ప్రతి 100 మందిలో 11 మంది బాధితులు
గ్రామాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ
పురుషుల కంటే మహిళల్లోనే మానసిక సమస్యలు అధికం
దేశంలో మానసిక వైద్యుల సంఖ్య సగటున లక్షమందికి 0.75 మంది మాత్రమే
పలు అధ్యయనాల్లో వెల్లడి
మానసిక సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఏయేటికాయేడు పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సమస్య ఉన్నప్పటికీ, అది భారత్‌లో ఒకింత ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే మానసిక రుగ్మతల బారిన పడుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. అలాగే, పురుషుల్లో కంటే మహిళల్లో ఈ రుగ్మతలు రెట్టింపు ఉన్నట్లు తేలింది. నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే–2015–16, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్)– 2019, లాన్సెట్ అధ్యయనం–2020 , మెంటల్ హెల్త్ అట్లాస్–2024, డబ్ల్యూహెచ్‌ఓ–2025 అధ్యయనాల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ
స్థాయిలో పెరుగుతున్న మానసిక రుగ్మతల తీరుతెన్నులు ఆందోళన కలిగిస్తున్నాయి.
దేశంలో ప్రతి 100 మందిలో 11 మందికి..
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడుగురిలో ఒకరు మానసిక రుగ్మతతో జీవిస్తుండగా.. భారత్‌లో ప్రతీ 100 మందిలో 11 మందికి ఈ సమస్యలు ఉన్నట్లు నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే స్పష్టం చేసింది. అలాగే ప్రతీ 100 మందిలో 14 మంది తమ జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి మానసిక సమస్యను ఎదుర్కొన్నట్లు తేలి్చంది. గ్రామాల్లో 6.9% మంది బాధితులు ఉండగా, పట్టణాల్లో ఈ సంఖ్య 13.5 శాతంగా ఉంది. అలాగే, మానసిక రుగ్మతలు పురుషుల (10%) కంటే మహిళల్లో (20%) అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. మహిళల్లో నిరాశ, ఆందోళన వంటి సమస్యల కారణంగా మానసిక రుగ్మతలు పెరుగుతున్నట్లు తేలింది. ప్రత్యేకంగా 15–29 ఏళ్ల మధ్య ఉన్న వారిలో నిరాశ, ఆందోళన లాంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక తెలిపింది. మానసిక సమస్యల్లో నిరాశ 6.2%, ఆందోళన 4.7% ప్రధానమైనవిగా మెంటల్ హెల్త్ అట్లాస్ పేర్కొంది.
ఆర్థిక భారం
అవగాహనలోపం, సామాజిక వివక్ష, నిపుణుల కొరత వల్ల 70% నుంచి 92% మంది సరైన మానసిక చికిత్స అందుకోవడం లేదని ఓ అధ్యయనంలో తేలింది. ప్రతీ లక్ష మంది జనాభాకు ముగ్గురు మానసిక వైద్యులు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేయగా, భారత్‌లో మాత్రం 0.75 మంది మానసిక వైద్యులే ఉన్నారు. మానసిక సమస్యలు మొత్తం ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని, ఆయుర్దాయం తగ్గడానికి కారణమవుతాయని తేలింది. మానసిక రుగ్మతల వల్ల ఉత్పాదకత తగ్గడం, వైద్యం వంటి పరోక్ష ఖర్చులు పెరగడం వల్ల ఆర్థికంగా నష్టం జరుగుతుందని డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక పేర్కొంది. 2030 నాటికి మానసిక రుగ్మతల కారణంగా వైద్య ఖర్చులు, పరోక్ష ఖర్చులతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థపై భారం 16 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని జర్నల్ ఆఫ్ మెంటల్ హెల్త్ స్పష్టం చేసింది.
అవీ ఇవీ..
⇒ మానసిక రుగ్మతల్లో మూడింట ఒక వంతు 14 ఏళ్ల వయస్సుకే మొదలవుతుండగా, సగం రుగ్మతలు 18వ ఏటి కల్లా, మూడింట రెండొంతులు 25 ఏళ్ల వయస్సు కల్లా మొదలవుతున్నాయి.
⇒ ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై కోవిడ్–19 మహమ్మారి ప్రభావం అధికంగా పడింది. ఆ సమయంలో బాధితుల సంఖ్య 25% పెరిగింది. ఉద్యోగాల కోతలు, ఆర్థిక అభద్రత వల్ల ఒత్తిడి స్థాయిలు, మానసిక సమస్యలు పెరిగాయి.
⇒ కేంద్ర ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రులు బెంగళూరు (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్)లో, తేజ్‌పూర్ (ఎల్‌జీబీఆర్‌ఐఎంహెచ్)లో, రాంచీ (సీఐపీ)లో ఉన్నాయి. అన్ని ఎయిమ్స్‌లలో మానసిక ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. మానసిక వైద్య సేవల కోసం టోల్ ఫ్రీ నంబర్లు: 14416, 1800–891–4416
⇒ 2023లో భారత్‌లో మానసిక రుగ్మతలతో ఆత్మహత్యలు చేసుకున్నవారు 1,71,418
⇒ వీరిలో 72.8% పురుషులు, 27.2% మహిళలు
⇒ ఈ సమస్యతో ఏటా ప్రపంచంలో జరిగే ఆత్మహత్యలు: 7,27,000
⇒ సాధారణ ప్రజలతో పోలిస్తే మానసిక రుగ్మతలున్న వారు ఆత్మహత్యలు చేసుకునే ముప్పు: 16 రెట్లు ఎక్కువ
⇒ నిరాశ వల్ల గుండె జబ్బుల వంటి సమస్యల ముప్పు: 72 శాతం అధికం


