టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు | India Auto Sales Shift Into Top Gear Record Q1 Surge Across All Segments | Sakshi
Sakshi News home page

టాప్‌ గేర్‌లో వాహన విక్రయాలు

Jul 16 2026 8:28 AM | Updated on Jul 16 2026 8:28 AM

India Auto Sales Shift Into Top Gear Record Q1 Surge Across All Segments

అన్ని విభాగాల్లో చరిత్రలోనే రికార్డు స్థాయి విక్రయాలు  

జీఎస్‌టీ 2.0, సులభతర ఫైనాన్సింగ్‌తో పెరిగిన కొనుగోళ్లు  

పండుగ సీజన్‌కు ముందు ఇదే జోరు

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ, దేశీయంగా లభించిన బలమైన డిమాండ్‌తో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (క్యూ1) లో దేశీయ వాహన విక్రయాలు సరికొత్త రికార్డును సృష్టించాయి. ఏప్రిల్‌–జూన్‌ మధ్య కంపెనీల నుంచి డీలర్లకు 12,73,811 యూనిట్ల ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) పంపిణీ జరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో జరిగిన 10,11,884 యూనిట్ల పంపిణీతో పోలిస్తే ఇది 25.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. తద్వారా 2024–25 తొలి త్రైమాసికంలో నమోదైన 10.3 లక్షల యూనిట్ల గరిష్ట రికార్డును ఈ తొలి త్రైమాసిక విక్రయాలు అధిగమించాయి. దేశీయ వాహన తయారీదారుల సమాఖ్య ‘సియామ్‌’ బుధవారం ఈ వివరాలను వెల్లడించింది.  

అన్ని విభాగాల్లో ఆల్‌టైమ్‌ రికార్డులు

  • త్రిచక్ర వాహనాల విభాగం క్యూ1 కాలానికి చరిత్రలోనే అత్యధిక పంపిణీని నమోదు చేస్తూ సరికొత్త రికార్డు సృష్టించింది. గత ఏడాది ఇదే కాలంలోని 1,65,211 యూనిట్లతో పోలిస్తే ఇది ఏకంగా 29.7 శాతం వృద్ధితో 2,14,339 యూనిట్లకు చేరింది.

  • వాణిజ్య వాహనాల విభాగం కూడా తొలి త్రైమాసికంలో తన చరిత్రలోనే అత్యధిక విక్రయాలను సాధించింది. గత ఏడాది క్యూ1తో పోలిస్తే 18.3 శాతం వృద్ధిని కనబరుస్తూ రికార్డు స్థాయిలో 2.65 లక్షల యూనిట్ల విక్రయాలు జరిగాయి.

  • మరోవైపు ద్విచక్ర వాహనాల పంపిణీ కూడా క్యూ1లో 20.3 శాతం పెరిగి 56,28,675 యూనిట్లకు చేరింది. గత ఏడాది క్యూ1 కాలంలో ఈ విక్రయాలు 46,77,990 యూనిట్లుగా నమోదయ్యాయి.  

‘కేంద్రం జీఎస్‌టీ రేట్లను సవరించడం, సులభతర వాహన ఫైనాన్సింగ్‌ రుణాలు, గతేడాది నమోదైన స్వల్ప విక్రయాల ప్రభావం (లో బేస్‌ ఎఫెక్ట్‌) తో పాటు మార్కెట్లోకి కొత్త మోడళ్లు రావడం ఈ బలమైన వృద్ధికి ప్రధాన కారణాలు. ప్రస్తుతం వినియోగదారుల సెంటిమెంట్, డిమాండ్‌ స్థిరంగానే ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగం, గ్రామీణ డిమాండ్‌పై నేరుగా ప్రభావం చూపే రుతుపవనాల గమనాన్ని, అలాగే భౌగోళిక రాజకీయ పరిణామాలను ఆటో పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తోంది’ అని సియామ్‌ అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర తెలిపారు.

రెండో త్రైమాసికంపై సియామ్‌ అవుట్‌లుక్‌

పండుగల సీజన్‌ సమీపిస్తుండటంతో వాహనాలకు ఇదే విధమైన స్థిరమైన డిమాండ్‌ మున్ముందూ కొనసాగవచ్చని సియామ్‌ అంచనా వేసింది. జీఎస్‌టీ 2.0 తో పాటు తక్కువ రేట్లకే లభిస్తున్న ఫైనాన్సింగ్‌ సదుపాయం వాహన ధరలను అందుబాటులో ఉంచుతూ డిమాండ్‌ను నడిపిస్తున్నాయి. అయితే, కమోడిటీ (ముడి సరుకుల) ధరలు పెరగడం ఆటోమొబైల్‌ రంగానికి కొంత ఆందోళన కలిగిస్తోంది. పశ్చిమాసియాలో గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో గ్యాస్, ఇంధనం, ముడి సరుకుల సరఫరా మెరుగుపడినా.. ఇటీవలి కాలంలో అక్కడ చోటుచేసుకుంటున్న ఉద్రిక్త పరిణామాలు పరిశ్రమకు కీలకం కానున్నాయని సియామ్‌ అభిప్రాయపడింది.

ఇదీ చదవండి: IRCTC వెబ్‌సైట్‌ కొత్త అవతారం.. అదిరిపోయే ఫీచర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement