పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన పట్టణాభివృద్ధే లక్ష్యం
ముసాయిదా చట్టంలో హరిత భవనాలకు ప్రాధాన్యం
గ్రీన్ చానల్‌తో వేగవంతంగా నిర్మాణ అనుమతులు
అదనపు అంతస్తుకు అనుమతి, ఆస్తి పన్నులో రాయితీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన పట్టణాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కోర్ అర్బర్ రీజియన్ (క్యూర్) ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్ బిల్–2026ను తీసుకురానుంది. ఈ నూతన ముసాయిదా చట్టంలో హరిత భవన నిర్మాణాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, గ్లోబల్ వార్మింగ్ సవాళ్లను తట్టుకునేలా నగరాలను తీర్చిదిద్దేందుకు ఈ బిల్లులో ప్రత్యేక నిబంధనలను పొందుపరిచారు.
ఈవీ చార్జింగ్ తప్పనిసరి..
హరిత ఇంధన వినియోగాన్ని పెంచడానికి, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో నిర్మించే భవనాలలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ పాయింట్ల ఏర్పాటును ఈ బిల్లు తప్పనిసరి చేయనుంది. నివాస, వాణిజ్య సముదాయాల నుంచి వచ్చే వినియోగ నీటిని (గ్రే వాటర్) శుద్ధి చేసి, తిరిగి మొక్కలకు లేదా ఇతర అవసరాలకు ఉపయోగించే ప్లాంట్లను ఏర్పాటు చేయడం తప్పనిసరి కానుంది.
క్యూఆర్ కోడ్ వాల్ట్..
భవన నిర్మాణ అనుమతులలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రతి ప్రాపర్టీకి ఒక విశిష్టమైన ‘క్యూఆర్’ కోడ్‌ను కేటాయించనుంది. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి పన్ను, నీటి కనెక్షన్ నంబరు, విద్యుత్ కనెక్షన్ వివరాలన్నీ ఒకేచోట డిజిటల్‌గా వీక్షించవచ్చు. ఇది భవన యజమానులకు బ్యాంక్ రుణాలు పొందడానికి సులభతరం చేయడంతో పాటు పన్ను చెల్లింపులను సులువవుతుంది.
ప్రోత్సాహకాలు.. రాయితీలు..
హరిత ప్రమాణాలకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టే నిర్మాణ సంస్థలు, యజమానులకు పన్ను ప్రోత్సాహకాలు, రాయితీలు అందించనున్నారు. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ), లీడర్‌షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్ (ఎల్‌ఈఈడీ) గోల్డ్ రేటింగ్ పొందిన భవనాలకు 5 శాతం, ప్లాటినం రేటింగ్ పొందిన భవనాలకు 10 శాతం అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ)ను బోనస్‌గా ఇవ్వనున్నారు.
– నెట్‌జీరో భవనాలకు తొలి ఐదేళ్ల పాటు 10–20 శాతం ఆస్తి పన్ను రిబేట్ కూడా ఉండనుంది. గ్రీన్ రేటింగ్ ఉన్న ప్రాజెక్టులకు తనిఖీల భారం తగ్గించి గ్రీన్ ట్రాక్ ద్వారా వేగంగా అనుమతులు మంజూరు చేస్తారు. రీసైకిల్ చేసిన నిర్మాణ వ్యర్థాల వాడకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం సబ్సిడీలు లేదా గరిష్ట ధర పరిమితిని విధించనుంది. రీసైకిల్ చేసిన మెటీరియల్ నాణ్యతపై నిర్మాణదారుల్లో నమ్మకం పెంచేందుకు ప్రభుత్వం అధికారికంగా క్వాలిటీ సరి్టఫికేషన్‌ను కూడా ఇవ్వనుంది.
నిర్మాణ రంగంలో పారదర్శకత
క్యూర్ ముసాయిదా చట్టంతో రాష్ట్రంలో పట్టణాభివృద్ధిని మరింత సరళతరం అవుతుంది. నిర్మాణ రంగంలో పారదర్శకత, సులభతర వాణిజ్యం, పర్యావరణహిత విధానాలను పెంపొందించడమే లక్ష్యంగా కీలక ప్రతిపాదనలు చేశారు. – కె.శ్రీధర్ రెడ్డి, ప్రెసిడెంట్, నరెడ్కో తెలంగాణ


