PC: BCCI/IPL
ఐపీఎల్-2026 ఆరంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)- సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) అభిమానుల మధ్య సోషల్ మీడియా యుద్ధం మొదలైపోయింది. మైదానంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు చెన్నై కచ్చితంగా ‘సినిమా’ చూపిస్తుందంటూ సీఎస్‌కే ఫ్యాన్స్ సవాలు విసరుతుండగా.. తమ జట్టు సత్తా ఏమిటో మైదానంలోనే చూస్తారంటూ ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు.
అసలేం జరిగిందంటే.. సీజన్ ఆరంభానికి ముందు ఫ్రాంఛైజీలు తమ కొత్త జెర్సీల ఆవిష్కరణ, కొత్తగా వచ్చిన ఆటగాళ్లకు ఆహ్వానం పలికే క్రమంలో వినూత్న రీతిలో వీడియోలు రూపొందించడం పరిపాటి. సోషల్ మీడియాలో బజ్ క్రియేట్ చేసేందుకు, అభిమానులను అలరించేందుకు ఇలాంటి వీడియోలు ఉపయోగపడతాయి.
హుకుమ్, అల్తోప్పా, డిస్కో రీమిక్స్
సీఎస్‌కే సైతం దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, రాజస్తాన్ నుంచి సీఎస్‌కేలోకి వచ్చిన సంజూ శాంసన్ సహా కీలక ఆటగాళ్లపై వీడియోలు రూపొందించింది. అయితే, ఇందులో సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాలకు సంబంధించిన జైలర్, కూలీ, జైలర్-2ల మ్యూజిక్ వాడుకుంది.
ముఖ్యంగా హుకుమ్, అల్తోప్పా, డిస్కో రీమిక్స్ వంటి ట్రాక్స్‌ను తమ ఆటగాళ్లకు హైప్ ఇచ్చే క్రమంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌గా వాడుకుంది. ఈ పాటలు, సంగీతానికి అనిరుద్ రవిచంద్రన్ రూపకర్త. ఈ నేపథ్యంలో సీఎస్‌కే తమ ఆటగాళ్ల హీరో ఎడిట్స్‌కు ఈ సంగీతం వాడుకోవడంపై సన్ టీవీ గ్రూపు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అనుమతి లేకుండానే
ఈ పాటలు తమకు చెందేలా అనిరుద్ రవిచంద్రన్ రాత పూర్వక ఒప్పందం కుదుర్చుకున్నారని.. అయితే, సీఎస్‌కే మాత్రం తమ వాణిజ్య లాభం కోసం అనుమతి లేకుండానే మ్యూజిక్‌ను వాడుకుంటోందని కోర్టుకెక్కింది. ఇందుకు సంబంధించి మార్చి 13న సన్ టీవీ నెట్‌వర్క్ మద్రాస్ హైకోర్టులో కాపీరైట్ ఉల్లంఘన కింద సీఎస్‌కేపై పిటిషన్ దాఖలు చేసింది.
లైసెన్స్ వచ్చేదాకా
ఈ విషయంపై సీఎస్‌కే న్యాయవాది పీఎస్ రామన్ వాధిస్తూ.. గత మూడేళ్లుగా చెన్నై జట్టు ఈ మ్యూజిక్‌ను వాడుకుంటోందని.. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకని ప్రశ్నించారు. సన్ టీవీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాము అస్సలు ఊహించలేదన్నారు.
ఏదైమైనా సన్ పిక్సర్చ్ లేదంటే ఫొనోగ్రాఫిక్ పెర్ఫామెన్స్ లిమిటెడ్ నుంచి లైసెన్స్ వచ్చేదాకా తాము జైలర్, కూలీ, జైలర్ 2 మ్యూజిక్‌ను వాడబోమని స్పష్టం చేశారు. అదే విధంగా.. ఇప్పటికే ఈ మ్యూజిక్‌తో కూడిన వీడియోలను డిలీట్ చేసిన విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.
కావ్యా మారన్‌పై నెట్టింట ట్రోలింగ్
ఈ క్రమంలో జస్టిస్ సెంథిల్‌కుమార్ రామమూర్తి ఈ కేసును మార్చి 16కు వాయిదా వేశారు. పిటిషన్‌దారుకు సంబంధించిన ఆడియో మెటీరియల్‌ను తాము వాడటం లేదన్న విషయాన్ని ధ్రువీకరిస్తూ సీఎస్‌కే అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.
కాగా ‘ది హండ్రెడ్ లీగ్’- 2026 వేలంలో పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసినందుకు సన్‌రైజర్స్ లీడ్స్ యజమాని, సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కావ్యా మారన్‌పై నెట్టింట విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కేను కోర్టుకు ఈడ్చటంపై కూడా దుమారం రేగుతోంది.


