సురేంద్ర కోలీ
ఇరవై ఏళ్ల నాటి నిఠారీ వరుస హత్యల కేసులో నిర్దోషి త్వాల తీర్పు భారత నేర దర్యాప్తు వ్యవస్థలోని వైఫల్యాలను బట్టబయలు చేసింది. 16 మంది మహిళలు, పిల్లల హత్య కేసులో నిందితుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు నవంబర్ 11న చెప్పిన తీర్పుతో పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే!
యావత్ దేశాన్నీ దిగ్భ్రాంతికి గురి చేస్తూ నోయిడా(ఉత్తరప్రదేశ్)లోని నిఠారీ గ్రామంలో డ్రైనేజీలో మానవ అవశేషాలు బయటపడి దాదాపు ఇరవై ఏళ్లు గడచిన తర్వాత కూడా, ఏ ఒక్కరూ దోషిగా నిర్ధారణ కాలేదు. 16 మంది మహిళలు, పిల్లల ‘నిఠారీ’ హత్య కేసులో నింది తుడిగా ఉన్న చిట్టచివరి వ్యక్తి సురేంద్ర కోలీకి విముక్తి కల్పిస్తూ సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు ‘నేర న్యాయ’ వ్యవస్థలోని దారుణ వైఫల్యాలను బట్టబయలు చేసింది. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రులకు మిగిలింది సమాధానం లేని ప్రశ్నలే.
కీలక ఆధారాలు లేకపోవడం వల్లే...
2006 చివర్లో నిఠారీ గ్రామ సమీపాన 31వ సెక్టార్లో మురుగు కాల్వల పూడిక తీస్తుంటే దిగ్భ్రాంతికరమైన దారుణాలు వెలుగు చూశాయి. అంతకంటే ముందు, డి–5, డి–6 ఇళ్ల మధ్య ఒక చెయ్యి కనబడింది. క్రికెట్ ఆడుతున్న కుర్రాడు దాన్ని చూశాడు. అదే ఏడాది డిసెంబర్‌లో ఈ బంగ్లాల వెలుపల ఉన్న డ్రెయిన్లో మట్టి తొలగించడంతో అక్కడ అనేక పుర్రెలు, ఎముకలు, పీలికలైన పిల్లల దుస్తులు, చిన్ని చిన్ని చెప్పులు దొరికాయి.
డి–5 ఇంట్లో పనిచేసే సురేంద్ర కోలీ అనే వ్యక్తి, ఇంటి యజమాని, వ్యాపారవేత్త మోనిందర్ సింగ్ పంఢేర్ ఈ మారణకాండకు బాధ్యులని పోలీసులు అనుమానించారు. పోలీసుల కథనం ప్రకారం – పిల్లలను, ఆడవారిని కోలీ ప్రలోభపెట్టి ఇంటికి రప్పించే వాడు. తర్వాత వారిని హత్య చేసేవాడు. కొన్నిసార్లు హతుల శరీర భాగాలను తిన్నాడు కూడా! ఈ అకృత్యాల్లో పంఢేర్ భాగస్వామి. భయానకమైన ఈ హత్యల కేసులో స్థానిక పోలీసుల విచారణ తీవ్ర విమర్శలకు దారి తీసింది. తమ దర్యాప్తులో భాగంగా ఇంటి మేడ పై భాగంలో నీళ్ల ట్యాంకు కింద దాచిన ఓ కత్తిని పోలీసులు ‘స్వాధీనం’ చేసుకున్నారు.
ఇది, ఇంకా అనేక వస్తువులు వారికి దొరికాయి. ఇవే వారి దర్యాప్తులో ‘కీలక ఆధారాలు’. వీటి ఆధారంగా వారు రూపొందించిన కథనాలను కోర్టులు విశ్వసించలేదు. దీంతో 2007 జనవరిలో దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగించారు. సీబీఐ సైతం స్థానిక పోలీసులు చేసిన తప్పిదాలనే పునరా వృతం చేసింది. కొన్ని వారాల తరబడి కస్టడీలో ఉంచి రికార్డు చేసిన కోలీ నేరాంగీకార పత్రం మీదే సీబీఐ అధికారులు ఆధారపడ్డారు. వారు రికవర్ చేసిన ఆధారాలు నమ్మదగినవిగా లేవు. కోలీ, పంఢేర్ ప్రమేయాన్ని నిరూపించగల సరైన ఫోరెన్సిక్ లింకులను కూడా సంపాదించలేక పోయారు.
స్థానిక పోలీసుల మీద ఆధారపడకుండా మళ్లీ మొదటి నుంచి సొంత దర్వాప్తు చేయడంలో సీబీఐ విఫలమైంది. నేరాంగీకారాలు, రికవరీలు, ఆధారాలను అటూయిటూ చేసి... మోపిన 13 కేసుల్లోనూ వాటినే కోర్టుల ముందుంచారు. కాబట్టే, పై కోర్టులు అన్నీ ఒకదాని తర్వాత మరొకటి వాటన్నిటినీ కొట్టేశాయి. నేరాంగీకార పత్రాలు, నేరాలకు సంబంధించిన రికవ రీలు అన్నీ అంతకు ముందు కొట్టేసిన ఇతర కేసుల్లో ఉన్నట్లే ఏ మాత్రం తేడా లేకుండా ఈ కేసులోనూ ఉన్నాయని సుప్రీంకోర్టు తాజాగా నవంబర్ 11 నాటి తీర్పులో గుర్తించింది.
మరి నేరస్థులు ఎవరు?
తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రుల విషయానికి వస్తే, వారి పాత గాయాలు ఈ తీర్పుతో మళ్లీ రేగాయి. 2005లో తమ పిల్లలు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది ఈ బాధితులే! డి–5 ఇంటి ముందు తొలుతగా నిరసన చేసింది వీరే. న్యాయస్థానంలో చివరి దాకా పోరా డింది కూడా వీరే. చివరకు కోర్టు తీర్పుతో తమ పిల్లలను ఎవరూ చంపలేదన్న ‘న్యాయపరమైన వాస్తవం’ వారిని వెక్కిరిస్తోంది. ఏళ్ల తరబడి సుదీర్ఘంగా దర్యాప్తు జరిగినప్పటికీ, నిజమైన ద్రోహులెవరో నిరూపణ కాకపోవడం పట్ల న్యాయస్థానం తీవ్ర విచారం వ్యక్తం చేసి వారి బాధను గుర్తించింది. నిర్లక్ష్యం వహించి, అసాధారణ జాప్యం చేసి నిజనిర్ధారణ ప్రక్రియ పట్ల విశ్వాసం సన్న గిల్లేలా చేశాయంటూ దర్యాప్తు సంస్థలను తప్పు పట్టింది. అవయ వాలతో వ్యాపారం చేసే ముఠాల ప్రమేయం వంటి కొత్త కోణాల నుంచి దర్యాప్తు చేపట్టలేక పోయాయని నిందించింది.
నిఠారీ కేసు నిర్దోషిత్వాల తీర్పులు భారత నేర దర్యాప్తు వ్యవస్థకు సోకిన రోగం లక్షణాలను కళ్లకు కట్టాయి. ప్రతి స్థాయి లోనూ వ్యవస్థ విఫలమైంది. స్థానిక పోలీసులు క్రైమ్ సీన్‌ను పరిరక్షించలేకపోయారు. సరైన ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించలేక పోయారు. ఈ లోపాలను చక్కదిద్దడంలో సీబీఐ విఫలమైంది. కొత్త కోణాలను గుర్తించలేక పోయింది. న్యాయ పరీక్షకు నిలబడేలా పకడ్బందీ వాదనలు చేయడంలో ప్రాసిక్యూటర్లు విఫలమయ్యారు. బాధితుల ఘోర విషాదాన్ని వ్యవస్థల ప్రహసనంగా మార్చి, ప్రభుత్వం వారికి తీవ్రమైన నిరాశ కలిగించింది.
సుప్రీం కోర్టు తాజా తీర్పుతో కోలీ జైలు నుంచి బయటకు వచ్చాడు. పంఢేర్ ఇప్పటికే నేర విముక్తుడు. న్యాయస్థానం చట్టాలకు లోబడి వ్యవహరించింది. తిరుగులేని రుజువులు ఉంటే తప్ప కోర్టు శిక్ష విధించలేదు. తమ పిల్లల మసకబారిన పాత ఫొటోలను పట్టు కుని ఆ తల్లిదండ్రులు క్షోభపడుతూ ఉంటే, న్యాయం అమూర్తంగా మారిపోయింది. నిఠారీలో చట్టం తన చివరి మాటను చెప్పేసింది. ఇక మిగిలింది నిశ్శబ్దమే! అది చెవులు పగిలిపోయేంత కఠోరంగా ఉంది.

-ఉత్కర్ష్ ఆనంద్
వ్యాసకర్త లీగల్ అంశాల జర్నలిస్ట్
(‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో)


