రాష్ట్ర ప్రభుత్వాలకూ, గవర్నర్లకూ తలెత్తే వివాదాల విషయంలో చివరకు కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అయింది. శాసనసభలు ఆమోదించాక రాష్ట్ర ప్రభుత్వాలు పంపే బిల్లుల్ని నెలల తరబడి పెండింగ్‌లో ఉంచుకోవటాన్ని తప్పుబడుతూ మొన్న ఏప్రిల్‌లో తమ ద్విసభ్య ధర్మాసనం వెలువరించిన తీర్పును గురువారం సర్వోన్నత న్యాయస్థానపు రాజ్యాంగ ధర్మాసనం తప్పుబట్టింది. రాష్ట్రపతికీ, గవర్నర్లకూ గడువు విధించటం చెల్లదని అభిప్రాయపడింది.
ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును నేరుగా ప్రస్తావించకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నల రూపంలో సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయాన్ని కోరిన మీదట రాజ్యాంగ ధర్మాసనం తన ఉద్దేశాన్ని తెలియజేసింది. రాజ్యాంగ విధులు నిర్వర్తించే సందర్భంగా ఆచరణలో తలెత్తే సమస్యల విషయంలో ఏ పక్షానికీ గెలుపోట ములుండవు. మూడు వ్యవస్థల్లో ఏ ఒక్కటి రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమైన ఆచరణ కనబరచకపోయినా అంతిమంగా నష్టపోయేది ప్రజలే. అలా చూస్తే రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయం కొంత నిరాశ కలిగిస్తుంది.
గవర్నర్లకూ, ప్రభుత్వాలకూ తలెత్తే వివాదాలు జటిలమైనవి. ఎన్నికల సమయంలో పలు వాగ్దానాలు చేసి అధికారంలోకొచ్చిన పక్షం తన వాగ్దానాలు నెరవేర్చటం కోసం లేదా ప్రజల ప్రయోజనాల కోసం బిల్లులు తెస్తాయి. చట్టసభల్లో అవి ఆమోదం పొందు తాయి. తీరా గవర్నర్ల దగ్గర నెలల తరబడి పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. మరి ప్రజలిచ్చిన రాజకీయాధికారం ఏమై పోవాలి? కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ లేదా కూటమి పాలిస్తుంటే ఇలాంటి సమస్య తలెత్తదు. భిన్నమైన పరిస్థితులున్నప్పుడే ఇబ్బందులేర్పడుతున్నాయి.
కేంద్రంలో యూపీఏ ఉన్నా, ఎన్డీయే ఉన్నా ఇదే ధోరణి. రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ సంగతిని గమనించింది. బిల్లుల్ని పరిశీలించటంలో రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే వ్యవధికి ఒక స్థాయి ‘స్థితిస్థాపకత’ ఉంటుందని అంగీకరి స్తూనే దీర్ఘకాలం బిల్లును పెండింగ్‌లో పెట్టడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పడం కొంతవరకూ రాష్ట్రాలకు ఊరట.
రాష్ట్రపతి సంధించిన ప్రశ్నలపై అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాం తప్ప ద్విసభ్య ధర్మాసనం లోగడ వెలువరించిన తీర్పుతో దీనికి సంబంధం లేదని రాజ్యాంగ ధర్మాసనం చెప్పడం గమనార్హం. గవర్నర్లు ఏళ్ల తరబడి బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టి ప్రజల ద్వారా ఎన్నికైన చట్టసభల్ని నిరర్థకంగా మార్చడం సరికాదని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో గవర్నర్లకు హితవు చెప్పింది. కానీ మారిందేమీ లేదు.
అందుకే కావొచ్చు... ద్విసభ్య ధర్మాసనం రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద తనకు దఖలు పడిన అధికారాలను వినియోగించుకుంటూ బిల్లు ఆమోదానికి గవర్నర్లకూ, రాష్ట్రపతికీ మూడు నెలల గడువు విధించి, ఆ తర్వాత ఆమోదం పొందినట్టే భావించాలన్నది. ఇది సరి కాదని, ఇలా చేయటమంటే ఒక రాజ్యాంగ వ్యవస్థ మరో రాజ్యాంగ వ్యవస్థ అధికారాలను చేతుల్లోకి తీసుకోవటమే అవుతుందని ధర్మాసనం తెలిపింది.
అదే సమయంలో గవర్నర్లు బిల్లులపై ఏదో ఒకటి చెప్పటానికి ‘హేతుబద్ధమైన వ్యవధి’కి మించి తీసుకుంటే మాత్రం సమీక్షించే అధికారం ఉంటుందని రాజ్యాంగ ధర్మాసనం చెప్పటం రాష్ట్రాలకు కొంత వరకూ ఉపశమనం. రాష్ట్రపతికిచ్చిన ప్రత్యుత్తరంలో ‘హేతుబద్ధమైన వ్యవధి’ అనడం తప్ప, దాన్ని ఎలా నిర్ధారించాలన్నది చెప్పలేదు. అదే జరిగుంటే గవర్నర్ల పెత్తనానికి కాస్తయినా అడ్డుకట్ట పడేది. రాజ్యాంగ ధర్మాసనం ఈ విషయంలో మౌనంగా ఉండి పోవటం వల్ల ఎప్పటిలాగే బిల్లు ఆగిపోయినప్పుడల్లా న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదు.
రాజ్యాంగ అధికరణం 200 ప్రకారం తన ఆమోదం కోసం వచ్చిన బిల్లుపై గవర్నర్ ముందు మూడు ప్రత్యామ్నాయాలుంటాయి. ఆమోదించటం, రాష్ట్రపతి పరిశీలనకు పంపటం, వెనక్కి తిప్పిపంపటం. ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంపిక చేసుకోవాలన్నది గవర్నర్‌కుండే విచక్షణాధికారం. కానీ ఇదంతా సవ్యంగా సాగకపోవటమే సమస్య. గవర్నర్ల నియామకాలు రాజకీయపరమైనవి అయినప్పుడు వారి నిర్ణయాలపైనా ఆ ప్రభావం పడుతుంది. చట్టం చేయటమే ఇందుకు పరిష్కారమని రాజ్యాంగ ధర్మాసనం అన్నది. కానీ అది జరిగే పనేనా?!


