సారీ చెప్పి.. 15 వేలు ఫోన్‌పే చేశాడు! | Mumbai CEO Auto Driver Digital Payment Viral Story | Sakshi
Sakshi News home page

సారీ చెప్పి.. 15 వేలు ఫోన్‌పే చేశాడు!

Jun 6 2026 8:52 AM | Updated on Jun 6 2026 9:00 AM

Mumbai CEO Auto Driver Digital Payment Viral Story

డిజిటల్‌ చెల్లింపుల యుగంలో పొరపాట్లు జరగడం సహజం. అలాంటి పొరపాటుతో చాలా మంది నష్టపోతున్నారు కూడా. తక్షణ స్పందన.. ఎవరిని సంప్రదించాలో తెలియని అయోమయంలో డబ్బులు వెనక్కి రాలేని పరిస్థితి. అలా ఓ కంపెనీ సీఈవో ఏమరపాటులో డబ్బు పంపిస్తే.. ఓ ఆటో డ్రైవర్‌ ఏం చేశాడో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు!. 

ముంబై మహానగరం. ఓ బిజీ సీఈవో(పేరు కావాలనే ప్రస్తావించలేదు) తన కారులో కాకుండా నిత్యం ఆటోలో ప్రయాణిస్తుంటాడు. అలా రైడ్‌ పూర్తయ్యాక డిజిటల్‌ పేమెంట్‌ ద్వారా ఛార్జీ చెల్లించే క్రమంలో పొరపాటు చేశాడు. ఆటో ఛార్జీకి బదులుగా ఏకంగా రూ.15,682 ఆటో డ్రైవర్‌ ఖాతాలోకి బదిలీ అయ్యాయి. ఆఫీస్‌లోకి వెళ్లాక చాలా సేపటికి ఆయన ఆ విషయం గుర్తించాడు. 

ఆటో డ్రైవర్‌ను సంప్రదించాలా? వద్దా? అని అనుకుంటూ ఉండిపోయాడాయన. ఈలోపు.. ఆయన ఊహించనిది జరిగింది. డబ్బు పొరపాటున జమైందని తెలుసుకున్న ఆటో డ్రైవర్‌ వెంటనే స్పందించి మొత్తం డబ్బును తిరిగి ఫోన్‌పే ద్వారా పంపించాడు. సారీ సర్‌.. అంటూ మెసేజ్‌ కూడా పంపాడు. ఈ ఘటనను ఆ సీఈవో తన LinkedIn ఖాతాలో పంచుకున్నాడు. ఆటో డ్రైవర్‌ నిజాయితీని కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపాడు. అతడి పోస్ట్‌ కొద్ది గంటల్లోనే వైరల్‌గా మారింది.

ఈ కథ సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. "ఇలాంటి సంఘటనలే మనుషులపై విశ్వాసాన్ని నిలబెడతాయి" అంటూ పలువురు నెటిజన్లు స్పందించారు. మరికొందరు డిజిటల్‌ చెల్లింపుల్లో పొరపాట్లు పెరుగుతున్నప్పటికీ, నిజాయితీ ఇంకా సమాజంలో బతికే ఉందని వ్యాఖ్యానించారు. వైరల్‌ అవుతున్న వార్తల్లో ఎక్కువగా వివాదాలు, ఘర్షణలు కనిపించే ఈ కాలంలో.. ఓ సాధారణ ఆటో డ్రైవర్‌ చేసిన నిజాయితీ పని మాత్రం వేలాది మందిని ఆకట్టుకుంది. రూ.15 వేల కంటే విలువైనది మనిషి నమ్మకం, నిజాయితీ అనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement