‘సర్‌ జీతం రాలేదు.. ఇన్సెంటివ్‌ ఎప్పుడు’ | LinkedIn Post Sparks Massive Debate, Why Employee Salaries Dont Rise With Company Profits, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

కంపెనీకి లాభాలొస్తే ఉద్యోగుల జీతం పెంచరు కదా!

Jun 2 2026 9:11 AM | Updated on Jun 2 2026 9:55 AM

Why Employee Salaries Dont Rise With Company Profits Harsh Truth

ఆధునిక కార్పొరేట్ ప్రపంచంలో యజమాని-ఉద్యోగి మధ్య బంధం కేవలం ‘నెలవారీ జీతం-పని’ అనే లావాదేవీకే పరిమితమా? లేక సంస్థ క్లిష్ట కాలంలో ఉన్నప్పుడు ఉద్యోగులు కూడా నైతిక బాధ్యత వహించాలా?- ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ వేదికగా జరుగుతున్న ఒక ఆసక్తికర చర్చ ఈ ప్రశ్నలను రేకిత్తించింది. ఒక సంస్థలో వారం రోజుల జీతం ఆలస్యం కావడం, దానికి ప్రతిస్పందనగా ఒక కంపెనీ వ్యవస్థాపకురాలు చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్లలో చర్చకు దారితీసింది. గీతికా కౌశిక్ అనే బిజినెస్ లీడర్ పంచుకున్న అభిప్రాయాలు, దానికి నెటిజన్ల స్పందన కింద చూద్దాం.

లక్ష్యాలు విఫలమైతే బాధ్యత ఎవరిది?

సంస్థల్లో వ్యాపార లక్ష్యాలు (బిజినెస్‌ టార్గెట్లు) నీరుగారినప్పుడు, జీతాలు ఆలస్యమైనప్పుడు వ్యవస్థాపకులు ఎదుర్కొనే మానసిక, ఆర్థిక ఒత్తిడిని గీతికా కౌశిక్ తన పోస్ట్‌లో ప్రస్తావించారు. ఇటీవల ఒక సంఘటనను ఉదహరిస్తూ.. కేవలం ఏడు రోజులు జీతం ఆలస్యమవడానికే ఉద్యోగులు తమ భద్రతను ప్రశ్నించారని ఆమె పేర్కొన్నారు. ‘ఉద్యోగులు ముందుకు వచ్చి.. మాకు ఇక్కడ ఉద్యోగ భద్రత లేదు. జీతాలు ఆలస్యమైతే కుటుంబం, ఈఎంఐల పరిస్థితి ఏమిటి? అని ప్రశ్నించడం నిజమే. వారి వైపు ఉన్న బాధ్యతలు, ఇబ్బందుల్లో నిజముంది. కానీ, నాణేనికి మరోవైపు ఉన్న మేనేజ్‌మెంట్‌ ఆవేదనను కూడా చూడాలి కదా?’ అని ఆమె ప్రశ్నించారు.

అత్యంత కీలకమైన పీక్ సీజన్‌లో 30 మందికి పైగా బృందాన్ని నడిపించే ఒక సీనియర్ మేనేజర్ కేవలం 20 శాతం టార్గెట్‌ను మాత్రమే రీచ్ అయ్యారని ఆమె ఎత్తి చూపారు. 70 శాతానికి పైగా బిజినెస్ లక్ష్యాలను చేరడంలో విఫలమై కూడా బాధ్యతను పక్కనబెట్టి కేవలం ‘సర్, జీతం రాలేదు?’, ‘సర్, ఇన్సెంటివ్స్ ఎప్పుడు?’ అని అడగడం ఎంతవరకు సమంజసమని ఆమె నిలదీశారు.

గౌరవంతో సంపాదించండి

వ్యాపారాన్ని నిలబెట్టడానికి, ఉద్యోగుల కుటుంబాలు సకాలంలో ఈఎంఐలు కట్టుకోవడానికి వ్యవస్థాపకులు తెరవెనుక ఎన్నో త్యాగాలు, ఆర్థిక ఇబ్బందులను భరిస్తుంటారని కౌశిక్ పేర్కొన్నారు. ‘రేపు ఆఫీస్‌కు వెళ్లే ముందు ఒక్కసారి ఆలోచించండి. మీ ఉద్యోగానికి, చేసే పనికి మోసం చేయకండి. ఏదో అలవాటుగా ఆఫీస్‌కు వెళ్లి రావడం కాదు.. మీ పని ద్వారా గౌరవప్రదంగా జీతాన్ని సంపాదించుకోండి’ అంటూ ఆమె తన పోస్ట్‌ను ముగించారు.

నెటిజన్ల స్పందన

ఈ పోస్ట్‌పై సోషల్ మీడియా వినియోగదారులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ రీ-పోస్టులు చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల పక్షాన నిలిచిన పలువురు నెటిజన్లు యజమానుల ధోరణిని తప్పుబట్టారు. ‘మీరు ఒక వ్యవస్థాపకుడిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడే.. అనిశ్చితి, ఒత్తిడి, నిద్రలేని రాత్రులు, ఆర్థిక నష్టాల రిస్క్‌ను మీరే ఎంచుకున్నారు. కానీ ఉద్యోగి అలా కాదు. సంస్థ ఎలాంటి స్థితిలో ఉన్నా సమయానికి జీతం ఇవ్వడం యజమాని కనీస బాధ్యత’ అని ఒక వినియోగదారుడు స్పష్టం చేశారు. ‘ఉపాధి అనేది ఒక ఒప్పందం, భాగస్వామ్యం కాదు. వచ్చే నెలలో కంపెనీ 500% లాభాల్లోకి దూసుకెళ్తే.. ఉద్యోగుల జీతాలు కూడా 500% పెరగవు కదా? అలాంటప్పుడు నష్టాలు లేదా టార్గెట్స్ రీచ్ అవ్వనప్పుడు ఉద్యోగులపై భారం వేయడం తగదు’ అని మరొకరు వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: పాపులర్‌ ఉద్యోగాల వెంటే పడకండి!

Advertisement
 
Advertisement
Advertisement