భారత్ పే ఫ్లెక్స్.. వడ్డీ లేని క్రెడిట్ లైన్ ఫీచర్! | BharatPe Flex Shop with UPI Pay After 45 Days Interest Free Credit Revolution | Sakshi
Sakshi News home page

భారత్ పే ఫ్లెక్స్.. వడ్డీ లేని క్రెడిట్ లైన్ ఫీచర్!

Jun 5 2026 8:38 AM | Updated on Jun 5 2026 11:10 AM

BharatPe Flex Shop with UPI Pay After 45 Days Interest Free Credit Revolution

దేశంలో డిజిటల్ చెల్లింపుల సరళిని మార్చేస్తూ ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం ‘భారత్ పే’ వినియోగదారుల కోసం ఒక సరికొత్త డిజిటల్ చెల్లింపుల సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. అదే ‘భారత్ పే ఫ్లెక్స్’. ‘పే వయా యూపీఐ, సెటిల్ లేటర్’ అనే విధానంతో డిజిటల్ క్రెడిట్ రంగంలోకి భారత్ పే ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన చోట యూపీఐ ద్వారా తక్షణమే పేమెంట్స్ చేసి, ఆ బిల్లును తర్వాత నిదానంగా చెల్లించవచ్చు. రోజువారీ ఖర్చుల నుంచి అత్యవసరాల వరకు నగదు కొరత లేకుండా చూసేందుకు ఈ సేవలు ఉపయోగపడుతాయని అధికారులు చెబుతున్నారు.

‘భారత్ పే ఫ్లెక్స్’ ఎలా పనిచేస్తుంది?

సాధారణంగా మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేసినప్పుడు ఆ మొత్తం నేరుగా మన బ్యాంక్ ఖాతా నుంచి కట్ అవుతుంది. కానీ భారత్ పే ఫ్లెక్స్‌తో ఆ అవసరం లేదు. వినియోగదారుడికి కేటాయించిన క్రెడిట్ లిమిట్ ఆధారంగా ఈ లావాదేవీలు జరుగుతాయి. అంటే, కస్టమర్ అకౌంట్ నుంచి కాకుండా భారత్ పే అందించే క్రెడిట్ లైన్ నుంచి మర్చంట్‌కు డబ్బు అందుతుంది.

45 రోజుల వడ్డీ లేని గడువు

ఈ ఫీచర్ ద్వారా ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి కస్టమర్లకు 45 రోజుల వరకు సమయం లభిస్తుంది. ఈ నిర్ణీత ఉచిత వ్యవధిలో బకాయిలను క్లియర్ చేస్తే ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. వినియోగదారులు తాము రోజువారీగా ఉపయోగించే యూపీఐ విధానాన్ని మార్చుకోవాల్సిన పని లేకుండా బ్యాకెండ్‌లో క్రెడిట్‌ అందించడమే దీని ప్రత్యేకత.

సాధారణ క్రెడిట్ కార్డులకు భిన్నం

సాంప్రదాయ క్రెడిట్ కార్డులు పొందేందుకు కఠినమైన నిబంధనలు, ఆమోద ప్రక్రియలు, డాక్యుమెంటేషన్ అవసరమవుతాయి. వీటికి భిన్నంగా భారత్ పే ఫ్లెక్స్ రోజువారీ వినియోగదారులు, మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకుని డిజైన్ చేశారు. నెల చివరిలో లేదా తాత్కాలికంగా నగదు కొరత ఎదుర్కొనే మధ్యతరగతికి, చిన్న వ్యాపారస్తులకు, రెస్టారెంట్లు, స్థానిక కిరాణా దుకాణాల్లో నిత్యం డిజిటల్ లావాదేవీలు జరిపే సామాన్యులకు ఇది ఎంతో ఉ‍పయోగపడుతుందని భారత్‌పే చెప్పింది.

భారతదేశ ఫిన్‌టెక్ మార్కెట్లో ప్రస్తుతం ‘బై నౌ, పే లేటర్‌’(ఇప్పుడు కొని తర్వాత చెల్లించండి) ఆప్షన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. నేటి తరం వినియోగదారులు తక్షణ డిస్కౌంట్ల కంటే కూడా తాము జరిపే చిన్న కొనుగోళ్లకు అనుకూలమైన రీపేమెంట్ ఆప్షన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈ సౌలభ్యంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా అవసరమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

నిపుణుల హెచ్చరిక

వడ్డీ లేని కాల పరిమితి వినియోగదారులకు ఎంతో ఉపయోగకరమైనప్పటికీ గడువు ముగిసేలోపు తిరిగి చెల్లించకపోతే అదనపు పెనాల్టీ ఛార్జీలు పడే అవకాశం ఉంది. ఇది వినియోగదారులను అప్పుల ఊబిలోకి నెట్టే ప్రమాదం ఉన్నందున క్రెడిట్ లైన్లను క్రమశిక్షణతో నిర్వహించుకోవాలి.

ఇదీ చదవండి: ‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement