త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ! | CM Revanth Reddy Comments At TGO diary launch | Sakshi
Sakshi News home page

త్వరలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ!

Jan 13 2026 2:23 AM | Updated on Jan 13 2026 5:05 AM

CM Revanth Reddy Comments At TGO diary launch

సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం డైరీని ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్, టీజీవో నాయకుడు ఏలూరి శ్రీనివాసరావు తదితరులు

ప్రజాభీష్టం మేరకు మండలాలు, రెవెన్యూ డివిజన్ల హేతుబద్ధీకరణ: సీఎం రేవంత్‌

గత ప్రభుత్వం రాజకీయ కోణంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది  

శాస్త్రీయత పాటించకపోవడంతో ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు 

ఈ పరిస్థితిని సరి చేయాలి.. దీనిపై వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో డిబేట్‌ పెడతాం 

సలహాలు, సూచనలు తీసుకుంటాం

కమిషన్‌ ఏర్పాటు చేసి నివేదిక మేరకు చర్యలు చేపడతాం

టీజీవో డైరీ ఆవిష్కరణలో ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను పునర్వ్యవస్థీకరించాల్సిన ఆవశ్యకత ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయత పాటించకుండా ఏర్పాటు చేసిన జిల్లాలు, మండలాలతో ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేవలం రాజకీయ విభజన కోణంలో ఏర్పాటు చేసిన జిల్లాలను ప్రజల అభీష్టం మేరకు హేతుబద్ధీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. సోమవారం సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవో) డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. 

అప్పట్లో అడ్డగోలుగా విభజన 
‘గత ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లాలు, మండలాలను ఇష్టానుసారంగా విభజించింది. ఒక జిల్లాలో ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంటే, మరో జిల్లాలో 14 ఉన్నాయి. ఇక మండలాలు, రెవెన్యూ డివిజన్ల విభజన అడ్డగోలుగా జరిగింది. జిల్లాల సంఖ్య తగ్గించడం, పెంచడం అని కాదు కానీ రేషనలైజేషన్‌ చేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి..ఒక మండలంలో ఎంత జనాభా ఉండాలి, ఒక డివిజన్‌లో ఎంత ఉండాలి, ఒక జిల్లాలో ఎంత ఉండాలనేది నిర్ణయించాలి. ప్రస్తుతం ఒక జిల్లాలో 3 లక్షల జనాభా ఉంటే ఒక జిల్లాలో కోటి జనాభా ఉంది. 

ఇలాంటప్పుడు పరిపాలన ఏవిధంగా చేస్తారు? ఇలాంటి సమస్యలు మా దృష్టికి వచ్చాయి. ఒక లీడర్‌ తనకు నచ్చిన 3, 4 గ్రామాలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకుంటే... మరొకాయన 2, 3 ఎంపీటీసీలతో ఒక మండలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఎంపీగా ఉన్నప్పుడు మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ సమావేశానికి వెళ్లా. వేదికపై చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఇద్దరు మాత్రమే కూర్చున్నారు. మరొకాయన రాలేదు. నాకు ఎవర్ని చూసి మాట్లాడాలో అర్థం కాలేదు. జిల్లా ఈ విధంగా ఉంటే ఎలా? ఇలాంటి తప్పిదాల వల్ల పాలనపై నమ్మకం పోతుంది. దీన్ని సరి చేయాలి..’ అని సీఎం అన్నారు. 

తొలుత మండలాల హేతుబద్ధీకరణ 
‘ముందుగా మండలాలను హేతుబద్ధీకరించాలి. మండలంలో 10 శాతం ఎక్కువ జనాభా లేదా తక్కువ.. రెవెన్యూ డివిజన్, జిల్లాల్లో కూడా ఇదే ఫార్ములాతో విభజన జరగాలి. దీనిపై అసెంబ్లీలో డిబేట్‌ పెడతాం. అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. మార్గదర్శకాలు రూపొందిస్తాం. కూలంకషంగా చర్చించిన తర్వాతే  విధివిధానాలు ఖరారు చేసి నిర్ణయం తీసుకుంటాం. శాస్త్రీయ పద్ధతిలో వీటిని హేతుబద్ధీకరించాలనేది ప్రభుత్వ నిర్ణయం. 

ఇందుకోసం ప్రత్యేకంగా హైకోర్టు లేదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో కమిషన్‌ను ఏర్పాటు చేస్తాం. ఇందులో రెవెన్యూ అధికారులతో పాటు సంబంధిత అధికారులంతా సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్‌ రాష్ట్రవ్యాప్తంగా ఆర్నెల్లు పర్యటించి ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తుంది. ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని ఆధారంగా చర్యలు తీసుకుంటాం. రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేస్తాం’ అని రేవంత్‌ తెలిపారు.  

సగటు మధ్య తరగతి ఉద్యోగి సంసారంలా.. 
‘రాష్ట్ర ప్రభుత్వంలో 10.5 లక్షల మంది ఉద్యోగుల సైన్యం ఉంది. సీఎం, మంత్రులు, ప్రజా ప్రతినిధులు కేవలం నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగులపైనే ఉంటుంది. ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల కలయికే ప్రభుత్వం. పదవీ విరమణ ప్రతి ఉద్యోగికీ వస్తుంది. ఆ రోజున తనకు అందాల్సిన ఆర్థిక లబ్ధి తీసుకోవడం అతని హక్కు. కానీ గత ప్రభుత్వం చేతకాక వయో పరిమితిని పెంచింది. 

అందువల్ల ఆ సమయంలో జరగాల్సిన రిటైర్మెంట్లు ఇప్పుడు జరుగుతున్నాయి. ఉద్యోగులకు గత ప్రభుత్వం రూ.11 వేల కోట్ల మేర బకాయి పెట్టింది. అలాగే కాంట్రాక్టర్ల బిల్లులకు రూ.42 వేల కోట్లు..ఇలా అన్నీ కలిపి రూ.1.11 లక్షల కోట్లు గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వానికి అప్పులు సంక్రమించాయి. ప్రస్తుతం క్రమ పద్ధతిలో పొదుపు చేస్తూ సగటు మధ్యతరగతి ఉద్యోగి సంసారం మాదిరి రెండేళ్లుగా శ్రమిస్తూ ఆర్థిక స్థితిని గాడిన పెడుతున్నాం. గతంలో ఉద్యోగులకు ఏ రోజున జీతాలు వచ్చాయి.. ఇప్పటి పరిస్థితి ఏమిటో సమీక్షించుకోవాలి.  

ఉద్యోగులకు పెద్దన్నగా ఓ తీపి కబురు 
ఉద్యోగులకు పెద్దన్న మాదిరిగా ఇక్కడికి వచ్చా. తీపి కబురు చెప్పకుండా ఉండడం సబబు కాదు. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ ఫైలుపై సంతకం చేసి వచ్చా. ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు రూపొందిస్తున్నాం. రూ.1.02 కోట్ల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం. ఉద్యోగులు పన్నుల వసూళ్లు, ఇతర ఆదాయం విషయంలో మరింత కృషి చేస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత వేగంగా గాడిన పడుతుంది. ఉద్యోగ సంఘ భవనం ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుంది. 

ముందుగా హైదరాబాద్‌లో రాష్ట్ర కార్యాలయం నిర్మించుకోవాలి. ఉద్యోగ సంఘం ఎంత నిధి ఇస్తుందో.. అదే స్థాయిలో ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తుంది..’ అని సీఎం చెప్పారు. టీజీవో అధ్యక్ష కార్యదర్శులు ఏలూరు శ్రీనివాసరావు, బి.శ్యామ్‌ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఏలూరు.. సచివాలయంలో విలేకరులకు తెలిపారు. పెండింగ్‌ బిల్లుల కింద ప్రస్తుతం ఇస్తున్న రూ.700 కోట్లను ఏప్రిల్‌ నుంచి రూ.1,500 కోట్లకు పెంచుతామని చెప్పారన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్న సీఎం, మంత్రులకు టీజీవో తరఫున ధన్యవాదాలు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement