గేదె హెయిర్‌ స్టైల్‌కు ఫుల్‌ క్రేజ్‌! | Albino Cow With Donald Trump Hair Becomes Viral Sensation in Bangladesh Zoo | Sakshi
Sakshi News home page

గేదె హెయిర్‌ స్టైల్‌కు ఫుల్‌ క్రేజ్‌!

Jun 4 2026 8:32 AM | Updated on Jun 4 2026 8:59 AM

Albino Cow With Donald Trump Hair Becomes Viral Sensation in Bangladesh Zoo

బంగారు రంగు జుట్టు.. హుందాగా కనిపించే 700 కిలోల భారీ కాయం.. వీటన్నింటికీ మించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెయిర్‌స్టైల్‌ను పోలి ఉండే విలక్షణమైన రూపం! ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఈ వింత అల్బినో గేదె గురించే చర్చ నడుస్తోంది. వారం రోజులుగా ఢాకా శివార్లలోని జాతీయ జంతుప్రదర్శనశాలకు వచ్చిన ఈ గేదెను చూసేందుకు జనం తరలివస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ ‘ట్రంప్’ గేదె కథనం ఇప్పుడు అంతర్జాతీయంగానూ హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది.

మొదట ఈ అరుదైన అల్బినో గేదెను ముస్లింల పవిత్ర పండుగ ‘ఈద్-అల్-అధా’ (బక్రీద్) సందర్భంగా త్యాగం (బలి) చేయడం కోసం ఒక స్థానిక రైతు సిద్ధం చేశాడు. అయితే, ఈ గేదె లేత కొమ్ములు, దానికున్న వింతైన బంగారు రంగు జుట్టు సరిగ్గా డొనాల్డ్ ట్రంప్‌ను పోలి ఉన్నాయంటూ సదరు రైతు గమనించి సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. అంతే.. ఆ వీడియో కాస్తా క్షణాల్లో వైరల్‌గా మారింది. ‘ఫేస్‌బుక్‌లో ఈద్‌కు ముందే ‘ట్రంప్‌’ను బలి ఇవ్వబోతున్నారనే పోస్టులు చూశాను. కానీ చివరి నిమిషంలో దానిని బలి ఇవ్వకుండా జూకు తరలించారని తెలిసి స్వయంగా చూడటానికి వచ్చాను’ అని జాషోర్ నగరం నుంచి వచ్చిన ఓ పర్యాటకుడు తెలిపారు.

భద్రతా కారణాలు, ప్రజా విజ్ఞప్తుల దృష్ట్యా బంగ్లాదేశ్ హోం మంత్రి సలావుద్దీన్ అహ్మద్ స్వయంగా స్పందించి ఆ జంతువును రక్షించాలని పోలీసులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా ఈ గేదెను ఢాకాలోని జాతీయ జంతుప్రదర్శనశాలకు తరలించింది.

జూలో వీఐపీ ట్రీట్‌మెంట్!

ప్రస్తుతం జూలో ఈ వింత గేదెకు సెలబ్రిటీ హోదా దక్కింది. జూ సిబ్బంది దీనిని ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. విపరీతమైన ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగించడానికి సిబ్బంది నిరంతరం నీళ్లు చల్లుతున్నారు. ట్రంప్ మార్కు హెయిర్‌స్టైల్ చెడిపోకుండా జుట్టును ఒక వైపునకు దువ్వుతూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.

జూ క్యూరేటర్‌పై వేటు!

ఈ గేదెకు ‘డొనాల్డ్ ట్రంప్’ అని పేరు కూడా పెట్టారు. అయితే ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్‌లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ప్రదర్శనశాలలోని ఎన్‌క్లోజర్ వద్ద మొదట డొనాల్డ్ ట్రంప్ అనే బోర్డును ఉంచడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆ తర్వాత అధికారులు ఆ బోర్డును తొలగించారు. ఈ వివాదం నేపథ్యంలోనే జూ క్యూరేటర్‌ను పదవి నుంచి తొలగించడం గమనార్హం. అయితే దీనికి గల అధికారిక కారణాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

ఇదీ చదవండి: ఏఐ సామ్రాజ్యంపై భారత్‌కు హక్కు దక్కేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement