జస్టిస్ శ్రీనరసింహను సన్మానిస్తున్న హైకోర్టు న్యాయవాదుల సంఘం ప్రతినిధులు
కక్షిదారులు ఎంతో విషయ పరిజ్ఞానంతో ఉంటున్నారు
అందువల్ల ఆయా అంశాల్లో న్యాయవాదులు కక్షిదారుల కంటే ముందుండాలి
న్యాయవాదుల్లో స్వీయ అవగాహన, నిరంతర అధ్యయనం, సంస్థాగత మార్గదర్శనం అవసరం
పటిష్ట శిక్షణతో అవగాహన పెరుగుదల
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనరసింహ ఉద్ఘాటన
సాక్షి, అమరావతి: న్యాయాధికారులకు జ్యుడీషియల్ అకాడమీ ఉన్నట్లే... న్యాయవాదులకు శాశ్వత లీగల్ అకాడమీ ఉండాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం శ్రీనరసింహ అన్నారు. సీనియర్, యువ న్యాయవాదులు కలిసి ఆంధ్రప్రదేశ్ లీగల్ అకాడమీ పేరుతో ఒక సంస్థను ప్రారంభించాలని, దీనికి మొదట సహకారం అందించే వ్యక్తిని తానే అవుతానని కూడా ఆయన ప్రకటించారు. న్యాయవాదులకు లీగల్ అకాడమీ ఉండటం వల్ల న్యాయ వ్యవస్థలో తాజా పరిణామాలను శిక్షణ కార్యక్రమాల ద్వారా తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు.
మారిన పరిస్థితుల్లో కక్షిదారులు ఎంతో విషయ పరిజ్ఞానంతో ఉంటున్నారని పేర్కొంటూ అందువల్ల ఆయా అంశాల్లో న్యాయవాదులు కక్షిదారుల కంటే ముందుండాలన్నారు. గుంటూరులో శనివారం జరిగే ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన జస్టిస్ శ్రీనరసింహ శుక్రవారం హైకోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో న్యాయవాదులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. పెండింగ్ కేసుల పరిష్కారానికి మధ్యవర్తిత్వం మంచి అవకాశమని పేర్కొన్నారు. ఏఐ విప్లవాత్మక పరిస్థితుల నేపథ్యంలో న్యాయవాదుల్లో స్వీయ అవగాహన, నిరంతర అధ్యయనం, సంస్థాగత మార్గదర్శనం అత్యంత అవసరమన్నారు.
ఘన సన్మానం
ఈ సందర్భంగా హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కలిగినీడి చిదంబరం, ఉపాధ్యక్షుడు కేవీ రఘువీర్, ప్రధాన కార్యదర్శి చేజర్ల సుబోధ్, ఇతర కార్యవర్గం జస్టిస్ శ్రీనరసింహను ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తులు, అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు గ్రంథాలయాన్ని, హైకోర్టు నూతన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం రాత్రి జస్టిస్ నరసింహ గౌరవార్థం హైకోర్టు న్యాయమూర్తులందరూ విందు ఏర్పాటు చేశారు. కాగా, హైకోర్టుకు వచ్చిన జస్టిస్ శ్రీనరసింహను ఆయన పూర్వీకుల గ్రామమైన ప్రకాశం జిల్లా, మేదేపల్లి గ్రామానికి చెందిన పలువురు కలిసి, ఆయన తండ్రి దివంగత కోదండరామయ్య చిత్ర పటాన్ని అందచేశారు.
పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులు: జస్టిస్ శ్రీనరసింహ
వన్‌టౌన్(విజయవాడపశి్చమ): పుస్తకాలు ప్రాణం పోసుకున్న జీవులని జస్టిస్ శ్రీనరసింహ పేర్కొన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ఆవరణలో ఏర్పాటు చేసిన 36వ విజయవాడ పుస్తక మహోత్సవం శుక్రవారం ప్రారంభమైంది. ప్రారంభ సభకు ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ శ్రీనరసింహ జ్యోతి ప్రజ్వలన చేసి పుస్తక మహోత్సవాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ పుస్తక పఠనం గొప్ప సంస్కృతిగా అభివర్ణించారు. పిల్లలకు పుస్తక పఠనాన్ని అలవాటుగా మార్చాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు తీసుకోవాలన్నారు.


