దేశంలోని 7 కోట్లకు పైగా ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) సభ్యులకు త్వరలో రెండు కీలక ప్రయోజనాలు అందుబాటులోకి రానున్నాయి. ఒకటి 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై వడ్డీ జమ, రెండోది ఈపీఎఫ్ సభ్యులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఏటీఎం, యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా సదుపాయం.
8.25 శాతం వడ్డీ
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగించాలని ఈపీఎఫ్ఓ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సిఫారసు చేయగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం అనంతరం ఈ నెలాఖరులోగా సభ్యుల ఖాతాల్లో వడ్డీ జమయ్యే అవకాశముందని సమాచారం. దీంతో వరుసగా మూడో ఏడాది కూడా సభ్యులకు 8.25 శాతం వడ్డీ లభించనుంది.
ఈపీఎఫ్ ఏటీఎం/యూపీఐ విత్‌డ్రా
ఇదే సమయంలో ఈపీఎఫ్ఓ తన సేవలను పూర్తిగా డిజిటల్ దిశగా మార్చే ‘ఈపీఎఫ్ఓ 3.0’ కార్యక్రమాన్ని వేగవంతం చేస్తోంది. ఈ కొత్త వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత సభ్యులు పేపర్‌లెస్ విధానంలో పీఎఫ్ క్లెయిమ్‌లు దాఖలు చేయడం, ఖాతాల బదిలీలు చేయడం, అలాగే అర్హత ఉన్న మొత్తాన్ని యూపీఐ లేదా యూపీఐ-సపోర్టెడ్ ఏటీఎంల ద్వారా నేరుగా తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకునే అవకాశం పొందనున్నారు. ఈ సదుపాయం కోసం అవసరమైన సాంకేతిక పరీక్షలు పూర్తయ్యాయని కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఇటీవల వెల్లడించారు. అయితే దేశవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభించే ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.
ప్రతిపాదిత విధానాల ప్రకారం సభ్యుల పీఎఫ్ నిధుల్లో కొంత భాగాన్ని రిటైర్మెంట్ భద్రత కోసం కొనసాగిస్తూ, అర్హత ఉన్న మొత్తంలో 50 నుంచి 75 శాతం వరకు యూపీఐ లేదా ఏటీఎం ద్వారా ఉపసంహరించుకునే అవకాశం కల్పించే దిశగా ఈపీఎఫ్ఓ పనిచేస్తోంది. అయితే ఈ నిబంధనలు ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదని, అధికారిక మార్గదర్శకాలు వెలువడిన తర్వాతే తుది వివరాలు స్పష్టమవుతాయని అధికారులు చెబుతున్నారు.
ఇక సభ్యుల సౌకర్యార్థం ఆటో-సెటిల్‌మెంట్ క్లెయిమ్ పరిమితిని ఇప్పటికే రూ.5 లక్షలకు పెంచిన ఈపీఎఫ్ఓ, వైద్యం, విద్య, గృహ నిర్మాణం, వివాహం వంటి అవసరాలకు సంబంధించిన క్లెయిమ్‌లను సాధ్యమైనంత వేగంగా పరిష్కరించే చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో ఉమాంగ్ యాప్‌లో ఫేస్ ఆథెంటికేషన్, వాట్సాప్ ఆధారిత సేవలు, తక్షణ పాస్‌బుక్ యాక్సెస్, ఆన్‌లైన్ వివరాల సవరణ వంటి సదుపాయాలు కూడా మరింత విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి.


