టులో భాగంగా  మొదటి విడత కింద పైలట్‌ ప్రాజెక్టుగా సుమారు 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. హౌసింగ్‌ బోర్డు సొంత నిధులతో పాటు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన భాగస్వామ్యంతో కేపీహెచ్‌బీ, బాలానగర్, లింగంపల్లి వంటి ప్రధాన ప్రాంతాల్లో  ఎల్‌ఐజీ, ఎంఐజీ ఇళ్లను నిర్మించనున్నారు. జూన్‌ నెలాఖరు, లేదా జూలై మొదటి వారంలో డిమాండ్‌ సర్వే నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. 

15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 
క్యూర్‌ పరిధిలో ఇప్పటి వరకు నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, మహేశ్వరం, కుత్బుల్లాపూర్, పటాన్‌ చెరు, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, ఎల్‌బీనగర్, మలక్‌పేట, మల్కాజిగిరి, మేడ్చల్‌ తదితర 15 అసెంబ్లీ నియోజక వర్గాల్లోని కొన్ని ప్రాంతాల్లో గృహాల నిర్మాణాలకు  అనువైన భూములను గుర్తించారు. మరో తొమ్మిది నియోజకవర్గాల్లో స్థలాలను ఎంపిక చేయాల్సి ఉంది. ఇప్పటికే గృహ నిర్మాణ శాఖ మంత్రితో పాటు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు  పలు ప్రాంతాలను సందర్శించారు. గుర్తించిన భూముల్లో ఎక్కెడెక్కడ ఎన్ని టవర్లు, ఎన్ని ఫ్లాట్లు నిర్మించవచ్చన్న దానిపై ప్రణాళికలు రూపొందిస్తున్నారు..  

జీవనోపాధి ప్రాంతాలకు చేరువగా.. 
గత ప్రభుత్వాల హయాంలో నగరానికి 30 నుంచి 40 కి.మీ దూరంలో ఇళ్లు నిర్మించడంతో రవాణా, ఉపాధి, వైద్యం కరువై లబి్ధదారులు ఇబ్బంది పడ్డారు. ఈ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నగర నడిబొడ్డున, ఐటీ, పారిశ్రామిక కారిడార్లకు సమీపంలోనే ఈ ప్రాజెక్టును డిజైన్‌  చేస్తున్నారు. ప్రతి ఫ్లాట్‌ను కనీసం 400 చ.అడుగుల ప్లింత్‌ ఏరియాతో అన్ని ఆధునిక మౌలిక వసతులతో నిర్మించనున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement