నరదృష్టికి నాపరాళ్లయినా పగులుతాయంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏణ్ణర్ధం నుంచి ప్రజల్ని పాలించటం కాదు... వారిని బాధించటమే పనిగా పెట్టుకున్న కూటమి సర్కారువారి వక్రదృష్టి సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాలపై కూడా పడింది. అందుకే 3,878 ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల విద్యాలయాల్లో చదువుకుంటున్న దాదాపు ఆరున్నర లక్షలమంది విద్యార్థులు అవస్థల పాలవుతున్నారు. వెన్నుపోటుతో అధికారానికి ఎగ బాకినా, కూటమి పేరుతో అందలం ఎక్కినా చంద్రబాబుకు సంక్షేమం పేరు వింటే తేళ్లూ జెర్రులూ పాకినంత పనవుతుంది. అందుకే ఆయన ఏలుబడిలో అరకొర వసతులు, అర్ధాకలి బతుకులతోనే పిల్లల చదువులు తెల్లారుతున్నాయి. ఈసారి కూడా మినహాయింపు లేదు.
సంక్షేమ, ఆశ్రమ పాఠశాలల వసతి గృహాల్లో ఇటీవలి కాలంలో 45 మంది పిల్లలు చనిపోయిన విషయమై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయటంతోపాటు ఈ విషయంలో సమగ్ర నివేదిక అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిజానికి ఇలాంటి ఆదేశాలివ్వటం ఇది మొదటిసారేమీ కాదు. నిరుడు జూలైలో హాస్టళ్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన సందర్భంలో సైతం మౌలిక సదుపాయాల సమస్యను అధిగమించేందుకు మీ దగ్గరున్న ప్రణాళికేమిటో చెప్పాలంటూ ఇచ్చిన ఆదేశా లకు ఇంకా అతీగతీ లేదు.
హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు శతాబ్దాలుగా విద్యాగంధానికి నోచుకోని బడుగు, బలహీనవర్గాలకు చెందినవారు. ఊరికి మాత్రమే కాదు, విద్యకు కూడా వెలిగా బతుకులు వెళ్లదీసిన ఆ వర్గాలవారికి ప్రామాణిక విద్యనందించటంతోపాటు మెరుగైన ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించటం ప్రభుత్వాల బాధ్యత కావాలి. పిల్లల మరణానికి దారితీస్తున్న అనారోగ్య సమస్యలు మరీ పెద్దవేమీ కాదు. జ్వరం, కడుపు నొప్పి, వివిధ సాంక్రమిక వ్యాధులు. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే, పౌష్టికాహారం అందించ గలిగితే, నిర్ణీత వ్యవధిలో వైద్య శిబిరాలు నిర్వహిస్తుంటే... ఈ వ్యాధులు దరిచేరే అవకాశం ఉండదు. ఆ మాత్రం చేయటం కూడా చేతగాని ప్రభుత్వం రేపటి పౌరుల ఉసురు తీస్తోంది. ఈ మరణాలపై హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసిన రోజే అన్నమయ్య జిల్లా రాయవరం ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో 34 మంది పిల్లలు మధ్యాహ్న భోజనం తిని తీవ్ర అస్వస్థతకు లోనవటం బాబు నిర్వాకానికి అద్దం పడుతోంది.
వెలుగూ వికాసమూ లేక చీకట్లో మగ్గిన తమ మాదిరిగా పిల్లలుండొద్దని, వారు మెరుగైన జీవితం గడపాలన్న ఆరాటంతో తల్లిదండ్రులు తమ కంటిపాపలను దూరమైనా పంపుతున్నారు. అలాంటివారిని ఎంత సున్నితంగా చూసుకోవాలో, ఎంత సురక్షితమైన సదుపాయాలు కల్పించాలో తెలియని చర్మం మందం సర్కారిది. వైఎస్సార్ కాంగ్రెస్ పాలనలో మెరుగైన విద్యతోపాటు బడుల్లో, హాస్టళ్లలో ఆర్వో ప్లాంట్లు నెల కొల్పారు. రుచికరమైన అల్పాహారం, భోజనం అందించారు. పరిశుభ్రమైన మరుగు దొడ్లు, స్నానపు గదులు నిర్మించారు. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు ప్రతి 15 రోజులకూ హాస్టళ్లు సందర్శించి రాత్రి బస చేయాలన్న నియమం పెట్టారు. అందుకే సమస్యలున్నా వెంటనే పరిష్కారమయ్యేవి. ఇప్పుడు అధికారుల సందర్శన మాట అటుంచి, అడిగే దిక్కూ మొక్కూ లేక హాస్టళ్లు బావురుమంటున్నాయి.
ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల పప్పు, నాణ్యత లేని కూరగాయలతో వంట చేస్తుండటంవల్ల పిల్లల ఆరోగ్యం నాశనమై వారు అస్వస్థులవుతున్నారని ఆర్నెల్ల క్రితమే ‘సాక్షి’ కథనాలు వెల్లడించాయి. చాలామంది వార్డెన్లు సరుకులు అప్పు తెస్తున్నారని, సరైన స్నానపుగదులు, మరుగుదొడ్లు లేక విద్యార్థినులు సైతం ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని ఆ కథనాలు తెలిపాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్ వంటి విద్యార్థి సంఘాలు ఉద్యమాలు చేశాయి. కానీ మారిందేమీ లేదు. మళ్లీ హైకోర్టు అక్షింతలు తప్పలేదు. మరణించిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలన్న ఇంగితం కూడా కరవైంది. కార్పొరేట్లకూ, కాంట్రాక్టర్లకూ దోచిపెట్టే విధానాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వస్తి పలకాలి. హాస్టళ్లను సకల సదుపాయాలతో తీర్చిదిద్దాలి. లేనట్టయితే ప్రజలే ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు.


