ప్రస్తుత కాలంలో ఉత్పాదకతను శాసించే అతిపెద్ద శక్తిగా కృత్రిమ మేధ, ముఖ్యంగా జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ అవతరించాయి. వేగవంతమైన కోడింగ్, ఆటోమేటెడ్ కస్టమర్ సర్వీస్, తగ్గుతున్న నిర్వహణ వ్యయాలు, చురుకైన నిర్ణయాధికారం.. ఇవన్నీ ఏఐ కల్పిస్తున్న వ్యాపార అవకాశాలు. భారతీయ పరిశ్రమల్లో ఉత్పాదకతను భారీగా పెంచేందుకు ఏఐ మెరుగ్గా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. అయితే, ఇక్కడ కీలకమైన ప్రశ్న ఏఐ విలువను సృష్టిస్తుందా లేదా అనేది కాదు.. దాని ద్వారా సృష్టించిన సంపద, నియంత్రణ అంతిమంగా ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? అనేది ఇప్పుడు ప్రశ్న.
తెర వెనుక అసలు కథ
చాట్‌బాట్‌లు, కో-పైలట్లు, ఎంటర్‌ప్రైజ్ ఏజెంట్లు, రిట్రీవల్-ఆగ్మెంటెడ్ సిస్టమ్స్ (ఆర్‌ఏసీ) వంటి మనం చూసే పైపై అప్లికేషన్ల వెనుక ఉన్న అసలు శక్తి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎం). ట్రాన్స్‌ఫార్మర్ ఆర్కిటెక్చర్‌ల ద్వారా భారీ డేటాను విశ్లేషించి తదుపరి స్థితిని అంచనా వేస్తూ ఇవి సమాధానాలను ఇస్తాయి. కానీ, ఈ మొత్తం వ్యవస్థకు పునాది అయిన ఫౌండేషన్ మోడల్స్ నేడు ప్రపంచ టెక్ దిగ్గజాలైన ఓపెన్ఏఐ, గూగుల్, ఆంత్రోపిక్, మెటా, కొన్ని చైనీస్ కంపెనీల గుత్తాధిపత్యంలో ఉన్నాయి. మరోవైపు, ఈ మోడల్స్ నిర్వహణకు కావాల్సిన కంప్యూట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, అధునాతన జీపీయూ మార్కెట్‌ను ఎన్విడియా శాసిస్తోంది. ఒకరకంగా ఫౌండేషన్ మోడల్స్ ఏఐకి మెదడు వంటివి అయితే, జీపీయూ దానికి ఇంధనం లాంటివి. ఈ రెండు కీలక రంగాలు విదేశీ శక్తుల చేతుల్లోనే ఉండటం భారత్‌కు పెద్ద సవాలుగా మారింది.
పొంచి ఉన్న ముప్పు
భారతీయ వ్యాపారాలు కస్టమర్ సర్వీస్, హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, లీగల్ రివ్యూ, బ్యాక్-ఆఫీస్ కార్యకలాపాల్లో ఏఐని వేగంగా అందిపుచ్చుకుంటున్నాయి. దీనివల్ల కంపెనీల సామర్థ్యం పెరిగి, ఖర్చులు తగ్గుతాయి. అయితే, దీని వెనుక మరో కోణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
భారత్ తన స్వదేశీ ఉద్యోగాలను ఆటోమేషన్ ద్వారా కోల్పోతూనే ఆ ఏఐ వ్యవస్థలను నడపడానికి విదేశీ ప్లాట్‌ఫారమ్‌లకు భారీగా డబ్బు చెల్లించాల్సి వస్తుంది.
భారతీయ కంపెనీల ఉత్పాదకత పెరిగినప్పటికీ లాభాల్లో సింహభాగం విదేశాల్లోని ఫౌండేషన్ మోడల్స్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జీపీయూ అధినేతలకే చేరుతుంది.
భారత్ కేవలం ఒక భారీ వినియోగదారు దేశంగా మాత్రమే మిగిలిపోయి కోర్ టెక్నాలజీ నియంత్రణ అంతా విదేశాల పాలయ్యే ప్రమాదం ఉంది.
భారత్ ఏం చేస్తోంది?
ఈ సవాలును గుర్తించిన భారత్ ఇటీవలి కాలంలో కొన్ని కీలక అడుగులు వేసింది. సర్వమ్.ఏఐ, భారత్ జన్, జ్ఞాని.ఏఐ.. వంటి స్టార్టప్‌లు స్వదేశీ ఏఐ సామర్థ్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు అభినందనీయమే అయినప్పటికీ అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్ ఇంకా వెనుకబడే ఉంది. అధునాతన ఫౌండేషన్ మోడల్స్, జీపీయూల లభ్యత, లోతైన ఏఐ రీసెర్చ్ ఎకోసిస్టమ్, భారీ ప్రైవేట్ పెట్టుబడుల పరంగా భారత్ ఇంకా సుదీర్ఘ దూరం ప్రయాణించాల్సి ఉంది.
భారత్ ముందున్న వ్యూహాత్మక మార్గాలు
భారత్ గ్లోబల్ రేసులో నిలవాలంటే తక్షణమే కింది రంగాలపై దృష్టి పెట్టాలి.
| విభాగం | చేయాల్సిన మార్పు(సూచనలు మాత్రమే) |
|---|---|
| భాష, వాయిస్ ఏఐ | భారతీయ స్థానిక భాషలు, వాయిస్ ఆధారిత ఏఐల్లో ప్రత్యేక నైపుణ్యం సాధించడం. |
| కంప్యూట్ మౌలిక వసతులు | సరసమైన ధరల్లో దేశీయంగా ఏఐ కంప్యూట్/జీపీయూ సదుపాయాలు అందుబాటులోకి తేవడం. |
| ఐటీ రంగ పునర్నిర్మాణం | భారత ఐటీ కంపెనీలు కేవలం మ్యాన్‌పవర్-బేస్డ్ బిల్లింగ్ (గంటల లెక్కన పని) మోడల్స్ నుంచి ఏఐ, ఐపీ లీడ్ (సొంత మేధోసంపత్తి) ఫ్లాట్‌ఫారమ్‌లుగా మారాలి. |
| మానవ వనరుల నైపుణ్యం | దేశంలోని శ్రామిక శక్తికి పెద్ద ఎత్తున ఏఐ రీస్కిల్లింగ్ ప్రోగ్రాములు నిర్వహించడం. |
ఇప్పుడు ‘ఏఐ కావాలా వద్దా’ అనేదాని గురించి కాకుండా.. భారత్ కేవలం ఏఐని వాడే దేశంగా మిగిలిపోతుందా లేదా ఏఐ సామర్థ్యాలపై యాజమాన్య హక్కులు సాధిస్తుందా? అనేదే అసలైన ప్రశ్న. మోడల్స్, కంప్యూట్, డేటా, ప్లాట్‌ఫారమ్‌లపై స్వదేశీ నియంత్రణ సాధించకపోతే.. ఏఐ భారతదేశానికి ఉత్పాదకత ఇంజిన్‌గా మారవచ్చు, కానీ దాని లాభాలు మాత్రం వేరే ఎవరికో అందుతాయి! ప్రభుత్వాలు, కార్పొరేట్ శక్తులు ఇప్పటికైనా మేల్కొని దీర్ఘకాలిక వ్యూహాత్మక పెట్టుబడులతో ముందుకు సాగాల్సిన సమయమిది.
ఇదీ చదవండి: కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా!


