‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’ | 40 Lakh Salary BMW Car Yet Feels Poor Viral Story Modern Poverty | Sakshi
Sakshi News home page

‘మనస్ఫూర్తిగా ఒక్కపనీ చేయలేదు’

Jun 4 2026 3:18 PM | Updated on Jun 4 2026 3:26 PM

40 Lakh Salary BMW Car Yet Feels Poor Viral Story Modern Poverty

డబ్బు గురించి ఆందోళన చెందకూడదంటే ఒక మనిషికి ఎంత సంపాదన కావాలి? ఏడు అంకెల జీతం, చేతిలో లగ్జరీ కారు, మెట్రో సిటీలో సొంత ఇల్లు ఉంటే ఆర్థిక భద్రత దొరికినట్లేనా? అసలు విజయానికి కొలమానం ఏమిటి?.. నేటి డిజిటల్ యుగంలో చాలా మంది ప్రొఫెషనల్స్‌ మదిలో మెదులుతున్న ప్రశ్నలివి. సోషల్ మీడియాలో నిరంతరం కనిపించే స్టార్టప్ విజయాలు, విలాసవంతమైన లైఫ్ స్టైల్స్ మధ్య.. సమాజం దృష్టిలో సక్సెస్ అయిన వారు సైతం లోలోపల ఒక రకమైన అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. లగ్జరీ లైఫ్ స్టైల్ వెనుక ఉన్న అసలు విషయాలు తెలుపుతూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

‘ఎవర్ హోప్ ఆంకాలజీ’ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సన్నీ గార్గ్ ఇటీవల పంచుకున్న ఒక పోస్ట్‌ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఆయనను కలిసిన 34 ఏళ్ల గుర్గావ్ యువకుడి కథ ఇది. పోస్ట్‌లోని వివరాల ప్రకారం.. ఆ యువకుడి వార్షిక ఆదాయం రూ.40 లక్షలు. బీఎండబ్ల్యూ కారు, గుర్గావ్‌లో సొంత 2 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ ఉంది. కానీ, ఆ యువకుడు పంచుకున్న కొన్ని విషయాలు షాక్‌కు గురిచేసేలా ఉన్నాయి. ‘డాక్టర్, నేను చాలా పేదవాడిని అనిపిస్తోంది. రాత్రిళ్లు అస్సలు నిద్రపట్టడం లేదు’ అన్నాడు.  

సదరు యువకుడు భారతదేశంలో అత్యధిక ఆదాయం పొందే మొదటి 1% జనాభాలో ఉన్నాడు. అయినా అతను ఎందుకు కుంగిపోతున్నాడనే దానికి డాక్టర్ గార్గ్ విశ్లేషణ నేటి సమాజానికి అద్దం పడుతోంది. ‘ఇది ఒక వ్యక్తి సమస్య కాదు, చాలా మంది కార్పొరేట్ ఉద్యోగుల పరిస్థితి ఇదే. ఆ యువకుడి రిఫరెన్స్ పాయింట్ మారింది. ఒకప్పుడు అతను తన గ్రామంలోని పొరుగువారితో పోల్చుకునేవాడు. కానీ ఇప్పుడు అతను తనను తాను లింక్డ్‌ఇన్‌లో రూ.80 కోట్లకు స్టార్టప్‌ను విక్రయించిన 28 ఏళ్ల కుర్రాడితో పోల్చుకుంటున్నాడు. ఆదాయం పెరిగింది, కానీ అంచనాలు పది రెట్లు పెరిగాయి. దీనిపేరే మాడ్రన్‌ పావర్టీ’ అన్నారు.

మూడు ప్రశ్నలు

ఆ యువకుడి మానసిక స్థితిని అర్థం చేసుకోవడానికి డాక్టర్ గార్గ్ అడిగిన మూడు ప్రశ్నలు, దానికి వచ్చిన సమాధానాలు అసలు సమస్యను వెల్లడించాయి.

1. గత ఏడాదిలో ఒక్కసారైనా ‘నాకు ఇది చాలు’ అని అనుకున్నావా?

సమాధానం: ఎప్పుడూ లేదు

2. ఎవరి కోసం ఇంత డబ్బు సంపాదిస్తున్నావు?

సమాధానం: నాకు తెలియదు. చుట్టూ ఉన్నవాళ్లు పరిగెడుతున్నారు, నేను పరిగెడుతున్నాను.

3. నీ జీవితంలో డబ్బు కోసం కాకుండా మనస్ఫూర్తిగా చేసిన పని ఏదైనా ఉందా? 

సమాధానం: కొద్దిసేపు ఆగి.. ‘ఏదీ లేదు’.

డబ్బు ప్రతి పనికి కొలమానంగా మారినప్పుడు మనిషి యంత్రంగా మారిపోతాడని డాక్టర్ గార్గ్ హెచ్చరించారు. రూ.40 లక్షలు సంపాదించినా, రూ.4 కోట్లు సంపాదించినా ప్రతి ఆరు నెలలకోసారి ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించడం సులభం. కానీ అంతర్గత గుర్తింపు సమస్యలను పరిష్కరించడం కష్టమని, 90% మంది ఈ రెండింటికీ తేడా తెలియక గందరగోళ పడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

విజయాన్ని ఎల్లప్పుడూ మనకంటే పైన ఉన్నవారితోనే కొలిస్తే.. ఆ విజయానికి ఎప్పటికీ ముగింపు రేఖ ఉండదు. రేసు గుర్రంలా పరిగెత్తడం ఆపి ఎక్కడ ఫుల్‌స్టాప్ పెట్టాలో తెలుసుకున్నప్పుడే నిజమైన ఆర్థిక స్వేచ్ఛ, ప్రశాంతత లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: గేదె హెయిర్‌ స్టైల్‌కు ఫుల్‌ క్రేజ్‌!

Advertisement
 
Advertisement
Advertisement